Published On: Mon, Jul 15th, 2019

రాంప్ర‌సాద్ హ‌త్య కేసులో కోగంటి సత్యమే ప్ర‌ధాన సూత్రధారి

* ప‌శ్చిమ మండ‌లం డీసీపీ శ్రీనివాస్ వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, హైదరాబాద్ క్రైం: ఇటీవ‌ల దారుణ హ‌త్య‌కు గురైన వ్యాపారి రాంప్రసాద్‌ హత్య కేసులో విజయవాడకు చెందిన పారిశ్రామిక‌వేత్త కోగంటి సత్యమే ప్రధాన సూత్రధారి అని పశ్చిమ మండలం డీసీపీ శ్రీనివాస్‌ వెల్లడించారు. రుణ భారం తగ్గించినా అప్పు తీర్చలేదన్న అక్కసుతోనే ఈ హత్య చేయించినట్లు తెలిపారు. మొత్తం ఈ కేసులో ఆరుగురు నిందితులు ఉన్నారని, ఐదుగురిని అరెస్ట్‌ చేశామని చెప్పారు. రాంప్రసాద్‌ హత్య కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ సోమవారం మీడియాకు వెల్లడించారు. రాంప్రసాద్‌, కోగంటి సత్యం ఇద్దరూ 2003 నుంచి కలిసి వ్యాపారం కలిసి చేశారు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా రూ.70 కోట్లు రాంప్రసాద్‌ కోగంటి సత్యానికి బకాయిపడ్డాడు. ఈ వివాదం పెద్దల వద్దకు వెళ్లడంతో రూ.23 కోట్లు చెల్లించాల్సిందిగా సెటిల్‌ చేశారు. రుణమొత్తం భారీగా తగ్గించినా రాంప్రసాద్‌ అప్పు తీర్చలేదని కోగంటి సత్యం ఆగ్రహంతో ఉన్నాడు. దీంతో రాంప్రసాద్‌ను హతమార్చాలని కోగంటి సత్యం నిర్ణయానికొచ్చాడు. శ్యామ్‌‌, మరో ఇద్దరు కలిసి రాంప్రసాద్‌ను హత్య చేశారు. హత్య ఎవరు చేసినా నిందితుడు, ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమేనని డీసీపీ వెల్లడించారు. తనపై ఎవరికీ అనుమానం రాకుండా రాంప్రసాద్‌ను హత్య చేయించాలని కోగంటి సత్యం భావించాడని, అందుకే పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేశాడని చెప్పారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల్లో కోగంటి సత్యం, శ్యామ్‌, ప్రసాద్‌, ప్రీతమ్‌, రామును అరెస్ట్‌ చేశామని చెప్పారు. కోగంటి సత్యంతో గొడవల వల్లే రాంప్రసాద్‌ విజయవాడ వదిలి హైదరాబాద్‌కు వచ్చారని తెలిపారు. ఈ హత్యకు రూ.10లక్షలు సుపారీ ఇచ్చేందుకు కోగంటి అంగీకరించినట్లు తెలిసిందన్నారు.

Just In...