Published On: Mon, Feb 10th, 2020

మహిళలు, చిన్నారుల రక్షణలో దిశ చట్టం అత్యంత ప్రత్యేకం…

* రాజమండ్రిలో దిశ పోలీసు స్టేషన్‌ను ప్రారంభోత్స‌వంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

రాజ‌మండ్రి, సెల్ఐటి న్యూస్‌: మహిళలు, చిన్నారుల రక్షణలో దిశ చట్టం అత్యంత ప్రత్యేకం అని రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. శ‌నివారం రాజమండ్రిలో దిశ పోలీసు స్టేషన్‌ను ప్రారంభోత్స‌వంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో సదస్సుకు హాజర‌య్యారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన దిశ యాప్‌ ఆవిష్కరించిన సీఎం. దిశ కాల్‌ సెంటర్‌ ప్రారంభించారు. సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల రక్షణలో దిశ చట్టం అత్యంత ప్రత్యేకం అన్నారు. ఇది చరిత్రలో నిల్చి పోతుంది. నేరస్తులకు వేగంగా శిక్ష పడాలి. అప్పుడే వ్యవస్థలో భయం ఏర్పడుతుంది. అది బాగు పడుతుంది. ‘దిశ’ యాప్‌ ఆవిష్కరణలో సీఎం వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి. దిశ ప్రత్యేక పోలీసు స్టేషన్‌ను కూడా ప్రారంభించిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజమండ్రిలో తొలి పోలీసు స్టేషన్‌. త్వరలోనే 18 స్టేషన్ల ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. చిన్నారులు, మహిళలపై నేరాల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు. 13 జిల్లాల్లో కోర్టులు. 13 మంది పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం. విశాఖ, తిరుపతిలో కొత్తగా రెండు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల ఏర్పాటు. దిశ పీఎస్‌లలో 36 నుంచి 47 మంది సిబ్బంది. మహిళలే ఎక్కువ. ఆపద సమయంలో ఎంతో ఆదుకునే దిశ ప్రత్యేక యాప్‌. బటన్‌ నొక్కగానే 10 సెకన్లలోనే కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం. ఆడియో, వీడియో ట్రాన్స్‌మిషన్‌. వేగంగా పోలీసుల రాక. యాప్‌పై డెమో. పనితీరును ప్రశంసించిన సీఎం వైయస్‌ జగన్‌. మహిళలు, చిన్నారుల రక్షణలో దిశ చట్టం అత్యంత ప్రత్యేకం అని, ఇది చరిత్రలో నిల్చి పోతుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నేరస్తులకు వేగంగా శిక్ష పడాలని, అప్పుడే వ్యవస్థలో భయం ఏర్పడుతుందని, తద్వారా వ్యవస్థ బాగుపడుతుందని ఆయన చెప్పారు. చిన్నారులు, మహిళలపై నేరాల కేసుల విచారణకు మాత్రమే ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తున్నామని, 13 జిల్లాల్లో 13 మంది ప్రాసిక్యూటర్లను కూడా నియమిస్తున్నామని వెల్లడించారు. కొత్తగా విశాఖ, తిరుపతిలో రెండు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే 18 దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు కానున్నాయని, దిశ పోలీసు స్టేషన్లలో 36 నుంచి 47 మంది సిబ్బంది పని చేస్తారని, వాటిలో మహిళలే ఎక్కువగా ఉంటారని ప్రకటించారు. ఆపద సమయంలో ఎంతో ఆదుకునే దిశ ప్రత్యేక యాప్‌లో ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కగానే 10 సెకన్లలోనే కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందుతుందని, ఆడియో, వీడియో ట్రాన్స్‌మిషన్‌ అవుతుందని, దీంతో పోలీసులు వేగంగా వస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. దిశ యాప్‌ డెమో స్వయంగా చూసిన సీఎం, దాని పనితీరును అభినందించారు. చిన్నారులు, మహిళల రక్షణ కోసం దేశ చరిత్రలోనే తొలిసారిగా ‘దిశ’ చట్టం రూపొందించిన సీఎం వైయస్‌ జగన్, ఆ దిశలో మరో అడుగు ముందుకు వేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన దిశ ప్రత్యేక పోలీస్‌ స్టేషన్‌ను సీఎం శనివారం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 18దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. రాజమండ్రిలో దిశ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం, ఆ తర్వాత నన్నయ్య యూనివర్సిటీలో జరిగిన సదస్సులో పాల్గొన్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన దిశ యాప్‌ను ఆవిష్కరించిన ఆయన, దిశ కాల్‌ సెంటర్‌ను కూడా ప్రారంభించారు.

