Published On: Thu, Nov 14th, 2019

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని కలిసిన హెచ్‌సీఎల్ ప్రతినిధులు

* ప్రతిష్ఠాత్మక ‘టెక్ బీ’ కార్యక్రమం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు

* శిక్షణ అందించాలన్న మంత్రి ప్రతిపాదనకు  ప్రతినిధుల అంగీకారం

* యువతకు శిక్షణ అందించేందుకు వసూలు చేసే ఖర్చు తగ్గించాలని కోరిన మంత్రి

* జనవరి నుంచి హెచ్‌సీఎల్ శిక్షణ కార్యక్రమాలను సందర్శించాలని మంత్రిని కోరిన ప్రతినిధులు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌత‌మ్‌రెడ్డితో హెచ్ సీఎల్ ప్రతినిధుల భేటీ అయ్యారు. వెలగపూడి సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. నైపుణ్య శిక్షణ గురించి సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. యువతీ, యువకులకు నైపుణ్య శిక్షణ అందించే విధివిధానాలను, కొత్త కోర్సులు, సదుపాయాల వంటి విషయాలను హెచ్ సీఎల్ ప్రతినిధులు మంత్రికి వివరించారు. హెచ్ సీఎల్   క్యాంపస్ ని సందర్శించాలంటూ ప్రతినిధులు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఆహ్వానం పలికారు. హెచ్‌సీఎల్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘టెక్ బీ’ కార్యక్రమం ద్వారా  ‘స్థానిక యువత’కు ఉపాధి అవకాశాలు, శిక్షణ అందించాలన్న మంత్రి ప్రతిపాదనకు  ప్రతినిధుల అంగీకారం తెలిపారు. వచ్చే జనవరి నుంచి హెచ్ సీఎల్  ప్రారంభించనున్న శిక్షణపరమైన కార్యక్రమాలను సందర్శించాలని  హెచ్ సీఎల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి రవిశంకర్  మంత్రిని కోరారు. యువతకు శిక్షణ అందించేందుకు వసూలు చేసే ఖర్చు తగ్గించాలని మంత్రి కోరారు. అందుకు ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. చర్చలో భాగంగా,   నైపుణ్య రంగంలో శిక్షణపరమైన అంశాలలో ప్రభుత్వంతో భాగస్వామ్యమయ్యేందుకు ఆసక్తిగా ఉన్నట్లు హెచ్ సీఎల్ ప్రతినిధులు మంత్రికి తెలిపారు.  తనతో జరిగిన భేటీలోని చర్చ సారాంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి మేకపాటి ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఎల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రవిశంకర్ పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ’23వ ప్రాడక్ట్ – కమ్- కాటలాగ్ షో’ కార్యక్రమానికి  పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  వస్త్ర పరిశ్రమలో వివిధ రాష్ట్రాల్లో వినియోగించే వినూత్న యంత్రాల ప్రదర్శనను మంత్రి తిలకించారు. ఇండియన్ టెక్ట్‌టైల్ యాక్ససరిస్, యంత్రాల తయారీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం  హాయ్ ల్యాండ్ రిసార్ట్ లో  నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు..  ప్రపంచ మార్కెట్ లో వస్త్ర  పరిశ్రమలు  అభివృద్ధి చెందేలా ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి వెల్లడించారు. గ్రామీణ మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలను పెంచే  విధంగా వస్త్ర పరిశ్రమకు సంబంధించి ప్రత్యేక పాలసీ తీసుకు రానున్నామని మంత్రి మేకపాటి  వెల్లడించారు. అధునాతన యంత్రాల వినియోగంతో ఉత్పత్తి చేసే విషయంలో భారతదేశం అగ్రశ్రేణి దేశాలలో ముందుందని అన్నారు. 4.5 కోట్ల మంది ప్రత్యక్ష్యంగా ఉపాధి పొందుతున్న వస్త్ర పరిశ్రమ అభివృద్ధి ఎంతో కీలకమన్నారు మంత్రి మేకపాటి. ప్రపంచంలోనే వస్త్ర ఉత్పత్తి చేసే దేశాల్లో భారతదేశం రెండో స్థానంలో ఉందన్నారు. ప్రత్యేకించి వస్త్ర పరిశ్రమకు మూలాధారమైన పత్తి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రపథంలో ఉందన్నారు. వస్త్రాలను నాణ్యమైన రీతిలో ఆకర్షణగా తీర్చిదిద్దడంలో ఆంధ్రప్రదేశ్ కళాకారుల నైపుణ్యం ప్రత్యేకంగా కొనియాడదగినదన్నారు మంత్రి మేకపాటి. నాణ్యమైన  వస్త్ర ఉత్పత్తి.. సాంకేతిక పద్ధతుల ద్వారా కృషి చేస్తే వస్త్ర పరిశ్రమ మరింతగా విస్తరించే అవకాశముందని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్పిన్నింగ్ మిల్ అసోసియేషన్, మహారాష్ట్రకు చెందిన వస్త్ర పరిశ్రమలు, మార్కెటింగ్ శాఖ సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించాయి. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వస్త్ర పరిశ్రమ ప్రముఖులు హాజరయ్యారు.  

Just In...