Published On: Thu, Mar 14th, 2019

మూత్రపిండాల ఆరోగ్యం ప్రతి ఒక్కరికి, ప్రతిచోట…

* ఆంధ్రప్రదేశ్ సొసైటి ఆఫ్ నెఫ్రాలజీ ఆధ్వర్యంలో వరల్డ్ కిడ్నీ డే ర్యాలీ 

* అవయవదానం వంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటా

* ప్రముఖ హీరోయిన్ ప్రియాంక శర్మ

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: కిడ్నీ వ్యాధుల పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, మూత్రపిండాల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ నిర్వహించిన ర్యాలీ నగరవాసులను ఆలోచింపచేసింది. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సొసైటి ఆఫ్ నెఫ్రాలజీ ఆధ్వర్యంలో గురువారం న‌గ‌రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ సిద్దార్థ మెడికల్ కళాశాల వరకు కొనసాగింది. ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ ఎం.రామారావు, వైద్య విద్యాశాఖ డైరక్టర్, జీవన్దాన్ ట్రస్టు చైర్మన్ డాక్టర్ కె.బాబ్జీ, సిద్దార్థ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.శశాంక్, ప్రముఖ హీరోయిన్ ప్రియాంక శర్మ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం సిద్దార్థ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం.రామారావు మాట్లాడుతూ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మూత్రపిండాల సంరక్షణ గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం హర్షణీయమని అన్నారు. పర్యావరణ పరిరక్షణ మహా సంకల్పంలో భాగంగా ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్ట‌ర్ యన్.అమ్మన్న ఆధ్వర్యంలో పర్యావరణహిత జ్యూట్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు. సీనియర్ నెఫ్రాలజిస్టు, అరుణ్ కిడ్నీ సెంటర్ అధినేత డాక్టర్ ఎన్. అమ్మన్న మాట్లాడుతూ మూత్రపిండాల సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన అవ‌స‌రం అన్నారు. ఏటా మార్చి రెండో గురువారం వరల్డ్ కిడ్నీ జరుపుకుంటామని, “కిడ్నీ ఆరోగ్యం అందరికీ.. అన్ని చోట్ల..” అనే నినాదంతో ఈ ఏడాది వరల్డ్ కిడ్నీ డే జరుపుకుంటున్నామని వివరించారు. కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన మేరకు వ్యాయామం చేస్తూ సరిపడినంత నీరు తీసుకోవడంతో పాటు మ‌ధుమేహం, ర‌క్త‌పోటును అదుపులో ఉంచుకోవడం ద్వారా కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. అవసరం లేకుండా నొప్పి నివారణ మందులు వాడడం, అవగాహన లేని వైద్యుల వద్ద చికిత్స తీసుకోవడం కిడ్నీ సమస్యలకు కారణమవుతున్నాయని వివ‌రించారు. అదేవిధంగా అవయవదానం పట్ల ప్రజల్లో అవగాహన పెరగాలని, అవయవదానం ద్వారా అనేక మందికి కొత్త జీవితం లభిస్తుందని డాక్టర్ ఎన్.అమ్మన్న తెలిపారు. ప్రముఖ హీరోయిన్ ప్రియాంకశర్మ మాట్లాడుతూ కిడ్నీ డే అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని, ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా నిర్వహించే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తానెప్పుడూ ముందుంటానని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సంరక్షణ పట్ల అవగాహన కలిగివుండాలని, అవయవదానం విశిష్టతను ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని ఆమె పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా అవయవదానం ఎనిమిది మందికి పునర్జన్మ అనే అవగాహన పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం మూత్రపిండాల ఆరోగ్యం ప్రతి ఒక్కరికి, ప్రతిచోట అవయవదానంతో ఎనిమిది మందికి పునర్జన్మ అనే నినాదంతో గాలిలోకి బెలూన్స్‌ను విడుదల చేశారు.
 

Just In...