Published On: Mon, Mar 23rd, 2020

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

* ‘కరోనా’ కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు పకడ్బంది చర్యలు

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: కోవిడ్-19 వైరస్ నివారణకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశమంతా 22వ తేదీ (ఆదివారం)న  ‘జనతా కర్ఫ్యూ’కి సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలలో కీలకమైన ఇంటర్ నెట్ సదుపాయంపై మంత్రి గౌతమ్ రెడ్డి ఐ.టీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్‌తో ప్రత్యేకంగా చర్చించి పలు సూచనలు ఇచ్చారు. ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తోన్న ఉద్యోగులు, విద్యార్థులు, ఐ.టీ ఉద్యోగులకు ఏ ఇబ్బంది కలగకుండా 24 గంటల ఇంటర్ నెట్ సౌకర్యాన్ని అందించాలని మంత్రి మేకపాటి సూచించారు. సామాజిక దూరం పాటిస్తూనే కీలకమైన విధులు నిర్వహించే ప్రతి ఒక్కరికీ టెలికమ్ సేవలు కూడా అంతరాయం కలగకుండా చూడాలని మంత్రి తెలిపారు. వారి ప్లాన్‌లకు అనుగుణంగా ఇంటర్ నెట్, టెలికమ్ సేవలను తప్పనిసరిగా అందించేలా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. అందుకోసం ఫీల్డ్ లెవల్‌లో పని చేసే సిబ్బందిని సిద్ధంగా ఉంచుకుని ఎలాంటి సాంకేతిక కారణాల వలన ఇబ్బంది కలగకుండా చూడాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందకుండా చూడడంలో ప్రతి పౌరుడి బాధ్యత అని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. భారత జాతిని రక్షించేందుకు సరిహద్దుల్లో సమరం చేసే జవాన్లతో సమానంగా కరోనాపై యుద్ధం చేసే వారంతా తన దృష్టిలో వీరసైనికులని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. అవగాహన కలిగి, బాధ్యతగా ఉండి, నియమ నిబంధనలకు అనుగుణంగా అందరూ తమ కర్తవ్యాన్ని పూర్తి చేయాలని , ప్రత్యేకంగా యువత భాగస్వామ్యంతో కరోనా ప్రక్షాళనకు కృషి చేయాలని మంత్రి గౌతమ్ రెడ్డి కోరారు.

Just In...