Published On: Tue, Oct 16th, 2018

రాష్ట్ర పునర్విభజన చట్టం అమలుకు కేంద్రం సిద్ధం

* అందుకే చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారు‌

* గుంటూరులో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్య

సెల్ఐటి న్యూస్‌, గుంటూరు: రాష్ట్ర పునర్విభజన చట్టం అమలుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మరింత కృషిచేస్తున్నట్టు చెప్పారు. మంగళవారం ఆయన గుంటూరు ఇన్నర్‌ రింగ్‌రోడ్డు వద్ద భాజపా రాష్ట్ర కార్యాలయ భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడారు. రాజకీయ అవసరాల కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదా పేరుతో యూటర్న్‌ తీసుకున్నారని విమర్శించారు. విజయవాడ అభివృద్ధికి రూ.1000 కోట్లు, అమరావతి నిర్మాణానికి రూ.1500 కోట్లు ఇచ్చామని రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలను రాజ్‌నాథ్ వివ‌రించారు. పోలవరం నిర్మాణానికి నూటికి నూరు శాతం నిధులు ఇస్తున్నట్టు స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎనిమిది బెటాలియన్లు మంజూరు చేశామని, అదీ రాష్ట్ర అభివృద్ధి పట్ల తమ నిబద్ధత అన్నారు. భాజపా దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. భాజపాకు ఉన్న కార్యకర్తలు దేశంలో ఏ పార్టీకీ ఉండరన్నారు. దేశంలో మూడింట రెండొంతుల భూభాగంపై తమ పార్టీ అధికారంలో ఉందని చెప్పారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా 2014లో భాజపా పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంకల్పాలు తీసుకున్నామని, కూటమి మిత్ర ధర్మం పాటించేందుకు భాజపా పూర్తిస్థాయిలో కృషి చేసిందన్నారు.
దేశంలో కాంగ్రెసేతర పార్టీలతో కూటమిగా ఏర్పడి సుపరిపాలన అందించేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. గతంలో కూటమి ప్రభుత్వాలు సరిగ్గా నడవలేకపోయాయని.. అయితే అది తెలుగుబిడ్డ పీవీ నరసింహారావుకు మాత్రమే సాధ్యమైందన్నారు. పీవీ దేశ స్థితిగతుల్లో మార్పు కోసం ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. నెహ్రూ కుటుంబం కాక ఇతర ప్రధానులను కాంగ్రెస్‌ పట్టించుకోలేదన్నారు.

Just In...