Published On: Mon, May 18th, 2020

మీ ఇంట్లో బిడ్డే ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్నాడు…!

* ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జ‌ర‌గ‌నివ్వ‌ను

* విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో బాధితులకు సీఎం జ‌గ‌న్ భ‌రోసా

* ప్ర‌జ‌ల ఖాతాల్లో రూ.10 వేలు చొప్పున పరిహారం విడుదల చేసిన సీఎం జగన్‌

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: మీ ఇంట్లో బిడ్డే ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్నాడు అనుకోండి… ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జ‌ర‌గ‌నివ్వ‌ను.. ప్ర‌తి ఒక్క‌రినీ అన్ని విధాలుగా ఆదుకుంటాము అని విశాఖ గ్యాస్ లీక్ బాధితుల‌కు సీఎం జ‌‌గ‌న్ భ‌రోసా ఇచ్చారు. తాడేప‌ల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సోమ‌వారం ఆయ‌‌న గ్యాస్ లీక్ బాధితులు, వారి కుటుంబ‌స‌భ్యుల‌తో వీడీయో కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడారు. ‌బటన్‌ నొక్కి గ్యాస్‌ ప్రభావానికి లోనైన గ్రామాల ప్రజల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున నగదు జమ చేశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి జ‌గ‌న్ మాట్లాడారు. మీ ఇంట్లో బిడ్డే ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్నాడు. ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరగనివ్వను. ప్రతి ఒక్కరిని అన్ని విధాలుగా ఆదుకుంటాము. విశాఖ గ్యాస్‌ లీక్‌ బాధితులకు సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు. ‘మీ ఇంట్లో బిడ్డనే ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్నాడు. ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరగనివ్వను. ప్రతి ఒక్కరిని అన్ని విధాలుగా ఆదుకుంటాము’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రకటించారు. గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనకు బాధ్యులెవరైనా వదిలిపెట్టబోమని, ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీని తరలిస్తామన్న ముఖ్యమంత్రి, ఇప్పటికే కంపెనీ నుంచి 13 వేల టన్నుల స్టెరైన్‌ కొరియా పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ప్రభావానికి గురైన ఆరు గ్రామాలైన వెంకటాపురం, వెంకటాద్రినగర్, పద్మనాభపురం, ఎస్సీ బీసీ కాలనీ, నందమూరినగర్, ఆర్‌ ఆర్‌ వెంకటాపురంలో ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని దుర్ఘటన జరిగిన (ఈనెల 7న) రోజున విశాఖ పర్యటనలో ప్రకటించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, 10 రోజుల్లోనే ఆ మాట నిలబెట్టుకున్నారు. ఆయా గ్రామాల్లో అధికారుల పక్కా ఎన్యూమరేషన్‌‌ ప్రకారం బాధితుల సంఖ్య 19,893 మందిని తేల్చగా, వారందరికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా కొందరు బాధితులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, ఆ తర్వాత కంప్యూటర్‌లో బటన్‌ నొక్కడం ద్వారా వారి ఖాతాల్లో రూ.10 వేల చొప్పున నగదు జమ చేశారు. ఇంకా కేవలం 12 ఇళ్లలోని వారి బ్యాంక్‌ ఖాతాల వివరాలు అందాల్సి ఉందని ఈ సందర్భంగా విశాఖ జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు. ఆయా గ్రామాల్లో ఆంధ్ర వైద్య కళాశాలకు చెందిన 10 మంది వైద్య నిపుణులతో వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.

అందుకే ఇంత పరిహారం…
ఈ ఘటన చాలా బాధాకరం అన్న ముఖ్యమంత్రి, ఇలాంటిది ఎక్కడా జరగకూడదని ఆకాంక్షించారు. ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించాలన్నది తాను విపక్షంలో ఉన్నప్పుడు చూశానంటూ, తాను విపక్షనేతగా ఉన్నప్పుడు ఓఎన్జీసీ గ్యాస్‌ లీక్‌ అయి 22 మంది చనిపోతే ఆ గ్రామానికి వెళ్లి పరిస్థితి చూశానని చెప్పారు. అప్పుడు వారికి ఓఎన్జీసీ రూ.20 లక్షలు, కేంద్రం రూ.3 లక్షలు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.2 లక్షలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇలాంటివి జరిగినప్పుడు పెనాల్టీ చాలా ఉంటుందని ఆ కంపెనీ భావిస్తే, అవి చాలా జాగ్రత్తలు తీసుకుంటాయన్న ముఖ్యమంత్రి, ఇలాంటి ఘటనలు విదేశాల్లో జరిగితే, ఎలా పరిహారం ఇస్తారో.. ఇక్కడా అలాగే ఇవ్వాలని కోరానని తెలిపారు. అందుకే ఆరోజు బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశానని వివరించారు.

