Published On: Tue, Jun 12th, 2018

రాష్ట్ర‌వ్యాప్తంగా బ‌డిపిలుస్తోంది- విద్యా వారోత్స‌వాలు

* మంత్రి గంటా శ్రీనివాస‌రావు వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల స‌మ‌గ్రాభివృద్ధే ల‌క్ష్యంగా బ‌డిపిలుస్తోంది- విద్యా వారోత్స‌వాల‌ను మంగ‌ళ‌వారం నిర్వ‌హిస్తున్నామ‌ని, ఈ కార్యక్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రూ పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని రాష్ట్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు పిలుపునిచ్చారు. పాఠ‌శాల‌ల అభివృధ్ధిని కాంక్షిస్తూ ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా విద్యా సంక‌ల్పం- ప్ర‌తిజ్ఞ చేయాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ నెల 12 నుంచి 20 వ‌ర‌కు బ‌డి పిలుస్తోంది కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆయ‌న సోమ‌వారం ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. పూర్వ విద్యార్థులు, దాత‌లు, గ్రామ పెద్ద‌లు, స్కూల్ మేనేజ్ మెంట్ క‌మిటీలు, స్వ‌యం స‌హాయ‌క బృందాలు, యువ‌త ఇలా అంద‌రూ ఈ మ‌హ‌త్త‌ర కార‌క్ర‌మంలో పాలుపంచుకొంటార‌ని ఆయ‌న‌ తెలిపారు. కార్య‌క్ర‌మంలో భాగంగా 10 వ త‌ర‌గ‌తిలో ఉత్త‌మ ఫ‌లితాలు సాధించిన విద్యార్థుల ఫోటోలు, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌కు క‌ల్సిస్తున్న సౌక‌ర్యాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తామ‌న్నారు. వీటికి సంబంధించి పోస్ట‌ర్లు, బ్యాన‌ర్లు ప్ర‌ద‌ర్శిస్తామ‌న్నారు. తొలి రోజున అంద‌రి భాగ‌స్వామ్యంతో విద్యా సంక‌ల్పం -ప్ర‌తిజ్ఞ తోపాటు పిల్ల‌లు వేస‌వి శెల‌వుల్లో గ‌డిపిన అంశాల‌పై చ‌ర్చ వుంటుంద‌న్నారు. రెండో రోజు సంబ‌రం కార్య‌క్ర‌మం వుంటుంద‌ని, ఇందులో భాగంగా పిల్ల‌ల‌తో బొమ్మ‌లు గీయించ‌డం, పూల‌గుత్తులు, బ్యాడ్జీలు త‌యారు చేయించ‌డం,  ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు మాట్లాడించ‌డం, ప్ర‌యోగ‌శాల‌ల ప‌రిక‌రాల ప్ర‌ద‌ర్శ‌న‌, మ‌ధ్య‌లో బ‌డిమానేసిన పిల్ల‌ల వివ‌రాల‌ను ప్ర‌ద‌ర్శించి వారి ఇళ్ల‌కు వెళ్లి, వారు పాఠ‌శాల‌ల‌కు హాజ‌ర‌య్యేలా త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడే కార్య‌క్ర‌మాలు వుంటాయ‌ని మంత్రి గంటా వివ‌రించారు. మూడో రోజు అక్ష‌రం కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తామ‌ని, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, ఎమ్.ఎన్.సి స‌భ్యులు, త‌ల్లిదండ్రుల భాగ‌స్వామ్యంతో ఘ‌నంగా సామూహిక అక్ష‌రాభ్యాస కార్య‌క్ర‌మం వుంటుంద‌ని మంత్రి గంటా శ్రీనివాస‌రావు తెలిపారు. చ‌దువు ప్రాధాన్య‌త‌, నోటు పుస్త‌కాలు, పెన్నులు, పాఠ్య పుస్త‌కాల పంపిణీ వుంటుంద‌ని, వీటికి దాతల స‌హ‌కారం కూడా తీసుకోవ‌చ్చ‌న్నారు. శుక్ర‌వారం అంటే నాలుగో రోజున అభిన‌యం కార్య‌క్ర‌మం వుంటుంద‌ని, అభిన‌య గేయాలు, పాటలు పాడించ‌డం, క‌థ‌లు చెప్పడం లాంటివి ఇందులో భాగంగా వుంటాయ‌ని వివ‌రించారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించ‌డ‌మే ధ్యేయంగా, పిల్ల‌ల్లో ప‌ర్యావర‌ణంపై అవ‌గాహ‌న పెంచ‌డ‌మే ల‌క్ష్యంగా నంద‌నం కార్య‌క్ర‌మం సోమ‌వారం వుంటుంద‌న్నారు. నా ఊరు – నాచెట్టు, ప్ర‌కృతి ప్రార్థ‌న ఇందులో భాగంగా వుంటాయ‌న్నారు. 16న రంజాన్ సంద‌ర్భంగా శెల‌వు వుంటుంద‌ని, అదే విధంగా 17న ఆదివారం నేప‌ధ్యంలో ఆ రెండు రోజులు శెల‌వులు వుంటాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 19న వంద‌నం కార‌క్ర‌మం వుంటుంద‌ని, అదే విధంగా 20న అభినంద‌నం కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తామ‌న్నారు. 10వ త‌ర‌గ‌తిలో ఉత్త‌మ ఫ‌లితాల‌ను సాదించిన విద్యార్థుల‌ను స‌త్క‌రించ‌డ‌మే అభినంద‌న కార్య‌క్ర‌మ ఉద్దేశ‌మ‌ని మంత్రి గంటా స్ప‌ష్టం చేశారు. త‌ల్లిదండ్రుల‌ స‌మావేశం, బాల‌స‌భ చివ‌రి రోజైన 20న వుంటాయ‌న్నారు. చ‌దువుల ప‌ట్ల విద్యార్థుల్లో ఆస‌క్తి పెంచేందుకు బ‌డి పిలుస్తోంది బాగా దోహ‌ద‌ప‌డుతుంద‌ని మంత్రి గంటా తెలిపారు.

Just In...