Published On: Wed, Aug 21st, 2019

మృతి అందరిదీ… స్మృతి కొందరికే…

* అవయవ దానం ఆవశ్యకతను గుర్తు చేసిన అన్నపూర్ణమ్మ

* పార్ధీవ దేహం వితరణకు స్వచ్ఛంధంగా ముందుకొచ్చిన కుటుంబ సభ్యులు

* మరెందరికో స్పూర్తిదాయకమన్న సిద్ధార్ధ వైద్య నిపుణులు

సెల్ఐటి న్యూస్, విజయవాడ: అవయవ దానం ఆవశ్యకత నానాటికీ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో పూర్తి పార్ధీవ దేహాన్ని వైద్య పరీక్షల కోసం వితరణ చేసి పలువురికి ఆదర్శంగా నిలిచింది ఆ కుటుంబం. సాధారణ సనాతన ఆలోచనా విధానానికి స్వస్తి పలుకుతూ తమ తల్లి బొప్పన అన్నపూర్ణమ్మ మృతితో ఆమె కుమార్తెలు పర్వతనేని ప్రసూనాంబ, రేగుల జయశ్రీ కలత చెందినప్పటికీ, ఒకింత భిన్నంగా ఆలోచించారు. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామానికి అన్నపూర్ణమ్మ చాలా కాలం క్రితం భర్త నాగేశ్వరరావును కోల్పోయి కుమారులు లేకపోవటంతో విజయవాడలోని కుమార్తెల వద్ద కాలం గడుపుతూ, మంగళవారం రాత్రి మృతి చెందారు. బుధవారం హిందూత్వ అచార వ్యవహారాలను అనుసరించి కర్మకాండలు నిర్వహించవలసి ఉన్నప్పటికీ అన్నపూర్ణమ్మ కుటుంబ సభ్యులు సమాజహితం కాంక్షిస్తూ తమ తల్లి పార్ధీవ దేహాన్ని సిద్దార్ధ మెడికల్ కళాశాలకు వైద్య పరీక్షల కోసం దానం ఇవ్వాలని నిర్ణయించారు. వీరి ఆలోచనకు కుటుంబ సభ్యులు సతీష్, మనుమలు గౌతమ్, నవీన్ సైతం మద్దతు పలకటంతో మరో ఆలోచనకు తావు లేకుండా ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. వైద్య విద్యార్ధులు తమ అభ్యాసన కోసం మృత దేహాలను వినియోగిస్తుంటారు. కాని వారి వాస్తవ అవసరాలకు అనుగుణంగా మృత దేహాలు అందుబాటులో ఉండవు. ఈ క్రమంలో సిద్దార్ద వైద్య కళాశాలకు అనపూర్ణమ్మ మృత దేహం అందించగా, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పిఎస్ఎన్ మూర్తి ఇందుకు సంబంధించిన దృవీకరణ పత్రాన్ని అన్నపూర్ణమ్మ మనుమడు గౌతమ్ కు అందించారు. మరోవైపు అన్నపూర్ణమ్మ నేత్రాలను సైతం సకాలంలో దానం చేసి మరో ఇద్దరికి చూపును ప్రసాదించిన ఘనత కూడా ఆమె కుమార్తెలకు దక్కింది. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య సంస్ధ ప్రతినిధులు నేత్రాలను సేకరించారు. నగరంలోని మొగల్ రాజపురం బోయపాటి మాధవరావు వీధికి చెందిన ఈ కుటుంబ సభ్యులను మృత దేహం వితరణ నేపధ్యంలో పలువురు వైద్య నిఫుణులు అభినందించారు. సిద్దార్ధ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మూర్తి మాట్లాడుతూ సమాజానికి దిశా నిర్ధేశం చేసే రీతిగా అన్నపూర్ణమ్మ కుటుంబ సభ్యులు వ్యవహరించారన్నారు. ఇది మరింత మందికి ఆదర్శప్రాయం కావాలని, ఖననం, దహనం ప్రక్రియల ద్వారా వృధాగా మట్టిలో కలిసిపోతున్న శరీర భాగాలతో మరెందరికో పునర్ జన్మను అందించవచ్చని పేర్కొన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, కమ్యూనిస్టు నాయకులు నివాళి అర్పించారు.

Just In...