Published On: Fri, Sep 11th, 2020

మహిళా సాధికారత కోసం ఎక్కడా లేని విధంగా అడుగులు…

* ఇది మహిళా పక్షపాతి ప్రభుత్వం..

* పురుషులతో సమానంగా వారికి అవకాశాలు

* ఆ దిశలో ప్రతి చోటా గట్టి చర్యలు తీసుకుంటున్నాం

* ‘వైయస్సార్‌ ఆసరా’ పథకం ప్రారంభోత్స‌వంలో ముఖ్యమంత్రి జ‌గ‌న్

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: సుదీర్ఘ పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మరో హామీ నిలబెట్టుకుంటూ, ఎన్నికల నాటికి స్వయం సహాయక సంఘాలకు ఉన్న రుణాలు చెల్లించే ‘వైయస్సార్‌ ఆసరా’ పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. నాలుగు విడతల్లో వారి రుణాలు చెల్లిస్తామన్న సీఎం, అందులో తొలి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,71,302 లక్షల స్వయం సహాయక సంఘాలకు చెందిన 87,74,674 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ.6,792.20 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల అక్కచెల్లెమ్మలకు గత ఏడాది ఏప్రిల్‌ 11 నాటికి రూ.27,168.83 కోట్ల రుణాలు ఉండగా, వాటిలో నాలుగో వంతు మొత్తం ఇప్పుడు వారికి నేరుగా ఇచ్చారు. శుక్ర‌వారం క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి, పథకాన్ని ప్రారంభించిన వెంటనే ఆ మొత్తం నేరుగా ఆ అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ అయింది. ప్రభుత్వం ఇప్పుడు జమ చేస్తున్న మొత్తాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలన్నది ఆ అక్కచెల్లెమ్మలదే నిర్ణయం. పాత బాకీల కింద ఆ మొత్తం జమ చేసుకోకుండా బ్యాంకర్లతో మాట్లాడిన ప్రభుత్వం, వాటిని అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో జమ చేసింది. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్ మాట్లాడారు. ఈ పథకం ప్రారంభిస్తున్నందుకు మీ సోదరుడిగా శుభాకాంక్షలు. గతంలో ఎక్కడా ఎవరూ తలపెట్టలేదు. దేవుడి దయతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎన్నికల నాటికి పొదుపు సంఘాలకు ఉన్న రుణాలను నేరుగా వారి చేతుల్లోనే పెడతామని మాట ఇచ్చాను. దాన్ని నిలబెట్టుకుంటూ ఇవాళ మీ ముందుకు వచ్చాను. దాదాపు 8.71 లక్షల స్వయం సహాయక సంఘాల్లో దాదాపు 87 లక్షల అక్క చెల్లెమ్మలకు దాదాపు రూ.27 వేల కోట్లు రుణాలున్నాయి. చెప్పిన మాట ప్రకారం నాలుగు వాయిదాల్లో ‘వైయస్సార్‌ ఆసరా’ పథకంలో తొలి విడతగా రూ.6792 కోట్లు
వారి ఖాతాల్లో జమ చేస్తున్నాము.

మహిళల చరిత్ర మార్చడం కోసం..
రాష్ట్ర మహిళల చరిత్రను మార్చడానికి కట్టుబడి ఉన్నాను. అందుకే ఈ డబ్బు మీ ఖాతాల్లో జమ చేస్తున్నా. దీనిని స‌ద్వినియోగం చేసుకుని వ్యాపారం లేదా స్వయం ఉపాధి పొందాలనుకుంటే కూడా ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. ఆ మేరకు బ్యాంకులతో పాటు, అమూల్, ఐటీసీ, అల్లానా, పీ అండ్‌ జీ, హిందుస్తాన్‌ యూని లివర్‌ వంటి కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఈ డబ్బు వాడుకోవడంపై పూర్తిగా మీకే అధికారం. ఆ స్వేచ్ఛ పూర్తిగా మీకు ఉంది. వ్యాపారం చేసుకోవాలంటే, ఆయా కంపెనీలను, బ్యాంకులను కలిపి మీకు తోడుగా నిలుస్తాం.
సెర్ప్, మెప్మా అధికారులు ఈ విషయంలో మీకు సహకరిస్తారు.