యాప్‌ డెమో–ప్రశంస..
దిశ యాప్‌ ప్రారంభించిన సీఎం, యాప్‌లో ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కి దాని పనితీరు పరిశీలించారు. ‘యాప్‌లో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కగానే దిశ కాల్‌ సెంటర్‌ (కంట్రోల్‌ రూమ్‌)కు ఫోన్‌ కనెక్ట్‌ అయింది. వెంటనే ఆ ఫోన్‌ నంబరుతో పాటు, లొకేషన్‌ గుర్తించిన కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది, ఆ సమాచారాన్ని సమీపంలోని పోలీస్‌ స్టేషన్, మొబైల్‌ టీమ్‌ (పెట్రోలింగ్‌ వెహికిల్‌)కు అందించారు. ఆ టీమ్‌ వద్ద బాడీ కెమెరా కూడా ఉంది. సమాచారం అందుకున్న వారు వెంటనే ఫోన్‌ చేసిన చోటు (నన్నయ్య యూనివర్సిటీలో సదస్సు వేదిక)కు చాలా వేగంగా వచ్చేశారు. ఒక ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్‌ వచ్చి వేదికపై సీఎంను కలిశారు’. ‘కంట్రోల్‌ రూమ్‌ నుంచి సమాచారం రావడం, ఆ వెంటనే వేగంగా కదలడం, పెట్రోలింగ్‌ వెహికిల్‌ మూమెంట్‌.. అన్నింటినీ డ్రోన్‌ కెమెరా ద్వారా లైవ్‌లో చూపారు. సీఎం ప్రయోగాత్మకంగా యాప్‌ బటన్‌ నొక్కిన చోటుకు వచ్చిన పోలీసు సిబ్బంది ఆయనకు రిపోర్ట్‌ చేశారు. తమకు వచ్చిన మెసేజ్‌ కూడా వారు చూపించారు’. ఆ విధంగా దిశ యాప్‌ పని చేసే విధానాన్ని స్వయంగా పరిశీలించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, దాని పనితీరును ప్రశంసించారు. ఆ తర్వాత చిన్నారులు, మహిళల రక్షణ కోసం కృషి చేస్తామంటూ అందరితో కలిసి ప్రమాణం చేశారు.

చరిత్రలో నిల్చిపోయే రోజు…
ఇది చరిత్రలో నిల్చిపోయే రోజు అని, ఎవరూ మర్చిపోలేని రోజు అని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ చెప్పారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి కలెక్టర్లు, ఎస్పీల సమావేశం సందర్భంగా తాను చెప్పిన మాటలు బాగా గుర్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, మహిళలపై అత్యాచారాలు సహించబోమని, ఒక అన్నలా మహిళలకు అండగా ఉంటానని ఆరోజు చెప్పానని గుర్తు చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా దిశ పోలీసు స్టేషన్‌ను రాజమండ్రిలో ప్రారంభించడానికి చాలా గర్వపడుతున్నానని, ఈ చట్టం దేశ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం అని, దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఒక వెటర్నరీ డాక్టర్‌కు జరిగిన ఘటనను ప్రస్తావించిన ముఖ్యమంత్రి, ఒక చెల్లెమ్మ రాత్రి పూట ప్రయాణం చేయలేని పరిస్థితి ఉందని చెప్పడానికి ఆ ఘటన ఒక ఉదాహరణ అని చెప్పారు. అది దేశమంతా చర్చనీయాంశమైందన్న ఆయన, నిజానికి అదొక్క కేసు మాత్రమే కాదని, ఇక్కడ కూడా మహిళలు, చిన్న పిల్లలపై దారుణంగా అఘాయిత్యాలు చేస్తున్నారని అన్నారు. నలుగురు కలిసి కూర్చుని తాగినప్పుడు రాక్షసులుగా మారుతున్నారని, అప్పుడు వారేం చేస్తున్నారో వారికే తెలియడం లేదని చెప్పారు. అలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏం చేసినా తప్పు లేదని అందరికీ అనిపిస్తుందన్న సీఎం, అదే సినిమాల్లో అయితే హీరో అందరికీ కాల్చేస్తాడని, దానికి అందరూ చప్పట్లు కొడతారని గుర్తు చేశారు. నిజ జీవితంలో కూడా అలా జరగాలని కోరుకుంటారని, కానీ చట్టాలు ఆ స్వేచ్ఛ మనకు ఇవ్వవని చెప్పారు. మరోవైపు పలు కారణాల వల్ల న్యాయం చాలా ఆలస్యగా జరుగుతుందని, దాంతో బాధ కలిగి చట్టాలపై గౌరవం పోతుందని అన్నారు.

