Published On: Mon, Jun 25th, 2018

ముఖ్య‌మంత్రిపై క‌న్నా వ్యాఖ్య‌లు విద్వేష‌పూరితం

* మంత్రి కాల‌వ శ్రీ‌నివాసులు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రాష్ట్ర భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ గ‌తంలో వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి మంత్రివ‌ర్గంలో వుండ‌గా విశాఖ‌లో ర్యాంకీ ఫార్మా సంస్థ‌కు అనుకూలంగా వ్య‌వ‌హరించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వున్నాయ‌ని రాష్ట్ర స‌మాచార గ్రామీణ గృహ‌నిర్మాణ శాఖ‌ల మంత్రి కాల‌వ శ్రీ‌నివాసులు పేర్కొన్నారు. ఆ సంస్థ‌కు నాటి ముఖ్యమంత్రి వై.ఎస్‌. ప్రోద్బ‌లంతో ఆయ‌న అనుచ‌రుడిగా ఉన్న‌ క‌న్నా, ర్యాంకీ సంస్థ‌కు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేష‌న్ ఫీజులు మిన‌హాయింపులు క‌ల్పించార‌ని, దీనిపై ఆయ‌న‌కు కోర్టు నుండి నోటీసులు కూడా జారీ అయ్యాయ‌న్నారు. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు, వారి కుటుంబంపై విద్వేష‌పూరితంగా వ్య‌వ‌హరిస్తూ వారిని ఇబ్బందుల‌పాలు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మంత్రి అన్నారు. ఉండ‌వ‌ల్లిలోని సిఎం నివాసం వ‌ద్ద మీడియా పాయింట్‌లో మంత్రి కాల‌వ శ్రీ‌నివాసులు శ‌నివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష పార్టీలైన వైసిపి, బిజెపి, జ‌న‌సేన‌లు ముఖ్య‌మంత్రిపైన‌ వారి కుటుంబంపైన‌ నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తూ బాధ్య‌తార‌హితంగా వ్య‌వ‌హరిస్తున్నాయ‌న్నారు. కోర్టుల్లో ప‌దేప‌దే కేసులు వేయ‌డం ద్వారా ముఖ్య‌మంత్రిని, వారి కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేసేందుకు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ గ‌తంలో వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్రోద్బ‌లంతో ప్ర‌య‌త్నాలు చేశార‌ని, 2003లో ప్రాథ‌మిక ఆధారాలు లేవ‌ని సుప్రీంకోర్టు ఆ కేసును తిర‌స్క‌రించ‌డం జ‌రిగింద‌ని, 2004లో హైకోర్టులో హెరిటేజ్‌, ఎన్టీఆర్ ట్ర‌స్టు భ‌వ‌న్‌ల‌పై కేసులు వేయ‌గా అవి తిర‌స్క‌ర‌ణ‌కు గురైన‌ట్లు గుర్తుచేశారు. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి ముఖ్య అనుచ‌రుడనే విష‌యం అంద‌రికీ తెలుస‌న్నారు. ఆయ‌న ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం ప‌నిచేస్తున్నారో వెల్ల‌డ‌వుతోంద‌న్నారు. భాజ‌పా, వైసిపిలు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నాయ‌ని మంత్రి పేర్కొన్నారు.

Just In...