Published On: Tue, Feb 5th, 2019

మానవ తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు అధికం

* జాతీయ ర‌హ‌దారి భ‌ద్ర‌త వారోత్స‌వాల్లో విజ‌య‌వాడ సీపీ ద్వారకా తిరుమ‌ల‌రావు 

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: క్షణం పాటు నిర్లక్ష్యం నిండు కుటుంబాన్ని బలి తీసుకుంటుందని.. ఫ‌లితంగా రోడ్డు ప్రమాదాల్లో అమాయకులు బలైపోతున్నారని విజ‌య‌వాడ నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు అన్నారు. స్థానిక బెంజిసర్కిల్ సమీపంలోని ది కృష్ణా డిస్టిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్‌లో జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో జరిగిన 30వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా రెండోవ రోజైన మంగళవారం నాడు “రోడ్డు భద్రత” పై డ్రైవర్లతో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు హాజర‌య్యారు. జ్యోతి ప్రజ్వలన అనంత‌రం రోడ్డుభద్రతపై ఆయ‌న డ్రైవ‌ర్ల‌తో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పోలీస్ కమిషనర్ ద్వార‌కా తిరుమలరావు మాట్లాడుతూ దూరప్రాంతాలకు వెళ్లే వాహనాల్లో రెండవ డ్రైవర్ తప్పక ఉండాలని, అలా లేకపోతే డ్రైవర్ వాహనం నడుపుతూనే నిద్రావస్థలోకి జారుకునే ప్రమాదం ఉందని త‌ద్వారా రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఎక్కువసేపు డ్రైవింగ్ చేసేవాళ్ళు కొంత స‌మ‌యం విశ్రాంతి తీసుకుని మ‌రల వాహనాలు నడపాలని ఆయన సూచించారు. నగరంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్, సీటుబెల్టు పెట్టుకోకపోవడంతో పాటు కదులుతున్న బస్సుల నుండి కిందకి దిగబోయి పడిపోవటం వల్ల అక్కడికక్కడే దుర్మ‌ర‌ణంపాల‌య్యార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అటువంటి రోడ్డు ప్రమాదాలకు మనం గురికావద్దని ఆయన కోరారు. ఆటోలు, జీపులు,  బస్సుల్లో వేలాడేటట్లుగా ప్రయాణికులను తీసుపోవద్దని డ్రైవర్లకు సూచనలు ఇచ్చారు. సమావేశంలోని కొంతమంది ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా ఎక్కువమంది ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని వాపోయారు.
                  డిటీసీ ఇ.మీరాప్రసాద్ మాట్లాడుతూ రవాణా తరగతి లైసెన్సును పొందాలంటే ఎనిమిదవ తరగతి ఉత్తీర్ణలై ఉండాలనే నిబంధనను తప్పనిసరి చేస్తూ 2007లో ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో దానిని తొలగించడం జరిగిందని తెలిపారు. తేలిక రకపు మోటారు వాహనం (కారు) కలిగి ఉంటే పబ్లిక్ వాహనాలు (ట్రాన్స్‌పోర్ట్‌) కూడా నడుపుకోవచ్చని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఆటో డ్రైవర్లను దృష్టిలో ఉంచుకొని ఆటోలకు కట్టాల్సిన పనులకు మినహాయింపు ఇవ్వడం జరిగిందని, దీనిద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా మేలు జరిగిందని చెప్పారు. ఆటోలకే కాకుండా వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్ ట్రైలర్ వాహనాలకు కూడా పన్ను మినహాయింపు ఇచ్చారని తెలిపారు. రహదారి భద్రత నియమాలు అందరూ పాటించాలని, అప్పుడే రోడ్డు ప్రమాదాలను అరికట్టగలమన్నారు. జిల్లాలోని రవాణాశాఖ పరిధిలో ఉన్న  గ్రామస్థాయిలో కూడా రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో డిసిపి వెంకట అప్పలనాయుడు, డిసిపి ట్రాఫిక్ విజయవాడ రవిశంకర్ రెడ్డి, ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వై.ఈశ్వరరావు, ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్య‌క్షుడు కోనేరు రామారావు, ఆర్టీఓలు డి.ఎస్‌.ఎన్.మూర్తి, ఎస్.వెంకటేశ్వరరావు, టి.రామ్మోహనరావు, వాహన తనిఖీ అధికారులు వి.శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, రవికుమార్, బాలేంద్ర శేఖర్, కాశీ, రవి గోపాల్, కార్యాలయ పరిపాలన అధికారులు మాణిక్యాలరావు, ధనలక్ష్మి, రవాణాశాఖ అధికారులు, ఉద్యోగులు, డ్రైవర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...