Published On: Sat, Oct 12th, 2019

మహిళల స్వయం ఉపాధి అభివృద్ధికి ప్రభుత్వ తోడ్పాటు

* భవిష్యత్తులో మరిన్ని మెప్మా, డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శనలు ఏర్పాటు

* వారం రోజుల్లో రూ.13 లక్షల వరకు అమ్మకాలు చేయడం అభినందనీయం

* సరస్ జాతీయ డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శనను సందర్శించిన మంత్రి బొత్స

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: స్వయం ఉపాధితోనే మహిళాభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ‌న్‌రెడ్డి సారధ్యంలో స్వయం సహాయక సంఘ మహిళల ఆర్ధికాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలోని స్వ‌రాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన సరస్ జాతీయ డ్వాక్రా ఉత్పత్తుల ఎగ్జిబిషన్‌ను శుక్ర‌వారం సాయంత్రం మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సందర్శించారు. ఈ సందర్బంగా ఆయ‌న మాట్లాడుతూ స్వయం  సహాయక సంఘ అక్కచెల్లెమ్మలు త‌యారుచేసిన ఉత్పత్తులకు అనువైన మార్కెటింగ్ కల్పించేలా ప్రభుత్వం ఈ సరస్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసిందని అలాగే వైఎస్సార్ ఆసరా వంటి పథకాలతో ఆర్ధిక చేయూతను కూడా అందిస్తుందని అన్నారు. ముందుగా పట్టణ పేదరిక నిర్ములన సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి తిల‌కించారు. ఈ సంద‌ర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలతో మంత్రి మాట్లాడుతూ స్వయం సహయక సంఘంలో ఎప్పటి నుండి ఉన్నారు, ఉత్పత్తుల తయారీ, విక్రయాలు ఎలా ఉన్నాయి వంటి వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మెప్మా ద్వారా అమలవుతున్న సంక్షేమ పధకాలను గూర్చి, స్వయం సహాయక సంఘ వ్యాపారవేత్తల వివరాలు, జీవనోపాధుల కార్యక్రమాలు, మెప్మా బజార్ల వివరాలను గురించి మంత్రికి మెప్మా అదనపు మిషన్ డైరెక్టర్ కే.శివపార్వతి వివ‌రించారు. అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెప్మా ద్వారా స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కృషి  చేస్తుందని, సరస్ డ్వాక్రా బజార్‌లో ఏర్పాటు చేసిన వివిధ సంఘాల ఉత్పత్తులు మంచి ఆకర్షణగా ఉన్నాయని, మెప్మా స్వయం సహాయక సంఘ స్టాళ్ల‌లో వారం రోజుల్లో రూ.13 లక్షల వరకు అమ్మకాలు చేయడం అభినందనీయం అన్నారు. వీరికోసం భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా డ్వాక్రా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్బంగా సరస్‌లో పాల్గొన్న మెప్మా స్వయం సహాయక సంఘ మహిళలు ప‌లువురు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెప్మా ద్వారా స్వయం సహాయక సంఘ మహిళలకు సామజిక, ఆర్ధిక, సాంకేతిక చేయూత అందించడంతో పాటు మెప్మా బజార్, సరస్ ఎగ్జిబిషన్ వంటివి ఏర్పాటు చేయడం ద్వారా తాము చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తూ ఆర్ధిక ఎదుగుదలకు దోహదపడుతున్నార‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి బొత్స సత్య నారాయణకు, మెప్మా మిషన్ డైరెక్టర్ జిఎస్ఆర్‌కెఆర్ విజయ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి ఎగ్జిబిషన్లు  మరింత విస్తృతంగా ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో  మెప్మా రాష్ట్ర మిషన్ మేనేజర్ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులకు మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్రశంసా పత్రాల‌ను అందజేశారు.

 

Just In...