Published On: Tue, Jun 18th, 2019

‘మాటిచ్చాం.. అమలు చేస్తున్నాం’

* ఆర్టీసీ విలీనంపై సీఎం జగన్‌ వ్యాఖ్య

* శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడిన ఏపీ ముఖ్యమంత్రి

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: అందరి జీవితాల్లో మార్పు తేవాలనే లక్ష్యంతో పనిచేస్తానని.. నవరత్నాల అమలుతో పేదల సంకెళ్లు తెంచాలని ఆరాటపడుతున్నానని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. విద్యను నినాదంగా కాకుండా ప్రాథమిక హక్కుగా మారుస్తానని చెప్పారు. రెండే రెండు పేజీలతో తాము ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించామన్నారు. మంగ‌ళ‌వారం జ‌రిగిన శాసనసభ ముగింపు స‌మావేశంలో పలు అంశాలపై సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి చేతికి రూ.15వేలు ఇస్తామని.. జనవరి 26 నుంచి ‘అమ్మఒడి’ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఎన్నికలకు మూడు నెలల ముందు వరకు రూ.వెయ్యి పింఛను మాత్రమే ఇచ్చిందన్నారు. తాము వచ్చాక పింఛను మొత్తాన్ని రూ.2,250 చేశామని.. ఏటా రూ.250 పెంచుకుంటూ రూ.3వేలు చేస్తామని జగన్‌ వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆశావర్కర్లు, అంగన్వాడీలు, హోంగార్డుల వేతనాలు పెంచినట్లు చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల కష్టాలు తమకు తెలుసని.. అందుకే వారి వేతనాలను రూ.18వేలకు పెంచామన్నారు.

పొరుగుసేవల గుత్తేదారుల్ని తొలగిస్తాం…
‘‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మాటిచ్చాం.. అమలు చేస్తున్నాం. అర్హత, అనుభవం చూసి ఒప్పంద కార్మికులను క్రమబద్ధీకరిస్తున్నాం. పొరుగుసేవల పేరుతో కొందరు గుత్తేదారులకు ఎంతో మేలు జరిగింది. అందుకే పొరుగుసేవల గుత్తేదారులను తొలగిస్తున్నాం. ఇక నుంచి పొరుగుసేవల కార్మికులకు నేరుగా ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుంది. ఆరోగ్యశ్రీలో నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బకాయిలు ఉన్నాయి. 108 కోసం కొత్తగా 350.. 104 కోసం 650 అంబులెన్స్‌లు కొనుగోలు చేస్తున్నాం. ఉగాది నాటికి 25 లక్షల ఇళ్లపట్టాలకు రిజిస్ట్రేషన్లు చేస్తాం. ప్రతి గ్రామంలోని పేద మహిళలకు ఆ పట్టాలను ఉచితంగా అందజేస్తాం. అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.1,150 కోట్లు కేటాయించాం. దీని ద్వారా 9లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు మేలు జరుగుతుంది. అక్టోబర్‌ 2 నుంచి గ్రామ సచివాలయాలను ప్రారంభిస్తాం. ప్రభుత్వానికి చెందిన ప్రతి పథకాన్ని ఇంటింటికీ తీసుకెళ్లడమే లక్ష్యంగా దాదాపు 4లక్షల మందిని గ్రామ వలంటీర్లుగా నియమిస్తాం. ప్రతి గ్రామ వలంటీర్‌కు రూ.5వేల చొప్పున గౌరవ వేతనం అందిస్తాం. అవినీతికి పాల్పడిన వలంటీర్లను వెంటనే తొలగిస్తాం’’ అని జగన్‌ చెప్పారు.

సున్నా శాతం వడ్డీకే రైతులు, మహిళలకు రుణాలు….
‘‘రైతు భరోసాను చెప్పిన దానికంటే ముందే అమలు చేస్తాం. ఈ ఏడాది అక్టోబర్‌ 15 నుంచే ప్రతి రైతుకు రూ.12,500 అందిస్తాం. బోరుబావులు వేసి రైతులు అప్పులపాలవ్వకూడదు. అందుకే ఉచితంగా బోర్లు వేసేందుకు 200 రిగ్‌లు కొనుగోలు చేస్తున్నాం. రైతులు, మహిళలకు సున్నా శాతం వడ్డీకే రుణాలిచ్చే పథకం ప్రారంభిస్తాం. రైతులకు గత ఐదేళ్లుగా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ నిధులను విడుదల చేశాం. ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే రూ.2వేల కోట్లు కేటాయిస్తాం. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం’’ అన్నారు.

విద్యాహక్కు చట్టం పూర్తిగా అమలు చేస్తాం….
‘‘గత ప్రభుత్వం విధానాల వల్ల బడుల్లో అనేక సమస్యలు నెలకొన్నాయి. 6 నుంచి 8 నెలల బిల్లులు సైతం పెండింగ్‌లో పెట్టారు. విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు సమయానికి ఇవ్వలేదు. ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు పూర్తిగా మారుస్తాం. మొత్తం 40వేల పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తాం. సర్కారు బడుల్లో తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తాం. ప్రైవేట్‌ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేదలకు కేటాయించాల్సి ఉన్నా.. అది అమలు కావడం లేదు. విద్యాహక్కు చట్టాన్ని పూర్తిగా అమలయ్యేలా చూస్తాం. పేదలు, మధ్య తరగతి వారికి చదువులు భారం లేకుండా చేస్తాం. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజు నియంత్రణకు చట్టం తీసుకొస్తామ‌ని సీఎం వివరించారు.

Just In...