Published On: Thu, Mar 19th, 2020

రాష్ట్రంలో ఇప్పటివరకు రెండు కరోనా కేసులు మాత్రమే నమోదు

* సాధారణ వ్యక్తులు మాస్కులు వేసుకోవాల్సిన అవసరం లేదు

* 60 ఏళ్ళు పైబడినవారిపై కరోనా ప్రభావం

* ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి డా.పీవీ రమేష్‌

* అనుకోని పరిణామాలు ఎదురైతే ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధం

* ముందస్తు జాగ్రత్తలు, చర్యలు వల్ల ఏపీలో అతి తక్కువ కేసులు నమోదు

* సీఎంవో ప్రత్యేక అధికారి ఎం.హరికృష్ణ

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: కరోనా వ్యాప్తి నివారణపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి డా.పీవీ రమేష్‌ తెలిపారు. వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో సీఎంవో ప్రత్యేక అధికారి డాక్టర్‌ ఎం.హరికృష్ణతో కలిసి డా. పీవీ రమేష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా  కరోనా వైరస్ వ్యాధి గురించి ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కరోనా వ్యాధిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, కేంద్ర ప్రభుత్వం సూచనలను పాటించేదిశగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. కరోనా విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందస్తు చర్యలు తీసుకుందన్నారు. ఫిబ్రవరిలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి రూ.408 కోట్లు విడుదల చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మందుల కొనుగోలు, పరికరాలకు సంబంధించిన బకాయిలను ముందుగానే చెల్లించారని తెలిపారు. కరోనా వ్యాధి విషయంలో దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులను హోం ఐసోలేషన్ లో పెట్టిందని గుర్తుచేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రెండు కరోనా నిర్ధారిత కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు.  ప్రపంచవ్యాప్తంగా 164 దేశాల్లో 2 లక్షల మందికి కరోనా సోకిందని అందులో 2 వేల మంది మరణించారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో పదేళ్లలోపు వయసువారిపై దీని ప్రభావం లేదని తేలిందన్నారు. రక్త నమూనాలు పుణెకు పంపకుండా మన రాష్ట్రంలోనే ఏర్పాట్లు చేశామన్నారు. గత 15 రోజుల్లో రాష్ట్రంలో తిరుపతి, విజయవాడలో లేబోరెటరీలు ఏర్పాటు చేశామని కాకినాడలో లేబోరేటరీ ఏర్పాటుకు సిద్ధంగా ఉందన్నారు. అదే విధంగా అనంతపురం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లోనూ లేబోరేటరీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్రాన్ని కోరామని వెల్లడించారు. జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో అవసరమైన సామాగ్రిని సిద్ధంగా ఉంచామన్నారు. సాధారణ వ్యక్తులు మాస్క్ లు వాడాల్సిన అవసరం లేదన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు, వారికి దగ్గరగా ఉండేవారు, సంబంధీకులు తదితరులు మాత్రమే మాస్క్ లు వాడితే సరిపోతుందన్నారు. ఒకవేళ మాస్క్ లు వాడితే ఐదు గంటలకు మించి వాడరాదని, వాడిన అనంతరం దాన్ని పాతిపెట్టడం కానీ లేదా కాల్చివేయడం కాని చేయాలన్నారు. కరోనా కొత్త రకం వైరస్ అని ఉష్ణోగ్రత అధికంగా ఉన్న ప్రాంతాల వారికీ ఈ వ్యాధి సోకదనే అపోహను వీడాలన్నారు. అదే విధంగా అల్లం, వెల్లులి, మిరియాలు అధికంగా వాడటం వల్ల, గోమూత్రం సేవించడం వల్ల సోకకుండా ఉంటుందని వస్తున్న వదంతులను నమ్మొద్దన్నారు. ఉదాహరణకు ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి ప్రాంతాల్లో కరోనా వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కరోనా వైరస్ వయసు పై బడిన వారికి, మధుమోహం, బీపీ, షుగర్, అస్తమా, కిడ్నీ సమస్యలు తదితర వ్యాధిగ్రస్తులకు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, 10 సంవత్సరాల్లోపు వయసున్న వారికి కరోనా వ్యాప్తి ప్రభావం అంతగా ఉండదని స్పష్టం చేశారు. కరోనా వైరస్ 5 గంటల నుండి 3 రోజుల వరకు బతికే అవకాశముంటుందన్నారు. కరోనా అనుమానితులకు దగ్గరగా ఉంటే త్వరగా వ్యాప్తి చెందుతుందన్నారు. దగ్గినా, తుమ్మినా కరోనా సోకే ప్రమాదముందన్నారు.  