Published On: Mon, Nov 30th, 2020

మంత్రి పేర్ని నానీపై హ‌త్యాయ‌త్నం…

* తాపీతో దాడికి య‌త్నించిన దుండ‌గుడు

* నిందితుడ్ని పోలీసుల‌కు అప్ప‌గించిన మంత్రి గ‌న్‌మెన్లు, అనుచ‌రులు

* మంత్రిని ప‌రామ‌ర్శించిన డీజీపీ, హోంమంత్రి

మచిలీపట్నం(కృష్ణాజిల్లా), సెల్ఐటి న్యూస్‌: కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని వెంక‌ట్రామ‌య్య (నాని)పై ఆదివారం ఊహించ‌ని విధంగా జ‌రిగిన హత్యాయత్నం ఘటన సంచలనం సృష్టిస్తోంది. నాగేశ్వరరావు అనే తాపీమేస్త్రీ తాపీతో మంత్రిపై దాడికి యత్నించాడు. అయితే మంత్రి అనుచరులు వెంటనే అప్రమత్త‌మై అడ్డుకోవడంతో మంత్రి క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనపై మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. దాడి ఘటన గురించి వివరించారు. ‘‘ఈ రోజు మా తల్లిగారి పెద్దకర్మ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించాం. పూజలన్నీ పూర్తి చేసుకుని భోజనాల దగ్గరకు వెళ్తున్నాను. మా ఇంటివద్దకు ప్రజలు చాలామంది వచ్చారు. వారందరినీ పలకరిస్తూ గేటు దగ్గరకు వచ్చాను. అక్కడ ఒకతను తల వంచుకుని కాళ్లకు దండం పెట్టడానికి వస్తున్నట్లుగా ముందుకు వచ్చాడు. దగ్గరకు వచ్చాక చూస్తే.. ఐరన్‌ది ఏదో పొట్టలో నుంచి తీసి పొడవడానికి ప్రయత్నించాడు. అయితే మొదటి సారి విఫలం అవడంతో రెండో సారి పొడవడానికి ప్రయత్నిస్తుంటే నా చుట్టూ ఉన్నవాళ్లు వచ్చి పట్టుకున్నారు. అతను ఎందుకిలా చేశాడో నాకు తెలీదు. నేనైతే సురక్షితంగా ఉన్నా. అతను బలరాంపేటకు సంబంధించిన వ్యక్తి. నేను గుర్తు పట్టాను. గన్‌మెన్లు అతడిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. నాకు ఏమీ కాలేదు. ఎవరూ ఆందోళన చెందవద్దు.’’ అని మంత్రి పేర్ని నాని తెలిపారు. మంత్రి పేర్ని నానిపై జరిగిన దాడి ఘటనపై హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత స్పందించారు. ఆదివారం సాయంత్రం డీజీపీ గౌతం సవాంగ్‌తో కలిసి మంత్రి పేర్ని నానిని హోంమంత్రి పరామర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నిస్పక్షపాతంగా కేసు విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటాం అన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉండే ప్రజా నాయకుల్లో మంత్రి పేర్ని నాని వంటి వ్యక్తిపై దాడి జరగడం బాధాకరం అని పేర్కొంటూ దాడిని ఖండించారు. ఇటువంటి చర్యలను సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం సహించద‌న్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి టీడీపీ సానుభూతిపరుడని, పోలింగ్ ఏజెంట్‌గా కూడా వ్యవహరిస్తాడని తెలుస్తోంద‌న్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తున‌కు పోలీసులను ఆదేశించిన‌ట్లు చెప్పారు. ద‌ర్యాప్తు ముగిసిన తర్వాత అన్ని విషయాలను పోలీసులు వెల్లడిస్తార‌ని పేర్కొన్నారు. 

Just In...