Published On: Tue, May 14th, 2019

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ

* అధికారుల‌ను అభినందించిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సుదీర్ఘ విరామం తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం సుమారు రెండు గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అనుమతించిన నాలుగు అంశాలపైనే ప్రధానంగా చర్చించారు. ఫొని తీవ్ర తుపానుతో ఉత్తరాంధ్రలో వాటిల్లిన నష్టం, రాష్ట్రంలో నీటి ఎద్దడి, కరవు పరిస్థితులు, ఉపాధి హామీ పనులకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న అనేక అంశాలపై చర్చించారు. ఈ భేటీలో మంత్రులు, సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం, విపత్తు నిర్వహణ శాఖ, వ్యవసాయ శాఖ, పంచాయతీ రాజ్‌ శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు. తమ శాఖలకు సంబంధించిన అంశాలను అధికారులు సీఎం వద్ద ప్రస్తావించారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటే తమ అనుమతి తీసుకున్నాకే అమలు చేయాలని ఈసీఐ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ధరల సవరింపు, బకాయిల చెల్లింపులపై అనుమతులు తీసుకున్నాకే అమలుచేయాలని తెలిపింది. ధరల పెంపునకు సంబంధించి నిర్ణయాలపై మీడియాకు వివరాలు వెల్లడించొద్దని సూచించింది. ఫొని తుపాను కారణంగా ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.58 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, తదుపరి అంచనాలపై సర్వే జరుగుతోందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో చాలా చోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతోపాటు పలు పంటలకు కూడా నష్టం వాటిల్లినట్టు అధికారులు సీఎంకు వివరించినట్టు సమాచారం.  తాగునీటి ఎద్దడిపై చర్చ సందర్భంగా రాయలసీమ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని, ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. సాగునీరు అందక చాలా పంటలు ఎండిపోయాని విపత్తు, ఉద్యానవన, వ్యవసాయ శాఖ కార్యదర్శులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉపాధి పనులకు సంబంధించి అనంతపురం,  కడప, కర్నూలు జిల్లాల్లో కొన్ని చోట్ల కరవు నేపథ్యంలో ప్రజలు వలసలు వెళ్తున్నారని.. ఉపాధి పనుల్లో నిధుల విడుదలలో జాప్యం జరిగిందని, త్వరితగతిన నిధులు విడుదల చేయాలని అధికారులు కోరినట్లు సమాచారం. ఎన్నికల కోడ్‌ కారణంగా కొత్త పనులేవీ చేపట్టకపోవడంతో ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగానే ఈ పనులు చేపట్టాలని సీఎం సూచించినట్టు సమాచారం.
అధికారులకు సీఎం అభినందనలు…
ఉపాధి హామీ పథకం అమలులో ఉత్తమ రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఐదు విభాగాల్లో తొలిస్థానం, ఆరు విభాగాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ విజయానికి కృషి చేసిన ఉపాధిహామీ, పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు.

Just In...