Published On: Thu, Jan 10th, 2019

రాజధాని నిర్మాణం ఒక అద్భుత అవకాశం

* రాజధాని అభివృద్ధిలో సింగపూర్ సహకారం మరువలేనిది 

* అవినీతి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ 

* లింగాయపాలెంలో వెల్కమ్ గ్యాలరీ శంఖుస్థాప‌న‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

* ఈ బృహ‌త్ కార్య‌క్ర‌మంతో బంధం మ‌రింత ప‌టిష్టం

* సింగ‌పూర్ మంత్రి ఈశ్వ‌ర‌న్‌

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రాజధాని నిర్మాణం ఒక అద్భుతమైన, అరుదైన అవకాశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం అమరావతి రాజధాని ప్రాంతంలోని లింగాయపాలెంలో వెల్కమ్ గ్యాలరీని సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో కలసి ఆయన శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ వెల్కమ్ గ్యాలరీకి శంఖుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. స్వల్ప కాలంలోనే సింగపూర్ ఏ విధంగా అభివృద్ధి అయ్యిందో అందరికి తెలుసునన్నారు. రాజధాని అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వం సహకారం మరువలేమన్నారు. రాజ‌ధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. రూ.48 వేల కోట్లతో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. సింగపూర్ తరహాలో అభివృద్ది చేస్తానని మాట ఇచ్చానని, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటున్నానన్నారు. నైపుణ్యాభివృద్ధిలో, ఆడ్మినిస్ట్రేషన్లో సింగపూర్ సహకారానికి ధన్యవాదాలన్నారు. లీక్వాన్ యూనివర్శిటి రేటింగ్లో ఆంధ్రప్రదేశ్ ఆగ్రశ్రామిగా వచ్చిందన్నారు. ఒక అద్భుత సమయంలో మనం ఉన్నామని, స్ఫూర్తిదాయక కాలంలో మనం ఉన్నామన్నారు. రాజధాని నిర్మాణం అనే అద్భుత అవకాశం మనకు వచ్చిందని, ఇదొక అరుదైన అవకాశమన్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన రాజధాని నిర్మించుకుంటున్నామని, మన రాజధాని ప్రపంచంలో 5 అత్యున్నత నగరాలలో ఒకటిగా కావాలన్నారు. నిన్ననే ఆదాని గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్నామని, ప్రపంచంలోనే అద్భుతమైన డేటా సెంటర్ హాబ్ విశాఖలో పెడుతున్నామన్నారు. డేటా సెంటర్ పార్కులతో పాటు సోలార్ పార్కులు వస్తున్నాయన్నారు. రూ.70 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయన్నారు. లక్షా 10 వేల మంది ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. అవినీతి రహిత రాష్ట్రంగా ఏపిని చేస్తున్నామని, ఇప్పటికే అవినీతి రహిత రాష్ట్రాలలో 3వ స్థానంలో ఉన్నామన్నారు. సాంకేతికత ద్వారా పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు. ప్రపంచంలోనే మేలైన సాంకేతికత అనుసరిస్తున్నామన్నారు. ఏపి ఇప్పటికే దేశంలో అనేక రాష్ట్రాలకు నమూనాగా మారిందన్నారు. అతి త్వరలోనే ప్రపంచానికే నమూనా కానుందన్నారు. పారదర్శకమైన పరిపాలనకు దర్పం పట్టేలాగా తొలి జన్మభూమిలో ఒక కోటి 50 లక్షల మేర ప్రజా ఫిర్యాదులు రావడం జరిగిందని వాటిని పరిష్కరించడం ద్వారా ప్రజలకు మెరుగైన పరిపాలనను అందించామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యల మూలంగా ఫిర్యాదుల సంఖ్య 4 లక్షలకు తగ్గడమే నిదర్శనమని ముఖ్యమంత్రి అన్నారు. కృష్ణానది ఒడ్డున రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని తెచ్చామని, నదుల అనుసంధానం చేశామన్నారు. నీటి భద్రత ఇచ్చామని, పంచనదుల మహా సంగమం చేస్తున్నామన్నారు. వెల్కమ్ గ్యాలరీ వాణిజ్య అభివృద్ధి కేంద్రంగా ఉంటుందన్నారు. సమాజ అభివృద్ధి కేంద్రంగా ఉంటుందన్నారు. 5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ వెల్ కమ్ గ్యాలరీ రాజధాని నగరం అమరావతిలో అభివృద్దిని ఉత్తేజితం చేసేలా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. సమాజం (కమ్యూనిటి), వాణిజ్యం (బిజనెస్), భాగస్వామ్యాల (పార్టనర్షిప్స్)కు మూలకేంద్రంగా ఉంటుందన్నారు. ప్రాచీన తెలుగు సంస్కృతి విశిష్టతను, 2300 సంవత్సరాల క్రితం తెలుగు జాతి వైభవాన్ని, సృ్మతులను, గుర్తింపును ఈ వెల్కమ్ గ్యాలరీ ప్రతిబింబిస్తుందన్నారు. అమరావతి నగర గత వైభవాల వారసత్వ సందపను స్ఫురణకు తేవడమే కాకుండా భవిష్యత్ తరాలకు సూర్పినిచ్చేలా గ్యాలరీ డిజైన్ ఉంటుందన్నారు. ప్రాచీన పురావస్తు స్మతి చిహ్నాలతో పాటు ప్రస్తుత అధునాతన సాంఘిక అంశాలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దుతారన్నారు. ఎటుచూసినా పూర్తి పచ్చదనం పరిసరాల మధ్య 4,080 చ.