Published On: Wed, Aug 7th, 2019

రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గించేలా కృషి చేయాలి

* బాల్య వివాహాలు, మహిళలపై వేధింపులు, యాసిడ్ దాడులు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి

* క్షేత్రస్థాయిలో వేధింపులను ఉపేక్షించబోం

* రాష్ట్ర  స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత

సెల్ఐటి న్యూస్, అమరావతి: క్షేత్రస్థాయిలో అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు నిర్వహించి,  అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సి ఉందని రాష్ట్ర  స్త్రీ శిశు సంక్షేమ శాఖ  మంత్రి తానేటి వనిత తెలిపారు. మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో  బుధవారం వెలగపూడి సచివాలయంలోని 5వ బ్లాక్ లో రాష్ట్ర స్థాయి  స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ అధికారులు విధుల్లో నిర్లిప్తత విడనాడి  అందివచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. సమిష్టిగా అందరం కలిసి పని చేస్తే ఫలితాలు సాధించగలుగుతామని తెలిపారు.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి రహిత సమాజం కోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. అందుకనుగుణంగా స్నేహ పూర్వక విధానంలో క్షేత్రస్థాయిలో పనితీరు చూపాలని వెల్లడించారు. మనది అనే భావన ఉంటే ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లగలుగుతామని తెలిపారు. క్షేత్రస్థాయిలో అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు నిర్వహించాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సి ఉందన్నారు. స్త్రీ, శిశు సంక్షేమం కోసం పనిచేసే శాఖ తమదని బాద్యతలను గుర్తు చేశారు. శాఖ పరిధిలో కొంతమంది సిబ్బందిని, క్షేత్రస్థాయిలోని వారిని వేధింపులకు గురి చేస్తున్నారన్న అంశం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇటువంటి వాటిని ఉపేక్షించబోమని మంత్రి తెలిపారు. శాఖ పరిధిలోని సంబంధిత శాఖలతో  ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని తెలిపారు.
పౌష్టికాహారం యొక్క ఆవశ్యకతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్ళాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత సూచించారు. ఇందుకు సంబంధించిన ప్రచార సామగ్రిని వారికి చేర్చి అవగాహన పెంచే బాధ్యత చేపట్టాలని ఆదేశించారు. ఉద్యోగుల పనితీరు మెరుగు పర్చుకోవాలని, పనితీరులో నిర్లిప్తంగా వ్యవహరిస్తే సహించబోమని మంత్రి హెచ్చరించారు. పనితీరు పలువురికి ఆదర్శంగా ఉండాలని తెలిపారు. సమాజంలో మనవంతు బాధ్యత ను సమర్థవంతంగా నిర్వహించి పలువురికి మార్గదర్శకంగా నిలవాలని పిలుపునిచ్చారు. పౌష్టికాహారం పంపిణీ తో బాధ్యత పూర్తి కాదని, మౌలిక సదుపాయాలపై కూడా దృష్టి పెట్టాలన్నారు. మౌలిక సదుపాయాలు, తదితర అంశాలపై సంబంధించిన శాఖల అధికారులకు తెలియజేయడంతో పాటు జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యను సత్వరమే పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గించేలా కృషి చేపట్టాలని తెలిపారు.  బాల్య వివాహాలు, మహిళలపై వేధింపులు, యాసిడ్ దాడులు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయడంతో పాటు  తదనంతరం సంబంధిత అధికారుల తో ఎప్పటికప్పుడు పరిస్థితి ని అధ్యయనం చేయాల్సి ఉంటుందన్నారు.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన అమ్మఒడి పథకం ఒక చరిత్రాత్మక మైన పథకమని మంత్రి కొనియాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువమంది చేరటం గుర్తించామని తెలిపారు. మహిళలు వారికి అప్పగించిన పనిని నిబద్ధతతో బాధ్యత తో నిర్వహిస్తారని శ్రీమతి తానేటి వనిత కితాబిచ్చారు.  లోటుపాట్లను ఏవిధంగా అధిగమించగలమో అధ్యయనం చేసి, వాటికి పరిష్కారం చూపే బాధ్యత మీదేనని మంత్రి   తానేటి వనిత చెప్పారు. పాలు, గుడ్డు, ఇతర పౌష్టికాహారం ప్రతి ఒక్కరికి అందించే బాధ్యత సమర్ధవంతంగా చేపట్టాలని సూచించారు. వేల కోట్ల ఖర్చుతో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని, వాటిని క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు చేర్చే బాధ్యత మనదేనని అధికారులకు సూచించారు. సమీక్షా సమావేశంలో భాగంగా గత సమావేశంలో చర్చించిన అంశాలపై, ప్రగతి నివేదికలపై జిల్లాల ప్రగతి సమీక్షించారు. ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కిట్స్, బడ్జెట్ వినియోగంపై, అనుబంధ పౌష్టికాహార పథకం, పోషన్ అభియాన్, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, వన్ స్టాప్ కేంద్రాలు భవనాల నిర్మాణం, సిబ్బంది, సేవాలపై , బేటీ బచావో బేటి పడావో కార్యాచరణ ప్రణాళిక అమలుపై సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో ముఖ్య కార్యదర్శి కె.దమయంతి, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కృత్తికా శుక్లా, పథక సంచాలకులు, సహాయ పథక సంచాలకులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా క్షేత్రస్థాయి కార్యకర్తల కోసం రూపొందించిన కరదీపికను మంత్రి విడుదల చేశారు.

Just In...