Published On: Thu, May 21st, 2020

రాయితీలపై ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) వివిధ వర్గాల వారికి కల్పిస్తున్న రాయితీ అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులు, పాత్రికేయులు సహా వివిధ వర్గాలకు అందిస్తున్న రాయితీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. దాదాపు రెండు నెలల లాక్‌డౌన్‌ తర్వాత ఏపీలో గురువారం నుంచి ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు ఇప్పటికే ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా భౌతిక దూరం పాటించాల్సిన నేపథ్యంలో బస్సుల్లో సీట్ల సంఖ్యను ఆర్టీసీ కుదించింది. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ సహా ఏసీ సర్వీసుల్లో సీట్లను తగ్గించింది. దీంతో ఆర్థికంగా సంస్థకు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నందున వివిధ వర్గాలకు అందిస్తున్న రాయితీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వివరించింది.

Just In...