‘చేయూత’ లో కూడా…
దీనిని ఇప్పటికే చేయూత పథకంలో అమలు చేశాము. మీరూ ముందుకు వస్తే పూర్తిగా సహాయ, సహకారాలు అందిస్తాం. అందుకోసం గ్రామ, వార్డు వలంటీర్లకు చెప్పండి. లేదా సెర్ప్‌ మరియు మెప్మా అధికారులను కలవండి. లేదా 1902కు ఫోన్‌ చేయండి.

అక్క చెల్లెమ్మల పరిస్థితి మారాలి…
అక్కచెల్లెమ్మల పరిస్థితులు మెరుగు కావాలి. విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా.. మహిళా సాధికారత కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా అడుగులు వేస్తున్నాం. ‘అమ్మ కడుపులో బిడ్డ మొదలు.. అవ్వల వరకు’ అందరికి మంచి జరగాలని వివిధ పథకాలు అమలు చేస్తున్నాం. గర్భిణీలు, బాలింతలకు కూడా మేలు చేసే చర్యలు చేపట్టాం. బిడ్డ కడుపులో పడిన నాటి నుంచి పిల్లలకు ఆరేళ్లు వచ్చే వరకు వారికి పౌష్టికాహారం ఇస్తూ వైయస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం అమలు చేస్తున్నాం. ఇంకా పీపీ–1, పీపీ–2 ద్వారా మంచి విద్య. ఇంగ్లిష్‌ మీడియమ్‌లో బోధన అమలు చేయబోతున్నాం.

అమ్మ ఒడి…
ఇంటర్‌ వరకు మంచి చదువులు అందాలని, పేదింటి పిల్లలు కూడా డాక్టర్, ఇంజనీరింగ్‌ చదవాలని కాంక్షిస్తూ అమ్మ ఒడి పథకం. దాదాపు 83 లక్షల పిల్లలకు మేలు చేస్తూ, 43 లక్షల తల్లుల ఖాతాల్లో సుమారు రూ.6300 కోట్లు జమ చేశాం.

విద్యా దీవెన…
ఇంటర్‌ తర్వాత ఏ ఒక్కరూ కూడా చదువు మధ్యలో ఆపొద్దన్నది మా లక్ష్యం. వారు అలా చదివితేనే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయని భావిస్తూ, జగనన్న విద్యాదీవెన పథకం అమలు చేస్తున్నాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో గత ప్రభుత్వం బకాయి పెట్టిన çరూ.1880 కోట్లు చెల్లించడంతో పాటు, దాదాపు రూ.4200 కోట్లు పిల్లల చదువుల కోసం నేరుగా అక్క చెల్లెమ్మలు, కాలేజీలకు ఇచ్చాం. ఈ ఏడాది నుంచి ఆ ఫీజు మొత్తం కూడా అక్క చెల్లెమ్మలకే ఇస్తాం.

వసతి దీవెన…
ఇంటర్‌ తర్వాత పెద్ద చదువులకు బ్రేక్‌ పడొద్దన్న లక్ష్యంతో వసతి దీవెన ప్రారంభించాం. ఐటీఐ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ కోర్సులు చదివే పిల్లలకు హాస్టల్‌ ఖర్చుల కింద ఆర్థిక సహాయం. ఇందుకోసం దాదాపు రూ.1221 కోట్లు వ్యయం. పిల్లలకు రెండు విడతల్లో రూ.20 వేలు చెల్లింపు. అందులో భాగంగా తొలి విడతగా రూ.10 వేలు ఇచ్చాం. దీన్ని గర్వంగా చెబుతున్నాను. ఈ పిల్లలు బాగా చదివితేనే పేదరికం పోతుంది. అందుకే ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశ పెట్టడంతో పాటు, నాడు–నేడులో స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నాం.