వారందరికీ అభినందనలు…
మనుషులు చనిపోతే వెల కట్టలేమన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, అందుకే ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. విశాఖలో ఈ ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం, అధికార యంత్రాంగం చాలా వేగంగా స్పందించిందన్నారు.‘తెల్లవారు జామున 4.30 గంటలకల్లా అధికారులంతా రోడ్ల మీదకు వచ్చారు. రెండు గంటల్లో ప్రజలను ఆస్పత్రులు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అందు కోసం కలెక్టర్, కమిషనర్‌తో సహా, అధికారులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటివి జరిగితే ప్రభుత్వం ఎలా స్పందించాలన్నది చూపాం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా…
గతంలో ఎక్కడా ఇలా ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఇవ్వని విధంగా ఇప్పుడు కోటి రూపాయలు ఇవ్వడంతో పాటు దర్యాప్తునకు కమిటీ కూడా ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి చెప్పారు.10 మంది వైద్యులతో యుద్దప్రాతిపదికన కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా, అవసరమైన ఉపకరణాలు సమకూర్చామని వెల్లడించారు. ఇలాంటివి జరిగినప్పుడు అందుకు కారణాలు, బాధ్యులను గుర్తించేందుకు పలు కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు, కంపెనీ నుంచి 13 వేల టన్నుల స్టెరైన్‌ను కొరియాకు పంపించామని గుర్తు చేశారు.

అనుమతులన్నీ టీడీపీ హయాంలోనే…
‘ఈ కంపెనీకి ఒక్క క్లియరెన్సు కూడా మా ప్రభుత్వం ఇవ్వలేదు. చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు అనుమతి ఇవ్వగా, 2015లో యూనిట్‌ విస్తరణతో పాటు అన్నింటినీ టీడీపీ ప్రభుత్వమే చేసింది. అయినా ఎక్కడా ఆ విషయం చెప్పకుండా సహాయ కార్యక్రమాల్లో మునిగిపోయాం’ అని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

వేగంగా స్పందించాం–ఆదుకున్నాం…
‘ఘటన జరిగిన వెంటనే సీఎస్‌ను మూడు రోజులు అక్కడే ఉంచాం. ఘటనలో 12 మంది చనిపోతే దేశంలో గతంలో ఎక్కడా లేని విధంగా కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వడంతో పాటు, గ్యాస్‌ ప్రభావానికి లోనైన 19,893 మందికి రూ.10 వేల చొప్పున, ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం విడుదలైన వారికి రూ.25 వేల చొప్పున, ఆప్పత్రుల్లో రెండు, మూడు రోజులు చికిత్స పొందిన వారికి లక్ష రూపాయల చొప్పున, వెంటిలేటర్‌పై చికిత్స పొందిన వారికి రూ.10 లక్షల పరిహారం ఇచ్చాం’ అని ముఖ్యమంత్రి వివరించారు.

కఠిన చర్యలు తప్పవు…
నిపుణుల కమిటీ ఇచ్చే నివేదికతో పాటు, ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలు, సందేహాలను కంపెనీకి ఇచ్చి, పూర్తి వివరణ తీసుకుని, ఆ తర్వాత చర్యలకు ఉపక్రమిస్తామని సీఎం వెల్లడించారు. ‘బాధితులందరికీ పూర్తిగా న్యాయం చేస్తుంది. అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీ బిడ్డనే సీఎంగా ఉన్నారు. ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరగనివ్వను. ఘటనకు బాధ్యులను వదలబోము. ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటాము’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ‘మీ కోసం గ్రామాల్లో మంచి క్లినిక్‌లు ఏర్పాటు చేసి, వైద్యులను అందుబాటులో ఉంచుతాం.మీకు ప్రత్యేకంగా హెల్తు కార్డులు అందజేస్తాం. దాని ద్వారా మీరు మెరుగైన వైద్యం పొందవచ్చు, ఇప్పుడు వలంటీర్లు మీ ఇంటికి వస్తారు. అన్ని వివరాలు తెలుసుకుంటారు. ఆ కార్డులకు రసీదు కూడా తీసుకుంటారు. మీకు భవిష్యత్తులో కూడా ఏ ఇబ్బంది రాకుండా చూస్తారు’ అని సీఎం వైయస్‌ జగన్‌ వివరించారు. ఆ తర్వాత విశాఖలో ఉన్న బాధితులతో సీఎం వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. గతంలో ఏనాడూ లేని విధంగా ప్రభుత్వం తమకు అండగా నిల్చిందని ఈ సందర్భంగా విశాఖ గ్యాస్‌ లీక్‌ బాధితులు తెలిపారు.

