Published On: Mon, Aug 19th, 2019

యువత సాంకేతిక మెళకువలను నేర్చుకోవాలి..

* జీవిత సాఫల్య పురస్కార గ్రహీత దండమూడి సీతారాం

సెల్ఐటి న్యూస్, ఎడ్యుకేషన్: పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఫోటోగ్రఫీ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ పాత్రికేయ ఫోటోగ్రాఫర్, జీవిత సాఫల్య పురస్కార గ్రహీత దండమూడి సీతారాం ముఖ్య అతిథిగా విచ్చేసి ఫోటోగ్రఫీలో ఉన్నత స్థానానికి చేరటానికి విద్యార్థులు నేర్చుకోవలసిన మెళకువలను సూచించారు. ఆయన మాట్లాడుతూ అత్యంత నాణ్యమైన ఛాయాచిత్రాలను బంధించగలిగే సామర్ధ్యం గల స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకే అందుబాటులోకి రావడంతో యువతలో ఫోటోగ్రఫీ వ్యాపకంపై ఎంతో ఆసక్తి పెరిగిందని ఈ ఆసక్తితో పాటు కొన్ని సాంకేతిక మెళకువలను నేర్చుకుంటే ఫోటోగ్రఫీ నిపుణులుగా ఎన్నో ఉపాధి అవకాశాలు లభిస్తాయని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు ఫోటోగ్రఫీ వంటి అభిరుచి పై దృష్టి సారించడం ద్వారా ఆదాయ సంపాదనకు మార్గం సుగమం అవుతుందని తెలియజేశారు. కళాశాల డైరెక్టర్ వేమూరి బాబురావు మాట్లాడుతూ యాజమాన్యం తరపున ఫోటోగ్రఫీలో విద్యార్థులను ప్రోత్సహించటానికి కావలసిన విలువైన కెమెరాలు, ఇతర సామగ్రి సమకూర్చి కళాశాలలో జరిగే వేడుకలు అన్నింటినీ విద్యార్థుల ద్వారానే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేయిస్తున్నట్లు తెలియజేశారు. కళాశాల ఉపాధి విభాగ అధికారి కావూరి శ్రీధర్ మాట్లాడుతూ ఫోటోగ్రఫీ కేవలం ఆదాయ సంపాదన మార్గంగానే కాకుండా ఒత్తిడిని జయించటానికి ఉత్తమమైన అభిరుచి అని తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్టూడెంట్ క్లబ్స్ సమన్వయకర్త ఐ.వెంకటేశ్వరరావు, ఫోటోగ్రఫీ క్లబ్ ఇంచార్జ్ విజయ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Just In...