మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం దారుణం
* రవాణా శాఖ ఉద్యోగుల సంఘం జోన్-2 అధ్యక్షుడు యం రాజుబాబు
విజయవాడ, సెల్ఐటి న్యూస్: రాష్ట్ర రవాణా సమాచార మంత్రి పేర్ని నానిపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, రవాణా శాఖ ఉద్యోగుల సంఘం జోన్2 అధ్యక్షుడు యం.రాజుబాబు అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు తావులేదని ఒకరిని మరొకరు చంపుకోవడం మనేది రాక్షసత్వం అవుతుందన్నారు. మంత్రి నాని వంటి సౌమ్యునిపై దాడికి పాల్పడటం అరాచకతత్వం అవుతుందని, తన తల్లిని కోల్పోయిన బాధలో ఉన్న ఆయనపై హత్యాయత్నానికి పాల్పడటం దారుణమన్నారు. అటువంటి దుర్మార్గానికి పాల్పడిన ఎంతటివారినైనా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల పథకాల్లో భాగంగా డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించే వాహనమిత్ర పధకంలోనూ, మహిళా ప్రయాణికులకు రక్షణగా నిలిచే అభయ ప్రాజెక్టు అమలులోనూ రవాణాశాఖ తరుఫున సహకారం అందించడంలో మంత్రి పేర్ని నాని పూర్తి విశ్వాసంతో పనిచేస్తున్నారన్నారు. రవాణాశాఖ ఉద్యోగుల పక్షాన అనేక సమస్యలపై మంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పుడు తాను ఉన్నాను అనే భరోసా కల్పించిన వ్యక్తి అని సమస్యల పరిష్కారానికి తానేం చేయాలి అని అడిగే గొప్ప వ్యక్తని కొనియాడారు. అటువంటి వ్యక్తిపై దాడికి పాల్పడటం బాధాకరమన్నారు. మంత్రి నానిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.