Published On: Wed, Apr 11th, 2018

మ‌హాత్మా జ్యోతిబా పూలే జీవితం ఆదర్శప్రాయం..

* జ‌యంతి కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: పేదరికం లేని సమాజస్థాపనే ధ్యేయంగా వెనుకబడిన తరగతుల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధ‌వారం మహాత్మా జ్యోతిబా పూలే 192వ రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాన్ని విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించారు. తొలుత తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రం ఎదుట ఉన్న జ్యోతిభా పూలే కాంస్య విగ్ర‌హానికి, న‌వ‌యుగ క‌వి గుఱ్రం జాషువా కాంస్య విగ్ర‌హానికి సీఎం చంద్ర‌బాబు పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం స్టేడియంలో జ‌రిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలేని స్పూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు పనిచేయాలని, సమాజంలోని పేదల కోసం అంకితభావంతో సేవలు అందించాలన్నారు. జ్యోతిబాపూలే జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కున్నారన్నారు. ప్రజలు, వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలని నిరంతం పోరాడిన మహోన్నత వ్యక్తి జ్యోతిబా పూలే అని అన్నారు. మహిళలు విద్యను అభ్యసించాలని భావించి తొలిసారి మహిళా స్కూలను ఏర్పాటు చేసి సతీమణి సావిత్రి జ్యోతిబాపూలే ఉపాధ్యాయురాలిగా మహిళలకు విద్యను నేర్పారని గుర్తు చేశారు. ఎన్నో ఉద్యమాలలో భాగస్వాములు అయ్యారని, బీసీలకు అండగా ఉన్న వ్యక్తి జ్యోతిబాపూలే అని అన్నారు. జ్యోతిబాపూలే జీవితం అందరికి ఆదర్శప్రాయమని నిరాశ నిస్పృహలకు లోనుకాకుండా అందరికి చేయూతను అందించిన మహోన్నత వ్యక్తి పూలే అన్నారు. బీసీలకు రాజకీయ చైతన్యం తొలిసారి తమ పార్టీ హాయాంలోనే జరిగిందని, స్వర్గీయ నందమూరి తారక రామారావు బిసీలకు రాజకీయ చైతన్యం తీసుకువచ్చారన్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు తమ పార్టీలో ఉన్నారన్నారు. గతంలోని ప్రభుత్వాలు బిసీలకు అన్యాయం చేసి నిరాశా, నిస్పృహలకు గురిచేశారన్నారు. ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు బిసీలకు ఆదరణ పధకాన్ని తీసుకువచ్చిన ఘనత తమదేనన్నారు. చేతి వృత్తులు, కుల వృత్తులు కనుమరుగు కాకుండా వారిని అన్ని విధాల ఆదుకున్నామన్నారు. భారతదేశంలోనే బీసీలకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించడంతో పాటు సబ్ ప్లాన్ పేరిట రూ.12 వేల కోట్ల నిధులు కేటాయించిన ఘనత తమదన్నారు. 11 బీసీ కులాలకు చెందిన ఫెడరేషన్లకు చైర్మన్లను నియమించామని, పేదరికం లేని సమాజ స్థాపనే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఎన్.టి.ఆర్ భరోసా పెన్షన్ల ద్వారా 50 లక్షల మంది లబ్దిదారులకు 1000, 1500 పెన్షన్లను అందిస్తున్నామన్నారు. చంద్రన్న భీమాలో ప్రమాదానికి గురైన వారికి 5 లక్షల రూపాయలు అందిస్తున్నామన్నారు. పేద ప్రజలకు పెళ్లి ఖర్చులు తగ్గించాలని, పెళ్లి కానుక పథకం ద్వారా 35 వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. గర్భీణీ స్త్రీలు, చిన్నారులు, బాలింతలలో పౌష్టికాహార లోపం , తక్కువ బరువుతో పుట్టిన వారికి ఆదనపు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. బీసీలలో కులవృత్తులు చేసుకునే వారికి 70 శాతం సబ్సీడి పై ఆధునిక పనిముట్లు సమకూర్చుతున్నామన్నారు. గ్రామాలలో 25 వేల కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్ల నిర్మాణాలను పూర్తిచేశామని, వీధి దీపాలు, ఎల్.ఈ.