అందుకే దిశ చట్టం…
ఈ పరిస్థితి మారడం కోసం దిశ చట్టం చేశామని, న్యాయం త్వరితగతిన అందాలని, నేరస్తులకు వెంటనే శిక్ష పడితే, వ్యవస్థలో భయం ఏర్పడుతుందని, అప్పుడు వ్యవస్థ కూడా బాగు పడుతుందని సీఎం స్పష్టం చేశారు. ‘నిర్భయ చట్టం చూశాం. ఆ రోజుల్లో ఆ చట్టానికి ప్రేరేపించింది జ్యోతి అనే చెల్లెమ్మ ఘటన. కానీ 8 ఏళ్లు గడిచినా ఇవాళ్టికి కూడా నేరస్తులకు శిక్ష పడలేదు. చాలా బాధనిపిస్తుంది. ఇలా ఏళ్లకు ఏళ్లు పడితే దారుణం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రంలో నేరాలు–కేసులు…
ఈ సందర్భంగా రాష్ట్రంలో చిన్నారులు, మహిళలపై జరిగిన నేరాలను ప్రస్తావించిన సీఎం, వాటి గణాంకాలు వివరించారు.
‘రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన నేరాలకు సంబంధించి 2014లో 13,549 కేసులు, 2015లో 13,088 కేసులు, 2016లో 13,948 కేసులు, 2017లో 14,696 కేసులు నమోదు కాగా, 2018 లో 14,048 కేసులు నమోదయ్యాయి’.
‘వాటిలో అత్యాచారాలకు సంబంధించి 2014లో 937 కేసులు, 2015లో  1014 కేసులు, 2016లో 969 కేసులు, 2017లో 1046 కేసులు నమోదు కాగా, 2018లో 1096 కేసులు నమోదయ్యాయి’. ‘ఇంకా చిన్నారులపై నేరాలకు సంబంధించి 2014లో 4032 కేసులు, 2015లో 4114 కేసులు, 2016లో 4,477 కేసులు, 2017లో 4672 కేసులు నమోదు కాగా, 2018లో 4215 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ మన కళ్ల ఎదుటే జరిగాయి. అవన్నీ మనకు కనిపిస్తున్నాయి’ అని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.

