Published On: Fri, May 18th, 2018

రాజ్యాంగానికి వ్య‌తిరేకంగా భాజ‌పా ధోర‌ణిని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తాం

* విధానసభ వద్ద కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఆందోళన

సెల్ఐటి న్యూస్‌, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా భాజపా నేత యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ఈ సంద‌ర్భంగా గురువారం ఉద‌యం విధానసభ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట భైటాయించారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు ఈగల్టన్‌ రిసార్ట్స్‌ నుంచి బయటకు వచ్చి విధానసభ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. గులాంనబీ ఆజాద్‌, అశోక్‌ గెహ్లాట్‌, మల్లికార్జున్‌ ఖర్గే, వేణుగోపాల్‌, మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ అధ్య‌క్షుడు ఎన్‌.ర‌ఘువీరారెడ్డి తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు భాజపాను పిలవడాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. అతి పెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయనీయకుండా ఆపలేమని కోర్టు స్పష్టంచేసింది. అయితే కాంగ్రెస్, జేడీఎస్‌ల పిటిషన్‌ను కోర్టు డిస్మిస్‌ చేయకుండా శుక్రవారం ఉదయం మరోవారు వాదనలు వింటామని వెల్లడించింది. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ నేత సిద్ధరామ‌య్య మాట్లాడుతూ రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. తాము ప్రజల్లోకి వెళ్లి భాజపా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎలా ముందుకెళ్తుందో వివరిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 15న వెలువడ్డ ఎన్నికల ఫలితాల్లో భాజపా 104 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ పార్టీ 78, జేడీఎస్‌ 38 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చారు. కానీ గవర్నర్‌ భాజపాను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన సంగతి విధిత‌మె.
 

Just In...