Published On: Wed, Dec 5th, 2018

రాజ‌కీయ నాయ‌కుల విమ‌ర్శ‌లు శృతి మించిపోతున్నాయి

* తాజా రాజకీయాలపై ఉపరాష్ట్రపతి ఆసక్తికర వ్యాఖ్యలు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: తాజా రాజకీయ పరిణామాలపై భార‌త ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో రాజకీయ నాయకుల విమర్శల విషయంలో దిగజారుడుతనం, ముఖ్యంగా ప్రత్యర్థులను ఉద్దేశించి చేస్తున్న ప్రసంగాల్లో స్థాయిని మరచి మాట్లాడడం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్టులో మంగ‌ళ‌వారం ఉద‌యం వివిధ రంగాల ప్రముఖులు, మీడియా ప్రతినిధులతో అల్పాహార సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై తన మనసులోని మాటను ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు వెల్లడించారు. ఆయ‌న మాట్లాడుతూ దేశంతో పాటు రాష్ట్రాల్లోనూ ఈ పరిస్థితి శృతి మించుతోందని, ఇలాంటి వాటి వల్ల ప్రజాస్వామ్యం నవ్వుల పాలయ్యే ప్రమాదం ఉందన్నారు. రాజకీయ నాయకులు స్థాయికి తగిన విధంగా ఉండేలా చూసుకోవడం అవసరమని సూచించారు. అలాంటి విమర్శల వల్ల పార్టీలు, నాయకుల పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. పార్టీలు మార్చే సంస్కృతి కొన్ని రాష్ట్రాల్లో మరింత ఎక్కువ కావడంపై వెంకయ్య ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలు ఫిరాయిస్తే స్పీకర్ వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కఠిన చట్టాలు తేవాలని, అప్పుడే వాటికి అడ్డుకట్ట పడుతుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఇస్తున్న హామీలు, ప్రణాళికల విషయంలో నిబద్ధత, ప్రమాణాలు అవసరమని వ్యాఖ్యానించారు. దేశ, రాష్టాల ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా హామీలిస్తే ఎలాగని ప్రశ్నించారు. హామీలు అమలు కాకపోతే ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉండాలని పేర్కొన్నారు. ఈ సమస్య పట్ల దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఆలోచించాలని కోరారు. ఓట్లు వేసే సమయంలో ధనం, కులం, మతానికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రమాదకరమని, ఇది ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందని అభివర్ణించారు. గుణం, సామర్థ్యం, యోగ్యత, నడతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులపై ఏడాది లోపు సరైన నిర్ణయం దిశగా పూర్తి చేసే ప్రాసిక్యూషన్, న్యాయవ్యవస్థ రావాలన్నారు. అప్పుడే రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కావడంతో పాటు, ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. నల్లధన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే విషయంలో త్వరితగతిన అన్ని దేశాలు ఒకే అభిప్రాయానికి రావాలన్నారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకోవాలని వెంక‌య్య‌నాయుడు సూచించారు.

Just In...