సున్నా వడ్డీ…
పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ. అందుకోసం రూ.1400 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశాం. సున్నా వడ్డీ పథకం ప్రతి ఏటా నిరాటంకంగా కొనసాగిస్తాం.

వైయస్సార్‌ చేయూత:
ఇంకా 45–60 ఏళ్ల మధ్య ఉన్న అక్కలకు మంచి జరగాలి. అది జరిగితే వారి కుటుంబాలు బాగుంటాయి. అందుకే కార్పొరేషన్ల వ్యవస్థను పూర్తిగా మారుస్తూ చర్యలు చేపట్టాం. ఆ విధంగా ప్రతి అక్కకు తోడుగా ఉండేందుకు చేయూత పథకం అమలు చేశాం.
– అదే అక్క చెల్లెమ్మలు దాదాపు 22 లక్షల మందిని చేయి పట్టుకుని నడిపిస్తాను. ఏటా రూ,18,750 చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తూ, నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేల సహాయం చేస్తాం. తొలి ఏడాది దాదాపు రూ.4200 కోట్లు జమ చేశాం. ఒకవేళ ఆ అక్క చెల్లెమ్మలు వ్యాపారం చేయాలనుకుంటే బ్యాంకులతో పాటు, ఐటీసీ, అమూల్, అల్లానా, పీ అండ్‌ జీ, హిందుస్తాన్‌ యూని లీవర్, æ రిలయెన్స్‌ వంటి సంస్థల సహకారంతో తోడ్పాటు అందిస్తాం. ఆవులు, మేకలు కొనివ్వడంతో పాటు, పాలు ఇతర ఉత్పత్తులు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది.

అన్నింట్లో సగం…
దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా నామినేటెడ్‌ పదువుల్లో 50 శాతం, నామినేషన్‌ విధానంలో ఇచ్చే పనుల్లో 50 శాతం మహిళలకు ఇస్తున్నాం.

కాపు నేస్తం…
కాపు నేస్తంలో కూడా మహిళలకు ఆర్థిక సహాయం. కాపు మహిళలకు అయిదేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయం చేస్తాం. తొలి ఏడాది ఇప్పటికే రూ.15 వేలు ఇచ్చాం. మిగిలిన 4 ఏళ్లు కూడా ఏటా ఆ సహాయం చేస్తూ, వారి చేయి పట్టుకుని నడుస్తాం. ప్రతి పథకం అక్క చెల్లెమ్మలకు ఉద్ధేశించింది. వారు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మాను.

ఇళ్ల స్థలాల పట్టాలు…
దేశంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 30 లక్షల అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడానికి సిద్ధమయ్యాం. కానీ గిట్టని వారు కొందరు కోర్టులకు వెళ్లడంతో ఆగిపోయింది. దేవుడి దయతో త్వరలోనే వాటిని ఇస్తామని, ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తామని అనుకుంటున్నాను.

పెన్షన్లు..
ఒంటరి మహిళలు, వితంతువులతో పాటు, 60 ఏళ్లు దాటిన ప్రతి అవ్వకు మంచి జరగాలన్న ఉద్దేశంతో పెన్షన్లు ఇస్తున్నాం. గతంలో వారికి రూ.1000 కూడా ఇవ్వలేదు. ఎన్నికల ముందు 44 లక్షల మందికే పెన్షన్‌ ఇస్తే, ఇప్పుడు 60 లక్షల మందికి, అది కూడా రూ.2250 ఇస్తున్నాం. అందుకు నెలకు రూ.1500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రతి నెల 1న, ఆరోజు ఆదివారం అయినా సరే సూర్యోదయానికి ముందే గడప వద్దే పెన్షన్‌ ఇస్తున్నాం.

దిశ చట్టం…
మహిళలపై అత్యాచారం చేస్తే, కఠిన చర్యలు తీసుకునే విధంగా దిశ చట్టం తెచ్చాము. 7 పని దినాల్లోనే పోలీసు దర్యాప్తు. రెండు వారాల్లో న్యాయ విచారణ. మరణశిక్ష పడేలా చట్టం చేశాం. అయితే ఈ అంశం ఉమ్మడి జాబితాలో ఉండడంతో, అది ఇప్పుడు కేంద్రం పరిశీలనలో ఉంది. ఇంకా దిశ పోలీస్‌ స్టేషన్లు, దిశ యాప్‌ వల్ల కూడా ఎంతో మేలు కలుగుతోంది.

