Published On: Sat, Nov 9th, 2019

రాష్ట్రంలో తగ్గుతున్న వరదనీరు.. గణనీయంగా పెరిగిన ఇసుక సరఫరా

* వారం వ్య‌వ‌ధిలోనే మూడు రెట్లు అధికం

సెల్ఐటి న్యూస్‌, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నదుల్లో వరదనీటి ప్రవాహాలు తగ్గుముఖం పడ్డంతో ఇసుక లభ్యత రోజు, రోజుకూ గణనీయంగా పెరుగుతోంది. వారం రోజుల వ్యవధిలోనే ఇసుక సరఫరా మూడు రెట్లు పెరిగింది. నవంబరు 1 నాటికి 31,576 టన్నుల ఇసుక సరఫరా కాగా, నవంబరు 7న 86,482 టన్నుల ఇసుక సరఫరా అయింది. అది మరింత పెరిగి ఇవాల్టికి(నవంబరు8 నాటికి) ఇసుక సరఫరా 96 వేల టన్నులకు చేరింది. ఇసుక సరఫరాలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా, పారదర్శకంగా వినియోగదారులకు చేరవేసేలా ప్రభుత్వం నూతన శాండ్‌ మైనింగ్‌ పాలసీ–2019 అమల్లోకి తీసుకొచ్చింది. దాని అమలు కోసం ఇప్పటికే ప్రభుత్వం పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంది. మరో వైపు సరఫరా పెరగడంతో ఇసుక అవసరాలు తీరుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 187 లక్షల టన్నుల ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నట్లు గుర్తించింది. వాస్తవానికి గత కొద్ది రోజులగా కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్ద నదుల్లో వరద ప్రవాహాలు అధికంగా ఉండటం వల్ల ఇసుక తవ్వకాలను దెబ్బతీసింది. ప్రస్తుతం వరద నీటి ప్రవాహాలు తగ్గుముఖం పట్టడం వల్ల ఇసుక లభ్యత పెరిగిందని, గడిచిన నాలుగు రోజుల్లో 3 లక్షల టన్నులకు పై చిలుకు ఇసుక లభ్యతలోకి వచ్చిందని తెలిపారు. వారం రోజుల వ్యవధిలోనే మూడు రెట్లు ఇసుక సరఫరా పెరిగిందన్నారు. నవంబరు 1 న 31,576 టన్నుల సరఫరా కాగా,
నవంబరు 7 న 86,482 టన్నులకు పెరిగిన ఇసుక సరఫరా నవంబరు 8వ తేదీ నాటికి 96 వేల టన్నుల సరఫరాకు చేరుకుంది. రానున్న రోజుల్లో మొదటి ఆర్డర్, రెండో ఆర్డర్, మూడో ఆర్డర్‌ వరుస స్ట్రీమ్స్‌లో 300 పైగా రీచ్‌లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నదుల్లో నీటిమట్టం తగ్గుముఖం పడుతున్న కొద్ది మరిన్ని ఎక్కువ రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు. తద్వారా పూర్తి స్ధాయిలో అవసరాలు తీర్చగలుగుతామన్నారు.

Just In...