Published On: Sat, Jun 15th, 2019

మ‌రింత ఉత్త‌మ ఫ‌లితాల సాధ‌న‌కు కృషి చేయాలి

* ఓపెన్ స్కూలు టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్

సెల్ఐటి న్యూస్‌, ఎడ్యుకేష‌న్ (విజ‌య‌వాడ‌): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో మరింత ఉత్తమ ఫలితాలు సాధించే దిశలో అధికారులు కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ‌ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాల‌యం సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం మే 2019లో నిర్వహించిన 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను సంచాలకులు ఆర్.నరసింహారావు తదితరులతో కలిసి మంత్రి శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్‌ను మంత్రి అభినందిస్తూ అక్కడ అమలు చేస్తున్న విధి విధానాలను, కార్యాచరణ ప్రణాళికలను అధ్యయనం చేసి నివేదికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం 2019 కి చెందిన 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేస్తూ మంత్రి గణాంకాలను వివరించారు. పదవతరగతి పరీక్షలను 208 కేంద్రాల్లో నిర్వహించామని, ఆరు జిల్లాలలో మూల్యాంకన చేస్తామన్నారు. మే నెలలో నిర్వహించిన పరీక్షలకు 48,082 మంది సప్లిమెంటరీ పరీక్షలకు 8,067 మంది హాజరు కావడం జరిగిందన్నారు. మొత్తం 59,867 మంది పరీక్షలకు ధరఖాస్తు చేసుకొనగా, 56,149 మంది పరీక్షలకు హాజరయ్యారని పేర్కొన్నారు. వీరిలో 39,263 మంది (69.93 శాతం) ఉత్తీర్ణత సాధించారన్నారు. బాలికలు 21,529 మంది హాజరు కాగా, 15,866 మంది (73.70 శాతం), బాలురు 34,620 మంది హాజరు కాగా, 23,397 మంది (67.58 శాతం) ఉత్తీర్ణత సాధించారన్నారు.
ఇంటర్మీడియట్ పరీక్షలను 220 కేంద్రాల్లో నిర్వహించామని, ఏడు జిల్లాలలో మూల్యాంకన చేస్తామన్నారు. మే నెలలో నిర్వహించిన పరీక్షలకు 50,636 మంది సప్లిమెంటరి పరీక్షలకు 10,361 మంది హాజరు కావడం జరిగిందన్నారు. మొత్తం 64,279 మంది పరీక్షలకు ధరఖాస్తు చేసుకొనగా, 60,997 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. వీరిలో 41,367 మంది (67.82 శాతం) ఉత్తీర్ణత సాధించారన్నారు. బాలికలు 22,381 మంది హాజరు కాగా, 15,708 మంది (70.18 శాతం), బాలురు 38,616 మంది హాజరు కాగా, 25,659 మంది (66.45 శాతం) ఉత్తీర్ణత సాధించారన్నారు.

రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ కు అవకాశం…
మార్కుల రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్‌తో కూడిన‌ జవాబుపత్రాల జిరాక్స్ కాపీలను కోరుటకు నిర్ణీత రుసుముతో అనుమతించడం జరుగుతుందన్నారు. జూన్ 17 నుండి జూన్ 26 వరకూ రుసుం చెల్లింపులకు అనుమతించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతీ సబ్జెక్టుకు సంబంధించి జవాబుపత్రం రీకౌంటింగ్ చేసేందుకు ఎస్‌.ఎస్‌.సి విద్యార్ధులు రూ.100, ఇంటర్మీడియట్ విద్యార్ధులు రూ.2 వందలు రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా రీవెరిఫికేషన్‌తో కూడిన‌ జవాబుపత్రాల జిరాక్స్ కాపీలను కోరుటకు గాను ప్రతీ సబ్జెక్టుకూ యస్యస్ సి విద్యార్ధులు, ఇంటర్మీడియట్ విద్యార్ధులు వెయ్యి రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలలో బాలికలు ఎ క్కువు శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరగు అభ్యర్థులు జూన్ 17 నుండి 21లోగా ఎటువంటి ఆలశ్య రుసుం లేకుండా సబ్జెక్టు ఒక్కింటికీ (థియరి) ఎస్‌.ఎస్‌.సి విద్యార్ధులు రూ.100, ఇంటర్ విద్యార్థులు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఒక్కింటికీ ఎస్‌.ఎస్‌.సి విద్యార్ధులు రూ.50లు, ఇంటర్ విద్యార్ధులు రూ.100 చెల్లించవలసి ఉంటుందన్నారు. ఇంప్రూవ్ మెంట్ కోసం ధరఖాస్తు చేసుకునే ఎస్‌.ఎస్‌.సి అభ్యర్థులు రూ.100, ఇంటర్ విద్యార్ధులు రూ.250 సబ్జెక్టు ఒక్కింటికీ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆలశ్య రుసుం అదనంగా రూ.25 చెల్లించి జూన్ 22 నుండి 24 వరకూ ఆలశ్య రుసుం అదనంగా రూ.50 చెల్లించి జూన్ 25 నుంచి 26 వరకూ పరీక్ష రుసుం చెల్లించడానికి అనుమతించడం జరుగుతుందన్నారు. ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పరీక్షలు ఎస్‌.ఎస్‌.సి మరియు ఇంటర్ విద్యార్థుల కోసం జూలై 11వ తేదీ నుండి 18వ తేదీ వరకూ నిర్వహించడం జరుగుతుందని సంచాలకులు ఆర్.నరసింహారావు తెలిపారు.

2019-20 ఏ.పి. సార్వత్రిక విద్యాపీఠం ప్రవేశ వివరాలను విడుదల చేసిన మంత్రి…

ప్రవేశానికి సంబంధించి విధి విధానాలను జూన్ 28న విడుదల చేయడం జరుగుతుందన్నారు. ధరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా స్వీకరించడం జరుగుతుందన్నారు. ధరఖాస్తులు సమర్పించుటకు ఆగష్టు 26వ తేది చివరి తేదీగా నిర్ణయిస్తూ పరీక్షా ఫీజులను ఆగష్టు 31లోగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆలస్యం రుసుము రూ.200లు అదనంగా చెల్లిస్తూ ధరఖాస్తు సమర్పించుటకు చివరి తేది సెప్టెంబరు 26 గాను నిర్ణయిస్తూ పరీక్షా రుసుంను సెప్టెంబరు 30లోగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. వెబ్‌సైట్ WWW.apopenschool.org. కార్యక్రమంలో సంచాలకులు ఆర్.నరసింహారావు, ఆర్‌జెడి దేవానందరెడ్డి, కృష్ణాజిల్లా డిఇఓ రాజ్యలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వ్యవస్థాపక సంచాలకులు కృష్ణమాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.

Just In...