Published On: Wed, Nov 14th, 2018

మధుమేహ వ్యాధి పట్ల సమాజంలో చైతన్యం పెరగాలి

* వి.జి.ఆర్. డయాబెటిస్ ఎడ్యుకేషన్ అండ్ ఎవేర్‌నెస్ చారిటబుల్ ట్రస్ట్ అవగాహన సదస్సులో వక్తలు

* చిన్నారులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు ప్రదానం

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: మధుమేహ వ్యాధి పట్ల సమాజంలో చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందని, అవగాహన సదస్సుల ద్వారా ప్రజల్లో వ్యాధి పట్ల ఉన్న అపోహలను తొలగించేందుకు వైద్యులు నిరంతరం దృష్టి సారించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం అన్నారు. వరల్డ్ డయాబెటిస్ డే, చిల్డ్రన్స్ డే సందర్భంగా బుధవారం సాయంత్రం మొగల్రాజపురంలోని సిద్ధార్ద ఆడిటోరియంలో వి.జి.ఆర్. డయాబెటిస్ ఎడ్యుకేషన్ అండ్ ఎవేర్‌నెస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో అజయ్ కల్లం ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ అనుకున్నట్లుగా మధుమేహ వ్యాధి పెద్ద వ్యాధి కాదని, ఆహారంలో స్వల్ప మార్పులు చేపట్టడంతో పాటు మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం కారణంగా సమాజంలో అన్ని అంశాల పట్ల అవగాహన పెరుగుతుందని తెలిపారు. ఒకనాడు మధుమేహ వ్యాధి అంటే తెలియనివారు కూడా నేడు చిన్న వయస్సులోనే ఈ వ్యాధి గుర్తించడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వి.జి. ఆర్. డయాబెటిస్ ఎడ్యుకేషన్ అండ్ ఎవేర్ నెస్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కె. వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా గడచిన 15 సంవత్సరాలుగా వి.జి.ఆర్. డయాబెటిస్ ఎడ్యుకేషన్ అండ్ ఎవేర్ నెస్ చారిటబుల్ ట్రస్ట్ తరుపున మధుమేహ వ్యాధి గురించి విద్యార్థులు, ప్రజలలకు అవగాహన కల్పించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. దానిలో భాగంగా గత నెలరోజులుగా మధుమేహ వ్యాధికి సంబంధించిన పాఠశాల స్థాయిలో 21 వేల మంది విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించామన్నారు. ఆహార నియమాలు పాటించడం, ప్రతిరోజు వ్యాయామం చేయడం, క్రమం తప్పకుండా మందులు వేసుకోవడం వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండటం వంటివి మధుమేహ వ్యాధి చికిత్సలో తప్పకుండా పాటించడం ద్వారా వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చని, తద్వారా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. మధుమేహ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమాల్లో భాగంగా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వివిధ పాఠశాలలకు చెందిన 21 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. వారిలో ఎంపిక చేసిన వెయ్యి మంది విజేతలకు అతిధుల చేతుల మీదుగా ప్రధమ, ద్వితీయ, తృతీయ జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమానికి సీనియర్ పాత్రికేయులు, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వండర్‌బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా ఛీప్ కోఆర్డినేటర్ బి.నరేంద్రగౌడ్, ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ బోస్, డాక్టర్ సంఘ్వీ, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ గీతా ప్రవల్లిక, నగరంలోని పలువురు వైద్య నిపుణులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Just In...