Published On: Mon, Nov 20th, 2017

మెట్రో రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారు..!

* ఈ నెల 28న ప్ర‌ధాని చేతుల‌మీదుగా ప్రారంభం

* మియాపూర్లోనే మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని

* అమీర్‌పేట వరకూ రైల్లో నరేంద్ర మోదీ ప్రయాణం

సెల్ఐటి న్యూస్‌, హైదరాబాద్: మెట్రో రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మియాపూర్ నుంచే మెట్రో రైలును ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రూట్‌మ్యాప్ పోలీస్ యంత్రాంగం ఎట్ట‌కేల‌కు శుక్రవారం ఖరారు చేసింది. ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ ఈ నెల 28న విమానంలో బేగంపేటకు, అక్కడి నుంచి మియాపూర్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల ప్రాంతంలో మెట్రోస్టేషన్‌ను ప్రారంభించనున్నారు. అక్కడే మెట్రో పైలాన్ను ప్రారంభిస్తారు. మియాపూర్లో పచ్చజెండా ఊపిన తర్వాత అదే రైలులో ప్రధాని మోదీ 13 కిలోమీటర్ల దూరంలో ఉండే అమీర్‌పేట‌కు వరకు ప్రయాణించనున్నారు. అమీర్పేట ఇంటర్చేంజ్ స్టేషన్ను కొన్ని నిమిషాల పాటు పరిశీలించిన తర్వాత అదే మార్గంలో తిరిగి మియాపూర్ చేరుకునేలా మెట్రో అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ ప్రయాణ సమయంలోనే మెట్రో విశేషాలను అధికారులు ఆయనకు వివరిస్తారు. మియాపూర్‌లో జరిగే సభలో ప్రసంగించిన తర్వాత మోదీ మాదాపూర్ హెచ్ఐసీసీలో జరిగే సదస్సుకు వెళతారు. ఈ మేరకు పోలీసు అధికారులు శుక్రవారం హెలీప్యాడ్ స్థలాన్ని ఖరారు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఎయిర్ఫోర్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ట్రాఫిక్, మెట్రో, ఎల్అండ్టీ అధికార యంత్రాంగం పలుమార్లు మియాపూర్ స్టేషన్, మెట్రో కారిడార్ ప్రాంతాన్ని సందర్శించి, ఓకే చేసింది. మెట్రో రైలు ప్రయాణాన్ని నగరవాసులకు 28 నుంచే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. ప్రధాని మోదీ ప్రారభించి వెళ్లిన 2గంటల తర్వాత ప్రజలకు మెట్రో రైలు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. 30 కిలోమీటర్ల మార్గం సిద్ధమవుతుండడంతో రైళ్లు నడిపేందుకు అన్ని పనులు పూర్తి చేస్తున్నారు.

Just In...