Published On: Sat, Aug 1st, 2020

మాణిక్యాలరావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

* ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఆదేశం

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు పైడికొండల మాణిక్యాలరావు మృతిపట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహ‌న్ రెడ్డి  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు త‌మ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. మాజీ మంత్రికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీచేశారు.

ఆయ‌న మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది (కిషన్‌రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి)…
నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనతో కలసి పని చేసాను. మంచి  స్నేహశీలి. చిత్తశుద్ధి, నిబద్ధతతో ఆయన పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి మంత్రిగా పనిచేశారు. మాణిక్యాలరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూన్నాను.

ఆయన మృతి పార్టీ కి తీరని నష్టం (భాజ‌పా ఏపి అధ్య‌క్షుడు సోము వీర్రాజు)…
పైడికొండల మాణిక్యాలరావు మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన స్వతహ స్వయంసేవక్‌గా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చురుకుగా పనిచేస్తూ 1989లో భాజపాలో చేరి అంచెలంచెలుగా జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షునిగా పార్టీకి పలు సేవలు అందించిన మాణిక్యాలరావు 2014 శాసనసభ కుఎన్నికై తెదేపా ప్రభుత్వంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ‌ మంత్రిగా పని చేసి ఆయన 2018లో పార్టీ సంస్థాగత ఎన్నికల్లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆయన మృతి పార్టీకి తీరని నష్టం. వారి మృతి పట్ల వారి కుటుంబ‌సబ్యులకు ప్రగాఢ సానుభూతి వ్య‌క్తం చేస్తున్నాను.

నమ్మిన సిద్దాంతం కోసం జీవితాంతం కట్టుబడి పని చేశారు (తెదేపా అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు)

20రోజులుగా చికిత్స పొందుతున్న మాణిక్యాలరావును కాపాడుకోలేకపోవడం బాధాక‌రం. ‘దేవాదాయ శాఖ మంత్రిగా రాష్ట్రంలో దేవాలయాల అభివృద్దికి, అర్చకుల సంక్షేమానికి పాటుబడ్డారు. శాసన సభ్యునిగా తాడేపల్లి గూడెం అభివృద్దికి ఎనలేని కృషి చేశారు. నమ్మిన సిద్దాంతం కోసం జీవితాంతం కట్టుబడి పని చేశారని’’ చంద్రబాబు కొనియాడారు. మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

Just In...