Published On: Mon, Nov 30th, 2020

మూడు బ్యారేజీల నిర్మాణానికి త్వరలో టెండర్లు..

* మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్ల‌డి

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఒకటి, దిగువన రెండు బ్యారేజీల నిర్మాణానికి త్వరలోనే టెండర్ల ప్రక్రియ చేపడతామని కృష్ణాజిల్లా ఇంచార్జ్‌ మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. విజ‌య‌వాడ‌లోని ఇరిగేషన్ కార్యాలయం ప్రాంగణంలోని రైతుశిక్షణా కేంద్రంలో నిర్వహించిన కృష్ణాజిల్లా 33వ నీటిపారుదల సలహామండలి సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అధ్య‌క్ష‌త వ‌హించారు. స‌మావేశంలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, సింహాద్రి రమేష్, మొండితోక జగన్‌మోహన్‌రావు, జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్, జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత, ఇరిగేషన్ ఇఇ కె.నరసింహమూర్తి, ఐడిసి ఇఇ రంగనాధ్, అగ్రికల్చర్ జేడి టి.మోహన్‌రావు, గుడివాడ డిఈ కొడాలి బాబు, నీటి సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు, నీటిపారుద‌ల, సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మాట్లాడుతూ ఒకే జిల్లాలో మూడూ బ్యారేజీల నిర్మాణం రైతులు, ప్ర‌జ‌ల‌కు శుభ పరిణామం అని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్‌.. బ్యారేజీల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. శుక్ర‌వారం జ‌రిగిన కేబినెట్‌ సమావేశంలో కూడా ఈ అంశం చర్చకు వచ్చిందని పేర్కొన్నారు. గత ఏడాది రబీకి 16 టీఎంసీల నీరు ఇచ్చాం. ఈ ఏడాది 26 టీఎంసీలు ఇస్తున్న‌ట్లు చెప్పారు. బందరు కాలువకు కూడా 1 టీఎంసీ నీరు ఇవ్వాలని నిర్ణయించిన‌ట్లు తెలిపారు. ఈ ఏడాది నీటి లభ్యత ఎక్కువగా ఉన్నందున ఎక్కువగా ఇవ్వాలని నిర్ణయించామ‌న్నారు. గత ఏడాది కంటే రెట్టింపుగా ఈ సారి నీటిని ఇస్తున్నాం. టెయిల్‌ఎండ్‌ ప్రాంతాలకు మంచి
ఉపయోగకరం అన్నారు. ప్రాధాన్య‌త ప్రాతిపదికన ప్రాజెక్టుల పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించామని మంత్రి తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే కలెక్టర్‌ దృష్టికి తీసుకురావాలని, అన్ని పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
ప్రకాశం బ్యారేజీ దిగువున చోడవరం, మోపిదేవి మండలాల్లో రెండు బ్యారేజీల నిర్మాణానికి రూ.204.37 కోట్లతో స్టేజ్-1 కు పరిపాలనామోదం మంత్రి మండలి తెలిపిందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన రెడ్డి బ్యారేజీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. గతఏడాది 2019-20 రబీకి 16 టి.యం.సి.ల నీరు అందించడం ద్వారా పెడన, కైకలూరు, మచిలీపట్నం నియోజకవర్గాల పరిధిలోని బంటుమిల్లు, కృత్తివెన్ను, పెడన, ముదినేపల్లి, మండవల్లి, కైకలూరు, కలిదిండి, మచిలీపట్నం మండలాల్లోని 83,800 ఎ కరాల్లో సాగు విస్తీర్ణం క్రొత్తగా తీసుకురాగలిగామన్నారు. అదేవిధంగా 2020-21 రబీసాగు కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పెడన, కైకలూరు, మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో 1,44,500 ఎకరాల రబీసాగు విస్తీర్ణానికి పుష్కలంగా నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తద్వారా 26 టి.యం.సి. ల నీటిని సద్వినియోగం చేయడం జరుగుతుందన్నారు. గత రబీకి సాగునీరు ఇవ్వని ఏలూరు, దెందులూరు, అవనిగడ్డ నియోజకవర్గాల పరిధిలోని మండలాలకు ఏలూరుకాల్వ, బందరుకాల్వల ద్వారా 10,400 ఎకరాల రబీ సాగు విస్తీర్ణానికి ఈ ఏడాది 5 టియంసిల నీరు అందిస్తున్నామన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రకాశం బ్యారేజీకి అధికమొత్తంలో నీరు చేరడంతో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రబీసాగుకు నీరివ్వడం జరిగిందన్నారు. కృష్ణాజిల్లా పరిధిలో ఈఏడాది రబీసాగుకు రెట్టింపు విస్తీర్ణానికి సాగునీరు అందిస్తున్న‌ట్లు చెప్పారు. గత ఏడాది 84 రోజులు ప్రకాశం బ్యా రేజీకి అధిక మొత్తంలో నీరు చేరిందని, ఈ ఏడాది ఇప్పటికే 112 రోజులు పాటు అధిక మొత్తంలో నీరు చేరడం ద్వారా 1220 టి.యం.సి. ల నీటిని సముద్రంలోకి విడుదల చేసామని మంత్రి తెలిపారు.
పంట నష్టపోయిన రైతులకు డిశంబరు 31లోపు పరిహారం చెల్లిస్తాం (మంత్రి కొడాలి నాని)..
రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) మాట్లాడుతూ దాళ్వాసాగుకు సాగునీరు మాట రైతాంగం మరిచిపోయారని.. దివంగ‌త వైయస్ రాజశేఖర రెడ్డి గతంలో దాళ్వాసాగుకు రబీలో నీరు అందించడం జరిగిందన్నారు. అయితే గత పదేళ్లుగా రబీసాగుకు సాగునీరు అందించకపోగా గత ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యం చేశాయన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే కృష్ణాజిల్లాలో పెడన, కైకలూరు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో రబీసాగుకు నీరందించి రైతుల‌కు చేయూతనిచ్చేందుకు ఇరిగేషన్, సంబంధిత శాఖల ద్వారా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. గత ఏడాదికంటే ఈ ఏడాది రబీ సీజన్‌లో పెడన, కైకలూరు, మచిలీపట్నం, అవనిగడ్డతో పాటు, అవనిగడ్డ, దెందులూరు, ఏలూరు నియోజకవర్గాలకు ఆయా ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు రెట్టింపు స్థాయిలో రబీసాగు విస్తీర్ణానికి సాగునీరును అందించడం జరిగిందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మార్చి 31లోగా పంట చేతికి వచ్చేలాగా అడుగులు వేయాలని మంత్రి కోరారు. గతంలో రైతులకు పంట నష్ట పరిహారాన్ని ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేసేవారని గత ఏడాది నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారాన్ని అందించడం జరిగిందని, ఇటీవల కాలంలో కురిసిన భారీవర్షాల మూలంగా నష్టపోయిన రైతులకు అక్టోబరు నెలలోనే పరిహారాన్ని అందించడం జరిగిందన్నారు. ప్రస్తుతం కురుస్తున్న అధి కవర్షాలవలన నష్టపోయిన పంట వివరాల ఎ  యూమరేషన్ ను డిశంబరు 15 వ తేదీ లోగా పూర్తి చేసి, డిశంబరు 31వ తేదీలోగా పరిహారాన్ని అందించాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు. రబీ సీజన్‌కు అనువైన పంటలసాగుకు రైతులు చొరవ చూపాలని ఇందుకు అధికారులు కూడా తగిన సూచనలు చేయాలని మంత్రి ఆదేశించారు.
కృష్ణాజిల్లా నీటిపారుదల సలహామండలి ఛైర్మన్, జిల్లా కలెక్టర్‌ ఏ.యండి. ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రకాశం బ్యా రేజీ క్రింద కృష్ణా డెల్టా పరిధిలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, అందులో కృష్ణాజిల్లాలో 6.79 లక్షల ఎకరాల ఆయకట్టులో సాగువిస్తీర్ణం ఉండగా, గత ఏడాది 16 టియంసిల నీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా 83,800 ఎకరాల విస్తీర్ణంలో రబీ సాగుకు క్రొత్తగా నీరు అందించామన్నారు. ఈఏడాది గతంకంటే రెట్టింపు స్థాయిలో లక్షా 58 వేల ఎకరాల్లో రబీసాగుకు నీరందిస్తున్నామన్నారు. ఆధునికీకరణలో భాగంగా కృష్ణా తూర్పు డెల్టాలో పంటకాల్వలు, మురుగుకాల్వలు ఆధునికీకరణ పనుల కోసం రూ.2,180 కోట్లకు పరిపాలనా ఆమోదం ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఆధునికీకరణలో భాగంగా 109 పనులకు సంబంధించి రూ.1518.42 కోట్లతో పనులు చేపట్టామన్నారు. ఇప్పటివరకు 75 శాతం పనులు పూర్త‌య్యాయని, మిగిలిన పనులు కూడా ఈ సీజన్‌లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సమావేశంలో భాగంగా పెడన శాసనసభ్యులు జోగి రమేష్ మాట్లాడుతూ లజ్జ బండ, బంటుమిల్లి, మల్లంపూడి ప్రాంతాల్లో అదనపు ఆయకట్టు, డ్రెయినేజీ, కెనాల్ ఆక్రమణ వంటి అంశాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ కండ్రిక, గుణదల, బుడమేరు ఆక్రమణ, గొల్లపూడి పంపింగ్ స్కీమ్, తదితర అంశాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వెలగలేరు, బుడమేరు అంశాలను, నందిగామ శాసనసభ్యులు మొండితోక జగన్మోహనరావు చింతలపూడి స్కీమ్, కంచికచర్ల, వీర్లపాడులకు సంబంధించి సాగునీటి అంశాలపై మాట్లాడారు. అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ మాట్లాడుతూ నియోజకవర్గం శివారు ప్రాంతాల్లో ఉండడం వల్ల అధిక వర్షపాతాలు వచ్చినా, ఇతర పరిస్థితుల్లోనూ తీవ్రంగా నష్టపోయే ప్రాంతం త‌మ‌దేనని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల వలన దాదాపు 70 శాతం పంటలు నీటమునిగాయని ఎన్యూమరేషన్ నిర్వహించి నష్టాన్ని అంచనా వేయాలని పేర్కొన్నారు. దాళ్వాసాగుకు సాగునీరు అందించినందుకు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి సమావేశంలో కృతజ్ఞతలు తెలిపారు.

 

Just In...