డీలు, వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించామని ముఖ్యమంత్రి అన్నారు. బీసీలకు 19 లక్షల గృహాలను నిర్మించామని, గ్రామాలలో మౌలికవసతులను అభివృద్ధి చేశామన్నారు. చంద్రన్న పెళ్లి కానుకలో 30 వేల మందికి 100 కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. విదేశీ విద్య పధకంలో 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని, పోస్ట్ మెట్రిక్ , ఫ్రీమెట్రిక్ స్కాలర్షిప్లను బిసీలకు ఇస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఆగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడిన వారికి దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రూ.200 కోట్లు కేటాయించామన్నారు. హైదరాబాద్‌ను నాలెడ్జ్ కేంద్రంగా అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. పేదవారు ఇబ్బంది పడకూడదనే కష్టపడుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆన్యాయం చేసిందని, అమరావతిని ఢిల్లీ కంటే మెరుగ్గా నిర్మిస్తామని హామి ఇచ్చి నేరవేర్చకపోవడం దురదృష్టకరమన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు లేకుండా ఆన్యాయం చేసిందన్నారు. అన్ని రకాలుగాను కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉన్నామని అయినప్పటికి తన మీద కక్షతో రాష్ట్రం మీద దాడి చేసే పరిస్థితికి భాజపా వచ్చిందని సీఎం మండిపడ్డారు. తెలుగుదేశం సహకారం లేకుంటే రాష్ట్రంలో భాజపా ఎక్కడుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం రాజీ పడబోమని భాజపాకు అర్థమైనందునే కేసులున్న వారిని చేరదీశారని విమర్శించారు. అలా చేరదీస్తే తమ చెప్పుచేతల్లో జగన్‌ ఉంటాడన్నది భాజపా ఎత్తుగడ అని వివరించారు. కక్ష సాధింపు కోసం అవినీతి పార్టీనిభాజపా అక్కున చేర్చుకుందన్న చంద్రబాబు ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. హక్కుల సాధన కోసం ప్రధాని ఇంటిని ముట్టడించిన ఘనత తెదేపా ఎంపీలదన్నారు. కర్ణాటక ఎన్నికల కోసం కావేరి బోర్డు వేయకుండా అన్నా డీఎంకేతో పార్లమెంట్‌లో గొడవ చేయించారని దుయ్యబట్టారు. వెంకటేశ్వరస్వామి సాక్షిగా మోదీ చేసిన వాగ్దానాలను తాము ప్రశ్నిస్తుంటే.. తామేదో తప్పు చేసినట్లు మోదీ దీక్ష చేస్తాననడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. ఎలాంటి త్యాగాలు, పోరాటాలకైనా తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలు గెలవడమే మన లక్ష్యమన్న చంద్రబాబు అప్పుడే మన మాట వినే ప్రభుత్వం కేంద్రంలో వస్తుందన్నారు. తద్వారా ప్రత్యేక హోదా కూడా వస్తుందన్నారు. కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రులు కె.అచ్చెన్నాయుడు, కొల్లు ర‌వీంద్ర‌, దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు, పార్ల‌మెంట్ స‌భ్యులు కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌, సీఎం ర‌మేష్‌, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వ‌రరావు, జిల్లా ప‌రిష‌త్ ఛైర్‌ప‌ర్స‌న్ గ‌ద్దె అనూరాధ‌, ప్ర‌భుత్వ విప్ బుద్దా వెంక‌న్న‌, వెనుక‌బ‌డిన సంక్షేమ శాక ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ బి.ఉద‌య‌ల‌క్ష్మీ, మేనేజింగ్ డైరెక్ట‌ర్ కె.హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌, జిల్లా క‌లెక్ట‌ర్ బి.ల‌క్ష్మీకాంతం, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ జూపూడి ప్ర‌భాక‌ర్‌, మ‌హిళా కోఆప‌రేటీవ్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్ పంచుమ‌ర్తి అనూరాధ‌, ప‌లువురు ఫైనాన్స్ కార్పొరేష‌న్, ఫెడ‌రేష‌న్ ఛైర్మ‌న్లు పాల్గొన్నారు.
 

Just In...