మేక సుశీల, దుర్ఘటనలో భర్తను కోల్పోయిన మహిళ…
‘ఆ దుర్ఘటనలో నా భర్త చనిపోయాడు. అపోలో ఆస్పత్రిలో మూడు రోజులు చికిత్స పొందాను. అక్కడ చాలా బాగా చూసుకున్నారు. నేను తిరిగి ఆ ఇంట్లో ఉండలేను. కాబట్టి నా మనవడికి ఉద్యోగం ఇస్తే అతనితో పాటు ఉంటాను. నా మనవడు ఎంటెక్‌ చేశాడు. అందువల్ల నా మనవడికి ఏదైనా ఉద్యోగం ఇస్తే, నేను ఆయనతోనే ఉంటాను’. అనంత‌రం సీఎం వైయస్ జ‌గ‌న్ స్పందించారు. దుర్ఘటనలో మరణించిన 12 కుటుంబాల వారికి ఏదో ఒక విధంగా ఉద్యోగం ఇద్దామని చెప్పారు. కనీసం గ్రామ సచివాలయాల్లో అయినా సరే ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని, అవసరమైతే నిబంధనలు మారుద్దామని కలెక్టర్‌తో చెప్పారు.

పరమేశ్వరి, ఎస్సీ బీసీ కాలనీ…
‘ఘటన జరిగిన వెంటనే మాకు ఏమీ అర్ధం కాలేదు. అర గంట పాటు ఏం జరిగిందో కూడా తెలియదు. అందరం దగ్గర్లోని మేఘాద్రిగడ్డ డ్యామ్‌ వద్దకు పోయాం. కానీ అక్కడికి పోయాక వాంతులు అయ్యాయి. స్పృహ కోల్పోయాం. తర్వాత మమ్మల్ని ఆస్పత్రుల్లో చేర్చారు. అక్కణ్నుంచి ఒక కాలేజీలో శిబిరం ఏర్పాటు చేసి చాలా బాగా చూసుకున్నారు. మాకు వాలంటీర్లు ఫినాయిల్‌ బాటిళ్లు, మాస్కులు కూడా ఇచ్చారు. మేము మా గ్రామానికి వెళ్లిన తెల్లవారే అధికారులంతా వచ్చి ఆరా తీశారు. మాకు ఎంతో భరోసా ఇచ్చారు. నేను, నా భర్త. ఇద్దరు పిల్లలు. ఆ విధంగా మాకు రూ.40 వేలు వస్తాయన్నారు. అమ్మ ఒడిలో రూ.15 వేలు వచ్చాయి. వాహనమిత్రలో రూ.10 వేలు వచ్చాయి. మీరు బాగా చూసుకుంటున్నారు. మళ్లీ మీరే సీఎంగా ఉండాలి.

గంగరాజు, పద్మనాభనగర్…‌
‘ఆ రాత్రి గ్యాస్‌ లీక్‌ కాగానే, పోలీసులు వచ్చారు. సైరన్‌ మోగించారు. మమ్మల్ని అప్రమత్తం చేశారు. అధికారులు కూడా వచ్చి మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆస్పత్రుల నుంచి శిబిరానికి తరలించి మంచి ఆహారం పెట్టారు. చిన్న పిల్లలకు కోడిగుడ్లు కూడా పెట్టారు. మంత్రులు, విజయసాయిరెడ్డి గారు వచ్చి మా యోగక్షేమాలు విచారించారు. మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నారు. అక్కడి నీళ్లు తాగొద్దని, మంచినీరు సరఫరా చేశారు’.గతంలో ఎన్నడూ లేని విధంగా పరిహారం ప్రకటించారు. గతంలో కొంత పరిహారం ప్రకటించినా, అది ఎప్పుడిస్తారో తెలియదు. ఎవరికి కలవాలో కూడా తెలియదు. కానీ మీరు కోటి రూపాయలు ప్రకటించి, ఆ వెంటనే ఇచ్చారు. ఇప్పుడు కూడా మంత్రులు వచ్చి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటున్నారు’. అనంత‌రం సీఎం.. మాట్లాడుతూ ‘గుడ్‌ జాబ్‌ వినయ్‌ (విశాఖ కలెక్టర్‌). మీరంతా చాలా బాగా పని చేశారు. అధికారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు చక్కగా పని చేశారు. గ్రామంలో పడుకుంటానని మంత్రి కన్నబాబు స్వయంగా ముందుకు వచ్చారు. ఇది ఎందరికో స్ఫూర్తి దాయకం. నా మంత్రివర్గంలో ఇంత మంచి వారున్నారని నిజంగా సంతోష పడ్డాను. అధికారులకు కృతజ్ఞతలు. అక్కడ ఉన్న వారందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ముగించగా.. మంత్రి కె.కన్నబాబు స్పందిస్తూ.. ‘మీరు చరిత్రలో నిల్చిపోతారు. మీ నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వపడుతున్నాము. మానవీయకోణంలోనూ మీకెవ్వరూ సాటిరారు. ఎవ్వరూ ఊహించని విధంగా పరిహారం ప్రకటించారు. ఇప్పటికీ మాకు ఆశ్చర్యం కలుగుతోంది’ అని కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత కంప్యూటర్‌లో బటన్‌ నొక్కిన సీఎం వైయస్‌ జగన్, 19,893 వేల మంది ఖాతాల్లో రూ.10 వేల చొప్పున నగదు జమ చేశారు.

 

Just In...