Published On: Thu, Jun 25th, 2020

‘యూజీ, పీజీ పరీక్షలు రద్దయ్యే అవకాశం లేదు’

* రాష్ట్రంలోని‌ 16 యూనివర్సిటీల వీసీలతో వీడియో కాన్ఫరెన్స్

* సీఎం జ‌గ‌న్‌తో చ‌ర్చించి తుది నిర్ణ‌యం తీసుకుంటాం ‌

* ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: పదో తరగతి పరీక్షలు ర‌ద్దు చేసిన నేప‌ధ్యంలో అదే త‌ర‌హాలో యూజీ, పీజీ పరీక్షలు రద్దయ్యే అవకాశం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తున్నామే తప్ప రద్దు అన్న‌ ప్రశ్న ఉత్పన్నమే కాలేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేర‌కు బుధవారం ఆయన ఉన్నత విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థుల పరీక్షల నిర్వహణ, రాబోయే విద్యా సంవత్సరంలో తీసుకోవాల్సిన ప్ర‌ణాళిక త‌దిత‌ర అంశాల‌పై రాష్ట్రంలోని‌ 16 యూనివర్సిటీల వీసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితులపై ఏ విధంగా ముందుకు వెళ్లాలో సమీక్షించారు. అనంతరం మంత్రి సురేష్‌ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహ‌న్‌రెడ్డి నాయకత్వంలో కరోనా నియంత్రణపై స్పష్టమైన జాగ్రత్తలతో ముందుకెళ్తున్నామన్నారు. కరోనా సమయంలో ఇబ్బందులు ఎదురావుతాయనే ముందుగానే 9వ‌ తరగతి లోవు పరీక్షలు రద్దు చేశామని మం‌త్రి పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించాలనుకున్నా కేసులు పెరుగుతున్నందున రద్దు చేశామని తెలిపారు. యూజీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు పరిస్థితులపై అవగాహన ఉంటుందని.. ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో రకమైన పరిస్థితి ఉందన్నారు. పరీక్షలు నిర్వహించాల్సి వస్తే ఎలా చేయాలి.. రద్దు చేయాల్సి వస్తే ఏమి చేయాలి అని పూర్తిగా కసరత్తు చేశామని మంత్రి సురేష్ తెలిపారు. ఆయా అంశాల‌ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి గురువారం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇప్పటి వరకూ పరీక్షలు రద్దు చేస్తున్నామని ప్రకటించలేదని.. ఏ నిర్ణయం తీసుకోలేదని మంత్రి స్ప‌ష్టం చేశారు. యూజీసీ గైడ్‌లైన్స్ ప్రకారం అక‌డమిక్ క్యాలెండర్‌ను రూపొందిస్తామని మంత్రి వెల్ల‌డించారు.

Just In...