మీ బిల్డప్ ఏరియాలో వెల్కమ్ గ్యాలరీని నిర్మిస్తారన్నారు. (ఏడిపి) ఇప్పటికే పార్టనర్ షిప్ ప్రోగ్రామ్ చేపట్టిందన్నారు. స్టార్టప్స్ ను, మార్కెట్ లిడర్స్ ను, ఆకాడమిక్ ఇన్ ఫ్లుయన్సర్స్‌ను ఒకచోటకు తెచ్చిందన్నారు. స్మార్ట్ బిల్డింగ్స్, స్మార్ట్ ఎన్విరాన్ మెంట్, స్మార్ట్ ఎనర్జీ, స్మార్ట్ కోలాబరేషన్స్ నాలుగు కీలక ప్రాంతాలలో వీరిని భాగస్వాములను చేసిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే దీనికి అద్భుతమైన స్పందన లభించిందన్నారు. జర్మనీ, జపాన్, సింగపూర్ మరియు భారతదేశం నుంచి 15 కంపెనీలు అవగాహనా ఒప్పందాలను (ఏంవోయూలను) అమరావతి డెవలప్ మెంట్ పార్టనర్ (ఏడిపి)తో చేసుకున్నాయన్నారు.
                  సింగపూర్ మంత్రి ఈశ్వరన్ మాట్లాడుతూ సింగపూర్, ఆంధ్రప్రదేశ్ మధ్య పటిష్ట బంధం ఏర్పడిందన్నారు. అందువల్లే వివిధ రంగాలలో అద్భుతమైన సహకారం సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి ముందుచూపు, సృజనాత్మక ఆలోచనల వల్లే ఇది సాధ్యం అయ్యిందన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధిలో ఇది తొలి అడుగు మాత్రమేనని, ఇదే విధమైన సహకారం ఇకముందు కూడా ఉంటుందన్నారు. ఇదే స్పూర్తితో ఏపీ రాజధాని అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామన్నారు. ల్యాండ్ పూలింగ్ కు సహకరించిన రైతులకు అభినందనలు, రైతుల ఆకాంక్షలను నెరవేర్చేలా రాజధాని నగరం నిర్మిస్తామన్నారు. సింగపూర్ ప్రభుత్వం తరపున పూర్తి తోడ్పాటు అందిస్తామన్నారు. ఏడిపి వెల్కమ్ గ్యాలరీ సిటి గ్యాలరీ ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని ఇక్కడి ప్రజల సంస్కృతి గుర్తుచేసేలా కేపిటల్ సిటి మోడలను ప్రతిబింబిస్తుంది. ఎగ్జిబిషన్ స్పేసెస్ కళలు, వినూత్న సాంకేతికత మరియు అర్బన్ సోల్యూషన్స్ కు కేంద్రంగాను, ఇందులో కమ్యూనిటి ఎంగేజ్మెంట్ ఎరియాస్ కన్వెన్షన్ సెంటర్లు, రిక్రియేషన్ జోన్స్ మరియు హెల్త్ కార్నర్లు ఉంటాయి. కోవర్కింగ్ స్పేసెస్ రాజధాని ప్రాంతంలో స్టార్టప్ల అభివృద్దిని ప్రోత్సహించేలాగాను, వాణిజ్య ప్రోత్సాహక వేదికగా వెల్కమ్ గ్యాలరీ ఉండడం జరుగుతుంది. ప్రతిష్టాత్మకమైన జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య కార్యకలాపాలకు, ప్రదర్శనలకు అతిధ్యం ఇచ్చేందుకు అనువుగా ఉంటుందన్నారు. సందర్శకులు అందరికీ వన్ స్టాప్ ఇన్మర్మేషన్ సెంటర్గా నిలవనుంది. వివిధ కంపెనీల అంతర్జాతీయ సుస్థిర అర్బన్ సోల్యూషన్స్ ప్రచారానికి మూలకేంద్రం అవుతుంది. 2019 అక్టోబర్ చివరి కల్లా ఈ వెల్కమ్ గ్యాలరీ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ వెల్కమ్ గ్యాలరీ సామర్థ్యం రోజుకు 2 వేల నుంచి 3 వేల మంది సందర్శకులు సందర్శించుకునే అవకాశం ఉంది. భవిష్యత్తులో పలు అంతర్జాతీయ ఒప్పందాలకు ఈ వెల్కమ్ గ్యాలరీ గమ్యస్థానం కాబోతుంది. ఈ లక్ష్యంలో భాగంగా అమరావతి డెవలప్ మెంట్ పార్టనర్‌గా గ్యాలరీ ప్రత్యేకత సంతరించుకోనుంది. కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, శాసనసభ్యులు శ్రావణ్‌కుమార్, ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌, ఏపీసిఆర్డిఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, అమరావతి డెవలప్‌మెంట్ ఆధారిటి ఎండి లక్ష్మీపార్ధసారధి, ముఖ్యమంత్రి కార్యదర్శులు సాయిప్రసాద్, రాజమౌళి, గిరిజాశంకర్, రేరా అధ్యక్షులు రమానాథ్, సిఆర్డిఎ అధికారులు, అమరావతి డెవలెప్‌మెంట్ ఆధారిటి అధికారులు, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, డెలిగేట్లు, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు పాల్గొన్నారు.
       

Just In...