దిశ చట్టం ప్రత్యేకత…
‘ఇలాంటి నేరాలు జరగకుండా ఉండాలి. ఇలాంటి నేరాలు ఎప్పుడూ జరుగుతునే ఉంటాయి. కానీ మనమేం చేయగలం అనుకోకుండా.. ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చింది. అందులో నుంచి ఉద్భవించిందే దిశ చట్టం. ఈ చట్టం ద్వారా ఏం జరగబోతుంది? గత చట్టాలకు, దీనికి తేడా ఏమిటంటే’ అంటూ, దిశ చట్టం ప్రత్యేకతను సీఎం వివరించారు. ‘మహిళలు, చిన్నారులపై ఎక్కడైనా అ«ఘాయిత్యాలు జరిగితే, రెడ్‌ హ్యాండెడ్‌ ఆధారాలు (కేసెస్‌ విత్‌ అడెక్వుయేట్‌ ఎవిడెన్స్‌లు) ఉంటే 7 రోజుల్లో కేసు దర్యాప్తు, ఆ తర్వాత 14 రోజుల్లో శిక్ష పడే విధంగా చట్టం చేశాము’. ‘ఇలాంటి చట్టం లేకపోతే మార్పును ఆశించలేం. ఆ మేరకు సీఆర్పీసీలో మార్పు కూడా చేశాం. ఈ చట్టం కాంకరెంట్‌ జాబితాలో ఉంది కాబట్టి, బిల్లును ఆమోదించి ప్రెసిడెన్షియల్‌ అమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించాము.  అది ఇప్పుడు హోం మంత్రిత్వ శాఖ దగ్గర ఉంది. దేవుడు ఆశీర్వదిస్తే, ఈ బిల్లు ఒక చట్టం రూపంలో త్వరలోనే వస్తుందని, ఆ విధంగా రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఇంకా ఏమేం చేస్తున్నాం?
ప్రత్యేక కోర్టులు–పీపీలు..
‘ఒకటి చట్టం చేయడం అయితే, రెండో అంశం మన చేతుల్లో ఉన్న కొన్ని పనులు. ఆ మేరకు వాటిపై ధ్యాస పెట్టాము. పిల్లలు, మహిళలపై నేరాలు జరిగితే వేగంగా శిక్ష పడే విధంగా 13 జిల్లాల్లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటు కోసం దాదాపు రూ.26 కోట్లు మంజూరు చేశాం. హైకోర్టు నుంచి అనుమతి రాగానే, ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు దిశ కోర్టులు ఏర్పాటవుతాయి. 13 కోర్టులలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను కూడా నియమిస్తున్నాము. ప్రత్యేక కోర్టుల కోసం రూ.25.75 కోట్లు, పీపీల నియామకం కోసం మరో రూ.1.65 కోట్లు మంజూరు చేశాం’.

డెడికేటెడ్‌ పోలీస్‌ స్టేషన్లు:
‘వీటితో పాటు డెడికేటెడ్‌ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇలాంటి ప్రత్యేక పోలీసు స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో 18 ఏర్పాటు కానున్నాయి. వాటిలో డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో 5గురు ఎస్‌ఐలతో పాటు, ఎఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, పోలీసులు మొత్తం 36 నుంచి 47 మంది  సిబ్బంది పని చేస్తారు. వారిలో అత్యధికంగా మహిళలే ఉంటారు. రాజమండ్రి పోలీసు స్టేషన్‌లో ఎస్పీ ఏకంగా 47 మందిని నియమించారు. అందుకు అభినందిస్తున్నాను’.

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు:
‘మరో అడుగు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల ఏర్పాటు. రాష్ట్రంలో కేవలం ఒకటే ల్యాబ్‌ ఉంది, అక్కడా అన్ని సౌకర్యాలు లేవు. సిబ్బంది లేవు. అందుకే కొత్త ల్యాబ్‌ల కోసం రూ.31 కోట్లు కేటాయించాం. విశాఖపట్నం, తిరుపతిలో వాటిని ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే ఒక ల్యాబ్‌ మంగళగిరిలో ఉంది. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లలో మొత్తం 118 మంది సిబ్బందికి అనుమతి ఇచ్చాం’ అని వెల్లడించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ దిశ చట్టం వచ్చే సరికి అన్ని విధాల రెడీగా ఉండడం కోసం అడుగులు వేస్తున్నామని వివరించారు.

