Published On: Thu, Oct 15th, 2020

మున్సిపాలిటీల ఆదాయం స్థానికంగానే వ్యయం…

* ఆ డబ్బును ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడదు

* స్వయం సమృద్ధి దిశగా మున్సిపాలిటీలు అడుగులు వేయాలి

* ఉద్యోగుల జీత భత్యాలను ప్రభుత్వమే చెల్లిస్తుంది

* మున్సిపాలిటీలలో శానిటేషన్‌ పక్కాగా ఉండాలి

* వాటర్, సీవరేజీ కూడా సక్రమంగా నిర్వహించాలి

* పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడా రాజీ వద్దు

* మున్సిపాలిటీలలో సంస్కరణలపై సమీక్షలో సీఎం జగ‌న్ ‌

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, సిఫార్సులకు అనుగుణంగా పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్‌బీ) అయిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో చేపట్టవలసిన సంస్కరణలపై గురువారం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి చెందే విధంగా ఒక ఎస్‌ఓపీ రూపొందించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.‌ఎస్. రావత్, మున్సిపల్‌ శాఖ కార్యదర్శి శ్యామలరావు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయకుమార్, పుర‌పాల‌క శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.సమావేశంలో సీఎం జగన్ మాట్లాడారు.

ఎక్కడి ఆదాయం అక్కడే వ్యయం..
మున్సిపాలిటీలలో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ముట్టుకోదు, ఆ డబ్బును అక్కడే ఖర్చు చేయాలి. స్ధానికంగా పలు అభివృద్ధి పనులు, కార్యక్రమాల కోసం వ్యయం చేయాలి. ఈ మెసేజ్‌ ప్రజల్లోకి  బలంగా వెళ్లాలి. మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి (సెల్ఫ్‌ సస్టెయినబుల్‌) సాధించాలి. ఆ దిశగా ప్రయత్నించాలి, అడుగులు వేయాలి. మున్సిపాలిటీల ఉద్యోగుల జీతభత్యాలను 010 పద్దు ప్రకారం ప్రభుత్వమే చెల్లిస్తుంది.

శానిటేషన్‌–క్లీనింగ్‌…
శానిటేషన్‌ బాగుండాలి, వాటర్‌ అండ్‌ సీవరేజ్‌ కూడా పక్కాగా ఉండాలి. ప్రతి రోజూ తప్పనిసరిగా చెత్తను తరలించాలి. వీధులనూ పరిశుభ్రం చేయాలి, డ్రైనేజీలను తరుచూ క్లీన్‌ చేయాలి. శానిటేషన్‌, వాటర్‌ అండ్‌ సీవరేజ్‌కు సంబంధించి రోజువారీ నిర్వహణ వ్యయాన్ని (ఓ అండ్‌ ఎం) మాత్రమే ఛార్జీలుగా వసూలు చేయాలి. మున్సిపాలిటీలలో ఆదాయం ఎంత? వాటి వ్యయం ఎంత? జీతాల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు? అభివృద్ధి పనులకు ఎంత వ్యయం చేస్తున్నారు? వంటి అన్నీ తెలుసుకుని, ఇంకా ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై ఎస్‌ఓపీ రూపొందించండి. ప్రజలకు ఇంకా మెరుగైన సేవలందించడంతో పాటు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా ఆ ఎస్‌ఓపీలు
ఉండాలి.

 

Just In...