Published On: Tue, Apr 17th, 2018

“మేమున్నాం” కార్య‌క్ర‌మానికి విస్త్ర‌త ప్ర‌చారం క‌ల్పించాలి

* అత్య‌వ‌స‌ర సేవ‌ల‌పై ప్ర‌తి ఇంటికీ టోల్ ఫ్రీ నెంబర్లను ముద్రించిన స్టిక్క‌ర్లు అతికించాలి

* జిల్లాలో ఎక్కడా త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి

* అభివృద్ధి సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తీరుపై వీసీలో కృష్ణా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం స‌మీక్ష‌

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: అత్యవసర సేవలు, సంక్షేమ పధకాలపై ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా “మేమున్నాం” అనే కార్యక్రమాన్ని వినూత్నంగా కృష్ణాజిల్లాలో అమలుచేస్తున్నామని జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. సోమవారం నగరంలోని త‌మ విడిది కార్యాలయం నుండి ఆయ‌న అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) ద్వారా జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథ‌కాల అమలు తీరును కలెక్టర్ స‌మీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 12 లక్షల 50 వేల కుటుంబాలు ఉన్నాయని, ప్రతి ఇంటికి సాధికారిత మిత్రల ద్వారా అత్యవసర సర్వీసుల వివరాల స్టిక్కర్లను అతికించే కార్యక్రమాన్ని జిల్లా అంతటా చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. మొత్తం 12 లక్షల 50 వేల స్టిక్కర్లను ముద్రించామని, ఈ స్టిక్కర్లలో ఫైర్ సర్వీస్, అంబులెన్స్ సర్వీస్, తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్, సంచార వైద్య సేవ, గృహహింస, చైల్డ్ హెల్ప్ లైన్, చంద్రన్న బీమా, ప్రజలే ముందు, కరెంట్ సరఫరా, మంచినీటి సరఫరా మొదలగు సేవలకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్లను ముద్రించిన స్టిక్కర్లను ప్రతి ఇంటికి అతికించే విధంగా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ అన్నారు. గురువారం నుండి జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లోనూ సాధికారిత మిత్రలు ఇంటింటికి తిరిగి ఈ స్టిక్కర్లను అతికించే కార్యక్రమాన్ని చేపడుతున్నారని వివరించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో ఎక్కడా త్రాగునీటి ఎద్దడి లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్.డబ్యూఎస్, మండల స్థాయి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్లను రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి ప్రభుత్వ నిబంధనలు పాటించని వాటర్ ప్లాంట్ల‌పై కేసులు నమోదు చేయాలని, వాటర్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 116 రోజుల జలసంరక్షణ కార్యక్రమంలో పాల్గొన్న పెద్ద ఎత్తున నీరు-చెట్టు పనులు, చెక్ డ్యామ్ పనులు, కాలువల పూడికతీత పనులు త‌దిత‌ర పనులను ఇరిగేషన్ శాఖ సంబంధిత శాఖలు చేపడుతున్నవని కలెక్టర్ అన్నారు. ప్రతి గ్రామంలో 5 పంట కుంటలను త్రవ్వించాలని ఈ సంద‌ర్భంగా అధికారులను ఆదేశించారు. చంద్రన్న పెళ్లికానుక కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలో ప్రారంభించనున్నారని ఈ దిశగా జిల్లాలోని అన్ని మండలాల్లో అరులైన వారి జాబితాను సిద్ధం చేసి ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ న‌మోదు చేయాలని తెలిపారు. రైతు సేవలో రెవెన్యూ శాఖ కార్యక్రమాన్ని అన్ని మండలాల్లోనూ అమలుచేస్తున్నామని, ఈ దిశగా ప్రతి మండల తాహశిల్దార్, రెవెన్యూ సేవలను ఆయా మండలాల్లో ప్రజల‌కు త్వరితగతిన అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజాసాధికారిత సర్వేలో ఇంకా నమోదు కాని వివరాలను ఈ నెలాఖరులోగా నమోదు చేయాలని రెవెన్యూ అధికారులను, మున్సిపల్ కమీషనర్లను కలెక్టర్ ఆదేశించారు. భూధార్ కార్యక్రమం అమలు పై రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించాలని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు ద్వారా ప్రజల సంతృప్తి శాతాన్ని పెంచే దిశగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. మీ-కోసం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన ఆర్జీలను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించి, ధరఖాస్తుదారునికి పరిష్కార పత్రాలను అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి అధికారి గ్రామాలలో ప్రభుత్వ కార్యక్రమాలు అమలుపై అవగాహన కలిగే విధంగా పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలతో మమేకం కావాల‌ని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్-2 పి.బాబురావు, రవాణాశాఖ డిప్యూటి కమీషనర్ మీరాప్రసాద్, డిఈవో రాజ్యలక్ష్మీ సర్వశిక్ష అభియాన్ పి.డి.ప్రసాద్, డిఆర్డిఎ పి.డి చంద్రశేఖరరాజు, బిసీ వెల్ఫేర్ అధికారి యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
 

Just In...