కాల్‌ సెంటర్‌–యాప్‌..
‘దిశ కాల్‌ సెంటర్, దిశ యాప్‌ ఇప్పుడే ప్రారంభించాం. ఆపద సమయంలో యాప్‌ ఎంతో ఆదుకుంటుంది. యాప్‌ ద్వారా ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కగానే సమాచారం చాలా వేగంగా 10 సెకన్లలోనే కంట్రోల్‌ రూమ్‌కు అందుతుంది. 5048 మొబైల్‌ టీమ్‌లకు కూడా దీన్ని అనుసంధానం చేశాం. ఆడియో, వీడియో ట్రాన్స్‌మిట్‌ అవుతుంది. ఆ వెంటనే పోలీసులు వచ్చి కాపాడుతారు’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

మూడు నెలల్లో..
నేరాలు అరి కట్టడం కోసమే దిశ చట్టం రూపొందించామని, పోలీసు స్టేషన్లు, కంట్రోల్‌ రూమ్‌లు, ల్యాబ్‌లు అన్నీ మూడు నెలల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. ‘నేరస్తులకు గట్టిగా ఒక సంకేతం ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యం. మహిళలు నిర్భయంగా సంచరించడం ప్రమాణికం. వారు పురుషులతో సమానంగా ఎదగాలన్న తపన ప్రభుత్వానికి ఉంది. ఒక అన్నగా, తమ్ముడిగా, ఒక బిడ్డగా, వారి పిల్లలకు ఒక మేనమామగా బాలికలు, మహిళల గురించి ఆలోచించాను కాబట్టే, అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే దాదాపు 42 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి ద్వారా మేలు చేస్తున్నాం’. ‘ఈ ఉగాది నాటికి అక్కా చెల్లెమ్మల చేతికి 25 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వబోతున్నాం. నాడు–నేడు ద్వారా స్కూళ్ల స్థితిగతులు మార్చబోతున్నాం. మద్య నియంత్రణ కోసం ఇప్పటికే చర్యలు చేపట్టాం. రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా చర్యలు చేపడతాము’.
‘మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు. నామినేషన్‌ విధానంలో ఇచ్చే పనులు, నామినేటెడ్‌ పదవుల్లో వారికి 50 శాతం రిజర్వేషన్‌ ఇస్తూ, అసెంబ్లీలో చట్టం చేశాం. 2016 నుంచి ఆగిపోయిన సున్నా వడ్డీ రుణాలు ఇవ్వబోతున్నాం. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మహిళలు బలపడాలి’ అని ముఖ్యమంత్రి వివరించారు. చివరగా.. అక్కా చెల్లెమ్మలకు అన్ని రకాలుగా అండగా ఉండే మీ అన్న, తమ్ముడిని ఆశీర్వదించాలని, మీకు ఇంకా సేవ చేసే అవకాశం ఇవ్వాలని దేవుణ్ని కోరుకుంటానంటూ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ తన ప్రసంగం ముగించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రసారం…
రాజమండ్రిలో దిశ పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవం, నన్నయ్య యూనివర్సిటీలో దిశ యాప్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా 1349 పోలీస్‌ స్టేషన్లు, సబ్‌ డివిజన్‌ ఆఫీసులు, ఎస్పీ కార్యాలయాల్లో వీక్షించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేశంలో తొలిసారిగా ఈ ఏర్పాటు చేయడం విశేషం. కాగా, దిశ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత 25 కేసులను కేవలం వారం రోజుల వ్యవధిలోనే పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు.

ఆకట్టుకున్న దిశ పాట…
కార్యక్రమంలో ప్రత్యేకంగా ఆలపించిన దిశ పాట అందరినీ ఆకట్టుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ రీసెర్చ్‌ ఆఫీసర్‌ ఇ.దినేష్‌ రచించిన ఆ పాటకు అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించగా, శ్రావణి, రచిత, ఐశ్వర్య ఆలపించారు. ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, పుష్పశ్రీవాణి, మంత్రులు మేకతోటి సుచరిత, పిన్నింటి విశ్వరూప్, తానేటి వనిత, మోపిదేవి వెంకటరమణ,  పలువురు ఎంపీలు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళా ఎమ్మెల్యేలు, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, దిశ చట్టం పరిరక్షణ ప్రత్యేక అధికారిణిలు కృతికా శుక్లా, దీపికా పటేల్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

   

Just In...