మద్యం నియంత్రణ…
మద్యం నియంత్రణ దిశలో పలు చర్యలు చేపట్టాం. షాక్‌ కొట్టే విధంగా ధరలు పెంచడంతో పాటు, 43 వేల బెల్టు షాపులు, 4300 పర్మిట్‌రూమ్‌ల రద్దు చేశాం. మొత్తం మీద 33 శాతం మద్యం దుకాణాలు తగ్గించాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వయంగా మద్యం విక్రయాలు. విక్రయ వేళల కుదించాం. ఆ విధంగా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే మరో ప్రయత్నం చేస్తున్నాం.

అందుకే ఈ కార్యక్రమాలు:
మహిళా సాధికారతకు బలమైన పునాది పడాలని చేస్తున్న పనులు. మహిళలు విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని, వారి జీవన ప్రమాణాలు మరింత బాగు పడాలని చేస్తున్న కార్యక్రమాలు. వారు ఎదగడానికి ఈ పథకాలన్నీ బాటలు వేస్తున్నాయి.

మహిళా పక్షపాత ప్రభుత్వం:
21వ శతాబ్ధంలో ఆధునిక భారతీయ మహిళ రాష్ట్రంలో ప్రతి గ్రామం, ప్రతి ఇంటా సాధికారతతో ఆవిర్భవిస్తుందని బలంగా నమ్ముతున్నాను. ఆ దిశలోనే పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం. మహిళల కోసం పేరుకే ఒకటో రెండు పథకాలు, చాలీ చాలకుండా అమలు చేయడం కాదు. మహిళలకు చదువు పరంగా, వారి పిల్లల చదువుల పరంగా, వారి ఆర్థిక సామర్థ్యాన్ని పెంచే విధంగా, వారికి కుటుంబంలో, సమాజంలో పురుషులతో సమానంగా వారికి అవకాశాలు దక్కేలా ప్రతి చోటా గట్టి చర్యలు తీసుకుంటున్న మహిళా పక్షపాత ప్రభుత్వం మాది. 3 కోట్ల అక్క చెల్లెమ్మలు, అవ్వలు, అమ్మల కోసం.. వారి బిడ్డల కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నాను. దేవుడి దయ, అందరి ఆశీస్సులతో చేయగలిగినంతా చేస్తున్నానని సవినయంగా తెలియజేస్తున్నానంటూ.. సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రసంగం ముగించారు.

గర్వంగా ఉంది: బొత్స సత్యనారాయణ. మంత్రి
‘ఎందరో సీఎంలను చూశాను. వారితో కలిసి పని చేశాను. మీ నాన్నగారితో కూడా కలిసి పని చేశాను. ప్రజలందరి కోసం ఆయన ఎన్నో మంచి పనులు చేశారు. అందుకే ఆయన మరణించినా ఇవాళ్టికి చిరంజీవిగా అందరి మదిలో ఉన్నారు. మీరు నవరత్నాలు ప్రకటించారు. ప్రతి ఒక్కటి అమలు చేశారు. రుణ మాఫీ చేస్తానని గత సీఎం కూడా చెప్పారు. కానీ మాట నిలుపుకోలేదు. ఎందుకంటే ఏం చేయాలన్నా మనసు ఉండాలి.
కానీ ఇవాళ రాజకీయ నాయకుడిగా గౌరవం పొందుతున్నందుకు ఎంతో గర్వంగా ఉంది’.
అనంతరం వివిధ జిల్లాలలో లబ్జిదారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడిన సీఎం వైయస్‌ జగన్, ఆ తర్వాత కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి
వైయస్సార్‌ ఆసరా పథకం ప్రారంభించారు.

 

Just In...