Published On: Wed, Aug 21st, 2019

రాజధానిని తరలిస్తే ఉద్యమబాట పడతాం..

* మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

సెల్ఐటి న్యూస్, చిలకలూరిపేట: రాజధాని అమరావతి ప్రాంతాన్ని తరలించేందుకు వైకాపా కుట్రపూరితంగా వ్యవహరిస్తే సహించేది లేదని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో బుధవారం ఆయన మీడియాతో ఆయన మాట్లాడారు. అమరావతిలో రాజధాని నిర్మాణంపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ప్రత్తిపాటి తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ప్రజలు అధికారం కట్టబెడితే ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతిలో నిర్మించిన రాజధానిని.. దొనకొండ, ఇడుపులపాయకు తరలించే ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. దీనిపై అవసరమైతే ఉద్యమబాట పడతామని.. ఆమరణ దీక్షకు సైతం వెనుకాడబోమన్నారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం స్పందించి వైకాపా కుయుక్తులకు అడ్డుకట్ట వేయాలని కోరారు. నీటి ప్రవాహాన్ని అడ్డుకొని అమరావతిని ముంచే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వరద ముంపు ప్రాంతాల్లో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన చెప్పారు.

Just In...