Published On: Wed, May 8th, 2019

మధ్యాహ్న భోజన పధకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలి

* రాష్ట్ర స్థాయి స్టీరింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఏపి సిఎస్ ఎల్‌.వి.సుబ్ర‌హ్మ‌ణ్యం

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పధకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయడం ద్వారా విద్యార్ధులకు మెరుగైన న్యాణ్యతతో కూడిన పౌష్టికాహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పధకంపై బుధవారం అమరావతి సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి స్టీరింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల్లో అమలు చేస్తున్నమధ్యాహ్నభోజన పధకాన్ని మరింత పటిష్టవంతంగా అమలు చేయడం ద్వారా విద్యార్ధులు చిన్నారులకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించాలని చెప్పారు. ఈ పధకం అమలుకు సంబంధించిన నిధులను ప్రతి మూడు మాసాలకు ఒకసారి సకాలంలో విడుదల చేయాలని విద్యా, ఆర్ధిక శాఖల అధికారులను సిఎస్ ఆదేశించారు. ముఖ్యంగా విద్యార్ధులకు సరఫరా చేసే కోడి గ్రుడ్డు నిర్ధిష్ట పరిమాణం, నాణ్యతను కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో జిల్లాల్లో స్థానికంగా పనిచేసే ఉత్తమ స్వచ్ఛంధ సంస్థలను గుర్తించి వారి భాగస్వామ్యంతో ఈ మధ్యాహ్న భోజన పధకాన్ని మరింత పటిష్టవంతంగా అమలు జరిగేలా చూడాలని బాగా పనిచేసే ఎన్జిఓల గురించి ఆయా పాఠశాలల వద్ద ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులను సిఎస్ ఆదేశించారు. ప్రస్తుతం మధ్యాహ్న భోజన పధకం అమలుకు ప్రతి పాఠశాలకు ఏడాదికి సరఫరా చేస్తున్న 12 సబ్సిడీ ఎల్పిజి సిలిండర్ల సంఖ్యను 16కు పెంచాలని కోరుతూ కేంద్రానికి లేఖ వ్రాయడం జరుగుతుందని సిఎస్ సుబ్రహ్మణ్యం తెలిపారు.
                        పాఠశాల విద్యాశాఖ కమీషనర్ కె.సంధ్యారాణి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్కొక్కటి రూ.2.90లక్షలు అంచనా వ్యయంతో కొత్తగా 16వేల 689 కిచెన్ షెడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని చెప్పారు.అలాగే పదేళ్ల క్రితం నిర్మించిన 11వేల 690 కిచెన్ షెడ్లు,ఫేజ్-1 కింద మంజూరైన 31వేల 213 కిచెన్ షెడ్ల మరమ్మత్తులకు కేంద్రం 60శాతం, రాష్ట్రం 40శాతం నిష్పత్తి నిధులతో ఒక్కొక్కటి రూ.10వేల వ్యయంతో మర మ్మత్తులు చేసేందుకు అనుమతించిందని తెలిపారు. రాష్ట్రంలో గత ఏడాది మధ్యాహ్న భోజన పధకం కింద రూ.539 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, 85శాతం మంది విద్యార్ధులు ఈ పధకం ద్వారా ఆహారాన్ని పొందుతున్నారని చెప్పారు.ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలోని కరువు ప్రాంత మండలాల్లో 8నుండి 10 వతరగతి విద్యార్ధులకు పాఠశాలలు తెరిచే వరకూ మధ్యాహ్న భోజన పధకాన్ని కొనసాగించడం జరుగుతోందని అందుకు అవసరమైన నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులను కమీషనర్ సంధ్యారాణి కోరారు. సమావేశంలో సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్‌.ఎస్.రావత్, ఆర్పి సిసోడియా, ఆర్ధికశాఖ కార్యదర్శి పియూష్‌కుమార్, వైద్య ఆరోగ్యం, స్త్రీ శిశు సంక్షేమం, పౌరసరఫరాలు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Just In...