Published On: Sun, Apr 21st, 2019

మీ కుతంత్రం రాజ్యాంగ విరుద్ధం..

* ప్ర‌ధాని మోదీకి తెలుగుదేశం పార్టీ ఏపి అధ్య‌క్షుడు కిమిడి క‌ళావెంక‌ట్రావు బ‌హిరంగ లేఖ‌

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: భారతదేశం సర్వమత సమ్మేళనం. కుల, మత సామరస్యానికి నిదర్శనం. అటువంటి దేశానికి ప్రధానిగా బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతూ కులాన్ని రాజకీయ ప్రయోజనానికి వాడుకోవాలని మీ కుతంత్రం రాజ్యాంగ విరుద్ధం, ఎన్నికల నియమావళికి విరుద్ధం, ప్రధాని పదవికి మాయని మచ్చ. బీసీ, చాయ్‌ వాలా అంటూ ఓట్ల కోసం చెప్పుకుంటున్న మీరు.. దేశంలో 50శాతానికి పైగా ఉన్న బలహీన వర్గాల ప్రజలకు మీరు చేసిన పని ఒక్కటైనా ఉందా? ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోండి.

1. ప్రధాన మంత్రి కార్యాలయంలో ఎందరు బిసిలను నియమించావో లెక్క చెప్పగలవా? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియమించబడిన బిసి గవర్నర్లు ఎందరు?

2. చట్టసభలలో బీసీ లకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఢిల్లీకి పంపిన తీర్మానాలను ఎందుకు ఆమోదించలేదు.

3. ఆర్థిక నేరస్తులకు కాపలా కాస్తున్న మిమ్మల్ని దొంగ అని రాజకీయ విమర్శ చేస్తే.. దాన్ని బీసీలందరికీ ఆపాదించడం ప్రధాన మంత్రి హోదాలో ఉన్న మీకు  ఆ స్థానం యొక్క విలువ దిగజార్చడం కాదా?

4. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా 1984లో రిజర్వేషన్‌ వ్యతిరేక ఉద్యమంలో మీరు కీలకంగా వ్యవహరించినది వాస్తవం కాదా?

5. 2018-19 బడ్జెట్ లో దేశంలోని 70కోట్ల మంది బీసీల కోసం మీరు కేటాయించింది 7,750 కోట్లు అయితే.. ఏపీలో రెండున్నర కోట్ల జనాభాకు రూ.16 వేల కోట్లు కేటాయించాం. ఇదేనా మీకు బీసీలపై ఉన్న ప్రేమ?

6. వీపీ సింగ్‌ హాయంలో బీసీ రిజర్వేషన్‌లపై ఏర్పాటు చేసిన మండల్‌ కమిషన్‌ ను బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడం నిజం కాదా?

7. యూనివర్శిటీ నియామకాలలో 13 పాయింట్ల రోస్టర్ విధానాన్ని తీసుకురావడం బడుగు-బలహీన వర్గాల విద్యావంతులైన యువకులను ప్రొఫెసర్ ఉద్యోగాలకు దూరం చేయడానికి మీరు పన్నిన కుట్రకాదు?

8. బీసీలు పొందుతున్న రిజర్వేషన్లు మండల్‌ కమిషన్‌ ద్వారానే సిద్ధించాయి. నాడు అడ్డుకున్న రిజర్వేషన్లను వాడుకుంటూ నేడు అదే రిజర్వేషన్లను, అవే కులాలను వాడుకుని దెస వ్యాప్తంగా రిజిస్టర్ అయినా మూకదాడుల్లో బలయ్యింది SC, ST BC మైనారిటీ వర్గాల ప్రజలు కాదా? మీరు నిజమైన BC అయితే ముకదాడులు చేసిన గూండాయిలు నేరస్థులపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేదు.

9. మీ మాటల్లో బీసీలపై కనిపిస్తున్న ప్రేమ ఏనాడైనా చేతల్లో చూపించారా ఓట్ల కోసం బీసీనని చెప్పుకుంటున్న మీరు BCలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వాలన్న డిమాండ్‌పై ఎందుకు అమలు చేయలేదు?

10. బీసీలకు న్యాయం చేసే ఆలోచన లేదనే మనస్థాపంతో రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ (ఆర్‌.యస్‌.యల్‌.పి) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వాహా ఎన్డీయే నుంచి బయటకు వెళ్లడం వాస్తవం కాదా?

11. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో బీసీ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఘోరపరాభవాన్ని చవిచూసింది. బీసీలు మిమ్మల్ని అంతగా చీత్కరించారంటే మీరు చేసిన ద్రోహం ఏ స్థాయిలో ఉందో ఏనాడైనా ఆలోచించారా?

12. బీసీలను హత్య చేసిన వైఎస్‌ కుటుంబంతో చేతులు కలపడమే మీకు బీసీలపై ఉన్న ప్రేమా?

13. వెనుకబడిన తరగతులకు చెందిన పాలేటి రామారావు, పుట్టా సుధాకర్ యాదవ్ లపై రాజకీయ కక్షతో ఐటీ దాడులు చేయించటమేనా మీ కపట బీసీ ప్రేమ?

14. ఐదేళ్ల పాటు బీసీలను గాలికొదిలేసి ఎన్నికలు వస్తున్న సమయంలో బీసీ కార్డును నెత్తికెత్తుకోవడానికి మీ పాలనా వైఫల్యానికి నిదర్శనం కాదా? చెప్పుకోటానికి చేసిన అభివృద్ధి ఏమీలేక కులతత్వం, మతతత్వాలను రెచ్చగొట్టే హీనస్థితికి దిగజారడం మీ దివాళాకోరుతనం కాదా? ఇదేనా మీ పాలన.? ఇదేనా మీ రాజనీతి.?

Just In...