Published On: Wed, Aug 21st, 2019

రద్దైన నోట్లు రూ.కోటి ఇస్తే రూ.15లక్షలిస్తామంటూ మోసం..!

* ఘరానా ముఠాను పట్టుకున్న విశాఖ పోలీసులు

సెల్ఐటి న్యూస్, విశాఖపట్నం క్రైమ్: చలామణీలో లేని పాతనోట్లు మార్చాలని ఓ వ్యాపారిపై ఒత్తిడి తెస్తున్న ముఠాను విశాఖ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కోటి రూపాయల విలువ చేసే పాతనోట్లకు రూ.15 లక్షలు కొత్త నోట్లు ఇచ్చేందుకు ఓ వ్యక్తితో కొందరు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తి తప్పించుకు తిరగడంతో పాత నోట్లు కలిగి ఉన్న ముఠా ఆ వ్యక్తి స్నేహితుడైన వ్యాపారి వద్దకు వచ్చారు. పాత నోట్లను మార్చే బాధ్యత వ్యాపారిదే అని ఒత్తిడి చేశారు. వ్యాపారి తనకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని చెప్పినా వినకుండా తుపాకీతో బెదిరించి హతమారుస్తామనడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యాపారి సహకారంతో అగనంపూడి టోల్ గేట్ వద్ద పాత నోట్లు ఉన్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసు వాహనంగా నమ్మించి…
ఆ వాహనాన్ని ఎవరూ తనిఖీ చేయకుండా ఉండేందుకు నిందితులు పోలీసు బోర్డును పెట్టడంతో పాటు ఐజీ ర్యాంకు అధికారి వాహనంగా నమ్మించేందుకు వెనుక రెండు నక్షత్రాలను సైతం పెట్టడం గమనార్హం. ఈ వాహనంలో ఉన్న ఒక కోటి 97 వేల రూపాయలతో పాటు, వాకీ టాకీలు, తుపాకీ, 6 డమ్మీ బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 13 మందిని అరెస్టు చేయగా మరొకరిని పట్టుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు. రూ.కోటికి పైగా విలువ చేసే ఆ పాత నోట్లు ఎక్కడి నుంచి సేకరించారు అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. పాత నోట్లను కొత్త నోట్లుగా మారుస్తామని చెప్పిన వ్యక్తి ద్వారా అసలు విషయాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Just In...