ముక్కు, నోటి ద్వారా తొందరగా శరీరంలోకి కరోనా ప్రవేశించే అవకాశముండటంతో చేతులు శుభ్రంగా కడుక్కుంటే మంచిదని సూచించారు. జనసమూహ ప్రాంతాలైన షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, మార్కెట్లు, జాతర లాంటి ప్రదేశాలకు వెళ్లవద్దని, తగ్గించుకుంటే మంచిదని తెలిపారు. ప్రయాణాలు కూడా అత్యవసరమైతే తప్ప చేయకూడదన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారెవరైనా ఉంటే సంబంధిత సమాచారాన్ని అందించాలని కోరారు.   చెన్నై, బెంగుళూరు, ముంబయి, న్యూఢిల్లీ, హైదరాబాద్ తదితర ఎయిర్ పోర్టుల నుండి వచ్చే రాష్ట్రానికి వచ్చిన వారి వివరాలను బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ నుండి  సేకరిస్తున్నామన్నారు. అదే విధంగా గ్రామ వలంటీర్లు, ఏఎన్ ఎంలు, ఆశా వర్కర్లు, పీహెచ్ సీ సిబ్బందితో సర్వే చేయిస్తున్నామన్నారు. ఇప్పటివరకు  కోటి  35 లక్షల ఇళ్లను వెరిఫై చేసి 12,500 మంది విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చినట్లు గుర్తించామన్నారు. వారందరనీ హోం ఐసోలేషన్ లో ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచామన్నారు. కరోనా విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుని విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందన్నారు. 102 కంటే ఎక్కువ జ్వరం, గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్ళాలని సూచించారు. కరోనాకు సంబంధించి ఏమైనా అనుమానాలుంటే 104కు ఫోన్ చేస్తే ప్రభుత్వాధికారులే అంబులెన్స్ ల ద్వారా ఆస్పత్రులకు చేరుస్తారని వివరించారు. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు సెలవులు ప్రకటించడంతో పాటు హాస్టల్ ల్లో ఉన్న విద్యార్థులను వైద్యశాఖ, ఆర్టీసీ అధికారులతో మాట్లాడి వారి ఇళ్లకు పంపించేస్తున్నామన్నారు. సెలవు రోజుల్లో ఇంట్లోనే గడపాలని తెలిపారు. సోషల్ డిస్టెన్స్ పాటించడం మంచిదన్నారు. పాఠశాలలు ముందు మూయడం వల్ల ఈ విద్యాసంవత్సరం త్వరగా తెరిచే అవకాశం ఉంటుందన్నారు.
సీఎంవో ప్రత్యేక అధికారి డా.ముక్తాపురం హరికృష్ణ మాట్లాడుతూ కరోనా విషయంలో దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సునిశిత దృష్టితో ముందస్తు చర్యలు తీసుకున్నారన్నారు. ప్రపంచ దేశాలన్నీ కరోనా గురించి ఆలోచిస్తున్నాయని, చాలా దేశాల్లో, రాష్ట్రాల్లో కొంత భయానక పరిస్ధితులు నెలకొన్నాయన్నారు.  నెల రోజుల ముందే కరోనాపై సీఎం అధికారులతో అంతర్గతంగా సమావేశం ఏర్పాటుచేసి ముందస్తు చర్యలపై చర్చించారన్నారు. గ్రామ వలంటీర్లతో ప్రతీ ఇంటిని స్క్రీనింగ్‌ చేసి ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించే పరిస్ధితి కేవలం ఒక్క ఏపీలోనే ఉందని తెలిపారు ఎక్కువ హడావిడి, పబ్లిసిటీ చేయడం వల్ల ప్రజల్లో భయాందోళనలు పెరుగుతాయని గ్రహించిన ముఖ్యమంత్రి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అధికారులకు, నాయకులకు సూచించారన్నారు. అనుకోని పరిణామాలు ఎదురైతే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారన్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ప్రయత్నలోపం ఉండొద్దన్నారు. ముందస్తు జాగ్రత్తలు, చర్యలు తీసుకోవడం ద్వారా దేశంలో అతి తక్కువ కేసులు నమోదయింది ఏపీలోనే అని వివరించారు. మీడియా సామాజిక బాధ్యతతో ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించడమేగాక, సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయాలని కోరారు. కరోనా వ్యాధి సోకిన వారిలో 80 శాతం మందికి పైగా దాదాపు ఎలాంటి పెద్ద లక్షణాలు ఉండవని, మిగిలిన 20 శాతంలో దగ్గు, ఆయాసం, ఎక్కువ జ్వరం వచ్చిన వారు ఉంటారని వారు మాత్రమే ఇంటెన్సివ్‌ కేర్‌ తీసుకోవాల్సి ఉంటుదన్నారు. మరణాల శాతం తక్కువేనన్నారు.

Just In...