Published On: Tue, Dec 4th, 2018

రాష్ట్రాభివృద్ధిలో కీలక భాగస్వామ్యం కేంద్రానిదే

* కేంద్ర మంత్రి సురేష్ ప్ర‌భు 

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం కేంద్రానిదే అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. ఆర్టీసీ కాలనీ వద్ద ఏర్పాటుచేసిన భారతీయ జనతా పార్టీ విజయవాడ పార్లమెంటరీ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు, భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మంగ‌ళ‌వారం ప్రారంభించారు. ఇంటింటికి భాజపా కార్యక్రమం కరపత్రం, భాజపా అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుకు రాసిన 100 ప్రశ్నల పుస్తకాన్ని సురేష్ ప్రభు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ ప్రభు మాట్లాడుతూ 2014 నుంచి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశం గణనీయమైన అభివృద్ది చెందిందన్నారు. మౌలికసదుపాయాలు, సంక్షేమంతో అన్ని రంగాలు పురోగతి సాధిస్తున్నాయన్నారు. పేదల అభివృద్ది కోసం అనేక పధకాలను మోడి అమలు చేస్తున్నారన్నారు. మోదీ సారధ్యంలో జరిగిన అభివృద్ధి గతంలో ఎవరూ చేయలేదన్నారు. అమరావతి, రాజధాని నిర్మాణం భాజపాతోనే సాధ్యమన్నారు. మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, యూనివర్సిటీలను ఎపి లో ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి నిరంతరం నిధుల విడుదుల జరుగుతూనే ఉంటుందన్నారు. మోదీ సారధ్యంలో కేంద్రం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పధకాలను తెదేపా తన గొప్పగా చెప్పుకుందని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సమయం వచ్చినపుడు వారి సత్తా చూపుతారు. ప్రజలు, దేవుడు బిజేపి పక్షానే ఉన్నారని, 2019లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన ఆర్ధిక సహాయం, కేటాయించిన పథకాలు, ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలకు తెలియచేసేందుకు ‘ఇంటింటికి భాజపా’ కార్యక్రమం డిసెంబరు 1 నుంచి 16 వరకు నిర్వహిస్తున్నామన్నారు. డిసెంబరు 1న పలాసలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. మోదీ ప్రధాని అయ్యాక రాష్ట్రాభివృద్ధికి, పేదల సంక్షేమానికి కొన్ని లక్షల కోట్లు నిధిలిస్తే వాటిని తెదేపా ప్రభుత్వం దిగమింగిందని వ్యాఖ్యానించారు. చట్టంలో పేర్కొన్న సంస్థలను 10 ఏళ్ల కాలంలో ఏర్పాటు చేయాల్సి ఉన్నా నాలుగున్నరేళ్లలో 85 శాతం పనులు పూర్తిచేయడం జరిగిందన్నారు. తెదేపా భాజపాతో విడిపోయినా రాష్ట్రాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటూ ఇటీవలే సెంట్రల్ విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం మంజూరుచేయడం జరిగిందన్నారు. ఇఏపీ ప్రాజెక్టుల కింద రూ.25 వేల కోట్లు విలువైన ప్రాజెక్టులు రాష్ట్రానికి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించిన ఆర్ధిక సహాయం, కేటాయించిన ప్రాజెక్టుల వివరాలను తెలియచేసేందుకు ఇంటింటికి భాజపా కార్యక్రమం చేపట్టామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ఆర్ధిక సహాయాన్ని, రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రజలకు వివరించి తెదేపా ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. అనంతరం స్థానికులకు కరపత్రాలు అందించి ప్రచారం ప్రారంభించారు. కార్యక్రమంలో న‌ర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు తురగా నాగభూషణం, విజయవాడ పార్లమెంటు కన్వీనర్ కిలారు దిలీప్, మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి షేక్ బాజి, భాజపా జిల్లా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, నగర అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, భాజపా రాష్ట్ర కోశాధికారి పి.సన్యాసిరాజు, కార్యదర్శులు అడపా శివనాగేంద్ర, ఆర్డి విల్సన్, అధికార ప్రతినిధి, కోవూరి వెంకట్, మీడియా కన్వీనర్ వి.గంగాధర్, వివిధ మోర్చాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
 

Just In...