Published On: Tue, Mar 19th, 2019

మళ్ళీ తెరపైకి మాజీ మంత్రి నారాయణ అక్రమాస్తుల కేసు

* రేపు విచారణకు రానున్న రివ్యూ పిటీషన్

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ లీగ‌ల్‌: మాజీ మంత్రి పి.నారాయణ అక్రమ ఆస్తులపైన మరియు రాజధాని భూముల కుంభకోణం పైన సీబీఐతో విచారణ జరిపించాల‌ని  నాటి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు సమీప బంధువైన గండికోట కమలాకరరావు అప్పటి ఉమ్మడి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం విధితమే. అయితే ఆ కేసు కొన్ని సాంకేతిక కారణాలతో ఉమ్మడి హైకోర్టు కొట్టివేయడం జరిగింది. దీనిపై ఈ కేసును వాదించిన న్యాయవాది డాక్ట‌ర్ డి.వి.రావు మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడుతూ కోర్టు అభ్యంతరం తెలిపిన సాంకేతిక కారణాలను నివృత్తి చేస్తూ పిటీషనర్ కోరిక మేరకు ఈ కేసు పై రివ్యూ పిటీషన్ దాఖలు చేయడం జ‌రిగింద‌ని తెలిపారు.  కానీ..  సుమారు మూడు సంవత్సరాలుగా ఆ రివ్యూ పిటీషన్ విచారణకు రాకపోవడం, ఉమ్మడి హైకోర్టు విభజన తర్వాత ఈ కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కేటాయించడం జరిగింద‌న్నారు. ఈ నెల 13న పిటీషనర్ అభ్యర్ధన మేరకు ఈ కేసు వాదించే న్యాయవాది ఈ అంశాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్‌కుమార్ ధర్మాసనం ముందుకు తీసుకువచ్చి  సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ రివ్యూ పిటీషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిందిగా కోరార‌ని పేర్కొన్నారు. దానిని పరిగణలోకి తీసుకున్న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈ కేసును ఈ నెల 20న విచారణకు పెట్టాల్సిందిగా రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. ఈ నేప‌ధ్యంలో  బుధ‌వారం విచారణకు రానున్న ఈ రివ్యూ పిటీషన్‌పై కోర్టు ఉత్తర్వులు ఏ విధంగా ఉంటాయో అని పలువురు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా ఈ కేసును సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సుబ్రహ్మ‌ణ్యంస్వామి వాదించే అవకాశం ఉంద‌ని పలువురు న్యాయవాదులు చర్చించుకుంటున్నారు.

Just In...