Published On: Thu, Nov 8th, 2018

మనసు పెట్టి చేశాం కాబట్టే దేశంలో ముందున్నాం

* గ్రామదర్శనిపై టెలికాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ‘‘కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నిరంగాలలో దేశంలో ముందుంది. నాలుగున్నరేళ్ల ప్రభుత్వ కృషికి అదే నిదర్శనం. జాతీయ సగటుకన్నా ఏపి తలసరి ఆదాయం 25శాతం అధికం. 60 శాతం ఆక్వా దిగుబడులు ఆంధ్రప్రదేశ్ నుంచే. అన్ని రకాల పండ్లు పండేది ఏపిలోనే. పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపి అగ్రగామిగా ఉంది. మనసు పెట్టి పనిచేశాం కాబట్టే ముందున్నాం’’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం గ్రామదర్శని కార్యక్రమం పురోగతిపై నోడల్ అధికారులతో ఆయ‌న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘మాఊరు అన్ని ఊళ్ల కంటే బాగుంది. పుట్టిన ఊరికి ఏదైనా చేయాలి. ఈ తపన ప్రతి ఒక్క‌రిలో రావాలి. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించగలం. అంకితభావంతో పనిచేస్తే అద్భుత ఫలితాలు’’ వస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు.
జనవరికల్లా ప్రజల్లో సంతృప్తి 90శాతానికి చేరాలి..
‘‘గ్రామదర్శని తరువాత ప్రజల్లో సంతృప్తి 5% పెరిగింది. ప్రభుత్వం పట్ల సంతృప్తి 72%నుంచి 77%కు పెరిగింది. జనవరికల్లా సంతృప్తి 90%కు తీసుకెళ్లాలి’’ అని దిశానిర్దేశం చేశారు. ‘‘తిత్లి తుపాన్ సహాయ చర్యలు తొలిరోజు ఇబ్బంది పడ్డాం. తరువాత అందరూ అద్భుతంగా పనిచేశారు. 25రోజుల్లో పరిహారంతో సహా అంతా చక్కదిద్దాం. కేంద్రం నుంచి బాధితులకు సహాయం లేదు. అయినా మన వనరులతోనే ఆదుకున్నాం. శ్రీకాకుళం జిల్లా తలసరి ఆదాయం కన్నా కృష్ణా జిల్లా తలసరి ఆదాయం రెట్టింపు ఉంది. సారవంతమైన భూములు, నీళ్లు, పొడవైన తీరప్రాంతం వంటి వనరులు ఉన్నా శ్రీకాకుళం వెనుకబాటులో ఉండటం బాధాకరం. శ్రీకాకుళం జిల్లాలో తలసరి ఆదాయం రెట్టింపు కావాలి’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘‘అధికారుల అందుబాటు వల్ల ప్రజల భాగస్వామ్యం పెరిగింది. 10,169 గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేశారు. మిగిలినవి కూడా వెంటనే సిద్ధం చేయాలి. 5,674 విద్యార్ధుల మల్టీ డిసిప్లినరీ టీమ్‌ల ఏర్పాటు. వీటిని సక్రమంగా సద్వినియోగం చేయాలి. నాలుగున్నరేళ్ల ప్రగతి వివరాలను గోడరాతలతో వివరించాలి. మనం చేసిన అభివృద్ధి ప్రజల కళ్లకు కనబడాలి. మా గ్రామంలో ఇంత అభివృద్ధి జరిగిందా? ఈ పరిస్థితిలో మరింత చేయూత ఇవ్వాలనే భావన ప్రవాస గ్రామీణులు, ప్రవాస ఆంధ్రులలో రావాలి. ప్రతి గ్రామంలో ప్రగతి చర్చలు రచ్చబండల వద్ద జరగాలి. ప్రజలతో అనుసంధానమే ప్రజాస్వామ్యం గొప్పదనం. మనం ఒక స్ఫూర్తిదాయక సమయంలో ఉన్నాం. బృంద స్ఫూర్తితో పనిచేస్తేనే విజయాలు సాధించగలం’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ప్రగతి బాటలో రాష్ట్రం-అశాంతి, అభద్రతలో దేశం…
‘‘మన రాష్ట్రం ప్రగతిబాటలో ముందుంది. కానీ దేశంలో అశాంతి, అభద్రత నెలకొన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచేశారు. నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. సిబిఐ, ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీశారు. ప్రత్యర్ధులపై కక్షసాధింపునకే ఐటి, ఈడిలను వాడుతున్నారు. కేంద్రంలోని పాలకుల్లో అసహనం పెరిగింది. ఈ పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. బాధ్యతగల పౌరులుగా అందరూ స్పందించాలి. కర్ణాటక ఉపఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఎన్నో ఇబ్బందులున్నా, కేంద్రం సహకారం లేకున్నా మనం ముందున్నాం. పట్టుదల, చిత్తశుద్ధి, అంకిత భావంతో సాధించాం. మనం చేసిన పనులను ప్రజలకు వివరించాలి. గ్రామదర్శని అందుకు గొప్ప వేదిక’’గా ముఖ్యమంత్రి అభిప్రాయబడ్డారు. గ్రామదర్శనిలో అధికారుల పనితీరును సీఎం చంద్రబాబు విశ్లేషించారు. ఎవరెవరు ఏస్థాయిలో ఉన్నారో వివరించారు. ఎప్పటికప్పుడు పనితీరును మెరుగుపరుచుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్పంచులు లేని సమయంలో ప్రత్యేక అధికారులపై ఎంతో బాధ్యత ఉందన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో ప్రణాళికా శాఖ కార్యదర్శి సంజయ్ గుప్తా, రియల్ టైమ్ గవర్నెన్స్ యండి అహ్మద్ బాబు, ఐఅండ్ పిఆర్ కార్యదర్శి రామాంజనేయులు, వివిధ జిల్లాల కలెక్టర్లు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.

Just In...