Published On: Sat, Jan 12th, 2019

ముస్లీం, మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తా

* హ‌క్కుల సాధ‌న కోసం త్వ‌ర‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో చ‌ర్చిస్తా 

* ముస్లి సాధికార‌త రాష్ట్ర స‌ద‌స్సులో మైనార్టీ మంత్రి ఫారూఖ్‌

* పార్టీల‌కతీతంగా పెద్ద ఎత్తున హాజ‌రైన నేత‌లు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ముస్లీం, మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని, వారి హ‌క్కులు సాధించుకునేందుకు ఎల్ల‌ప్పుడూ త‌న‌వంతు స‌హ‌కారం అందిస్తాన‌ని రాష్ట్ర మైనార్టీ మంత్రి ఎన్‌.ఎం.డి.ఫారూఖ్ అన్నారు. ఇంటిగ్రేటెడ్ ఫోరమ్‌ ఫ‌ర్ ముస్లీమ్ రైట్స్ (ముస్లీం జేఏసీ) ఆధ్వ‌ర్యంలో గ‌వ‌ర్న‌రుపేట‌లోని మాకినేని బ‌స‌వ‌పున్న‌య్య విజ్ఞాన కేంద్రంలో శ‌నివారం నిర్వ‌హించిన ముస్లీం సాధికార‌త రాష్ట్ర స‌ద‌స్సులో మంత్రి ఫారూఖ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా స‌ద‌స్సు నిర్వాహ‌కులు, ఇంటిగ్రేటెడ్ ఫోరమ్ ఫ‌ర్ ముస్లిమ్ రైట్స్ కన్వీనర్, మాజీ న్యాయ‌మూర్తి ఇంతియాజ్ అహ్మ‌ద్, మాజీ ఎంపీ నిజామోద్దీన్‌లు మైనార్టీల త‌ర‌ఫున మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన ముస్లింలకు చట్టసభల్లో స్థానం క‌ల్పించాల‌ని, శాసన సభ, రాజ్యసభ, మరియు స్థానిక సంస్థల్లో, నామినేటెడ్ పదవులలో అధిక సీట్లు కేటాయిస్తూ వారిని గెలిపించే బాధ్యత ఆయా పార్టీలు తీసుకోవాల‌ని, జ‌స్టిస్ రంగ‌నాధ మిశ్రా క‌మీష‌న్ సిఫార్సుల‌ను అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే నేరుగా ఉద్యోగాలు సృష్టించి ముస్లిం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల‌ని కోరారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ సెక్కులర్, బీజేపీ వ్యతిరేక పార్టీ ముస్లింలకు అత్యధిక సీట్లు కేటాయించి గెలిపించే బాధ్యత తీసుకుంటుందో ఆ పార్టీకి మద్దతివ్వాలని తీర్మానిస్తూ ముస్లింలకు పిలుపునిస్తూ భ‌విష్య‌త్ కార్యాచరణ రూపొందించామ‌ని మంత్రికి వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఫారూఖ్ మాట్లాడుతూ న్యాయ‌మైన హ‌క్కుల సాధ‌న కోసం ముస్లింలు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకతీతంగా ఒకే వేదిక ద్వారా ఏక‌మ‌వ‌డం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుతో చ‌ర్చించి ముస్లీం, మైనార్టీల హ‌క్కుల‌ను సాధించుకుందామ‌ని అందుకు త‌న‌వంతు స‌హ‌కారం అందిస్తాన‌ని మంత్రి హామీ ఇచ్చారు. ముస్లీం మైనార్టీల కోసం తెలుగుదేశం ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. హ‌క్కుల సాధ‌న కోసం ముస్లీం, మైనార్టీ నేత‌ల‌తో క‌లిసి సీఎం చంద్ర‌బాబుతో చ‌ర్చించేందుకు కృషి చేస్తాన‌న్నారు. కార్య‌క్ర‌మంలో  శాసన మండలి చైర్మన్ ఎం.డి.షరీఫ్ అహ్మ‌ద్‌, శాస‌న‌స‌భ విప్‌, క‌దిరి ఎమ్మెల్యే చాంద్ భాషా, గుంటూరు వైసీపీ ఎమ్మెల్యే ముస్త‌ఫా, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ కె.నాగుల్‌మీరా, గుంటూరు జిల్లా ప‌రిష‌త్ ఛైర్‌ప‌ర్స‌న్ షేక్ జానీమూన్‌, విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్, మాజీ ఎమ్మెల్యేలు మస్తాన్ వలి, గ‌ఫుర్, ఉర్దూ అకాడమి చైర్మన్ నౌమాన్, ఆర్గనైజింగ్ కమిటీ స‌భ్యులు మునీర్ అహ్మ‌ద్‌, వైసీపీ త‌ర‌ఫున ఎం.ఎస్‌.బేగ్, పీసీసీ కోఆర్డినేట‌ర్, ఫోరమ్ కో-కన్వీనర్ ఎన్‌.అరిఫ్ అలి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌ధ్యంలో నిర్వ‌హించిన ఈ స‌భ‌లో పార్టీల‌కతీతంగా పెద్ద ఎత్తున ముస్లీం, మైనార్టీ నేత‌లు త‌ర‌లిరావ‌డం విశేషం.

Just In...