Published On: Thu, Feb 13th, 2020

రాష్ట్ర మంత్రిమండలి సమావేశ నిర్ణయాలు…

* పంచాయితీరాజ్ చట్టం, మున్సిపల్ చట్టాల్లో సవరణకు కేబినెట్ ఆమోదం

* ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఏర్పాటుకు

* ఆంధ్రప్రదేశ్ స్టేట్ వ్యవసాయ కౌన్సిల్ ఏర్పాటు

* ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు

* భూసేకరణలో పండ్లతోటలకు ఇచ్చే పరిహారం 5శాతం పెంచేందుకు

* కడప జిల్లా వేంపల్లిలో నూతన అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు

*  రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ చట్టంలో సవరణకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) వెల్లడించారు.బుధవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశ వివరాలను ఆయన సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో మీడియాకు వివరిస్తూ పంచాయితీ,మున్సిపల్ ఎన్నికల్లో అవినీతి చర్యలకు పాల్పడ్డారని రుజువైతే అలాంటి వ్యక్తులపై అనర్హత వేటుతోపాటు మూడేళ్లు జైలు శిక్ష విధించేందుకు వీలుగా పంచాయితీరాజ్ చట్టంలో సవరణలు చేసేందుకు మంత్రి మండలి నిర్ణయించిందని చెప్పారు. ఎన్నికలు పూర్తయి అభ్యర్ది గెలిచినా అవినీతికి పాల్పడ్డారని ఆధారాలు రుజువైతే అలాంటి వారిపై అనర్హతవేటు పడుతుందని స్పష్టం చేశారు.ఎన్నికల ప్రక్రియ ఎక్కువ కాలం ఉంటే అధిక ధన,మద్య ప్రవాహానికి ఆస్కారం ఉంటుందని ఆపరిస్థితి లేకుండా చేసేందుకు ఎన్నికల కాలపరిమితిని 13 రోజులకు కుదించాలని మంత్రిమండలిలో తీర్మానించినట్టు తెలిపారు.అదే విధంగా పూర్తిగా గిరిజన జనాభా ఉన్న ప్రాంతాల్లో జడ్పిటిసి,ఎంపిపి,సర్పంచ్ పదవులను పూర్తిగా ఆ వర్గాల వారికే కేటాయించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. పచ్చదనం,పారిశుద్ధ్యాన్ని పెంపొందించే బాధ్యతలను సర్పంచ్ లకే అప్పగించాలని నిర్ణయం తీసుకోవడంతోపాటు ఎన్నికైన సర్పంచ్లు స్థానికంగానే నివాసం ఉండాలని తీర్మానించినట్టు మంత్రి నాని చెప్పారు.అంతేగాక ప్రకృతి వైపర్యీత్యాలు సంభవించినపుడు తాగునీరు, ఇతర సమస్యలు ఏర్పడినపుడు ఆలాంటి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు వీలుగా అత్యవసర నిర్ణయాలు తీసుకునే అధికారాన్నికూడా సర్పంచ్ లకు కల్పించి ఆతదుపరి పంచాయితీ సమావేశాల్లో వాటి ఆమోదం పొందే వెసులుబాటును కల్పించేందుకు నిర్ణయించినట్టు పేర్కొన్నారు.

మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టలో సవరణలకు కేబినెట్‌ ఆమోదం…
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గతంలో ఉన్న24రోజుల కాలపరిమితిని 15రోజులకు తగ్గిస్తూ తీసుకున్ననిర్ణయానికి అనుగుణంగా మున్సిపల్ చట్ట సవరణకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని మంత్రి పేర్నినాని వెల్లడించారు. పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన నియమనిబంధనలన్నీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులకూ వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ వ్యవసాయ కౌన్సిల్ ఏర్పాటు…
రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యానవన రంగాల్లో ఉత్తమ పద్ధతులకు మరింత తోడ్పాటును అందించడంతో పాటు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్, ఎగుమతుల ప్రోత్సాహం వంటి విధానాల రెగ్యులేటింగ్ మెకానిజంగా ఈ కౌన్సిల్ పనిచేయనుందని మంత్రి పేర్నినాని పేర్కొన్నారు. అంతేగాక వ్యవసాయ,ఉద్యానవన విద్యపై నియంత్రణ, పర్యవేక్షణ, ప్రభుత్వ రంగ సంస్థలు, అనుబంధ సంస్థలకు పబ్లిక్, ప్రవేట్ విభాగాల్లో పనితీరు మెరుగుపర్చేందుకు ఈకౌన్సిల్ తోడ్పాటును అందించనుందన్నారు.వ్యవసాయ,ఉద్యానవన విద్యా సంస్థలను పర్యవేక్షించడం తోపాటు తగిన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టి కౌన్సిల్ నియమ నిబంధనలు పాటించే కళాశాలలకు గుర్తింపును ఇవ్వనుందని చెప్పారు.నకిలీ సర్టిఫికెట్ల నిరోధానికి ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వనుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు…
రాష్ట్రంలో ఎపి జెన్ కోకు అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసేందుకు మంత్రి మండలి నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు.ప్రస్తుతం రైతులకు పగటిపూట 9గం.ల ఉచిత విద్యుత్ ను అందించడం జరుగుతోందని తద్వారా ఏటా ప్రభుత్వంపై 10వేల కోట్ల రూ.లు భారం పడుతోందని చెప్పారు. ఏటా సుమారు 50 వేల కొత్త వ్యవసాయ పంపుసెట్లు ఏర్పాటు అవుతున్నాయని ఏటా 45వేల మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటోందని అన్నారు.రానున్న రోజుల్లో నాణ్యమైన ఉచిత విద్యుత్ ను,ఆక్వా రైతులకు సబ్సిడీపై నిరంతరం విద్యుత్ ను అందించించేందుకు ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా 10వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పేందుకు ప్రణాళిక సిద్దం చేయగా దాని ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదించిందని తెలిపారు.సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మెగావాట్ కు 20లక్షల రూ.లు వంతున కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తున్న నేపధ్యంలో ఆవెసులుబాటును వినియోగించు కోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.ఈ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ కు సియండి సహా మరో 18పోస్టులు మంజూరుకు మంత్రిమండలి ఆమోదించినట్టు పేర్కొన్నారు.

భూసేకరణలో పండ్లు,పూల తోటలకు ఇచ్చే పరిహారం 5శాతం పెంచేందుకు నిర్ణయం..
రాష్ట్రంలో భూసేకరణతోపాటు పెరుగుతున్న ఖర్చులు,నష్టం వాటిల్లిన పరిస్థితుల్లో పండ్ల తోటలకు ఇచ్చే పరిహారాన్ని 5 శాతం పెంచేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందని మంత్రి పేర్ని వెంకట్రామయ్య వెల్లడించారు. దానివల్ల మామిడి, కొబ్బరి, నిమ్మ తదితర పంటలకు ఇచ్చే పరిహారం పెరుగుతుందని తెలిపారు. దీనిలో భాగంగా  గతంలో రూ.2600 మాత్రమే ఉన్న మామిడి పరిహారం రూ.7283లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం  తీసుకుంది. కొబ్బరి చెట్టుకు రూ. 6090 పరిహారం పెంపు. గతంలో ఈ మొత్తం కేవలం  రూ.2149 గా ఉండేది. నిమ్మపంటకు రూ.3210 పెంచుతూ కేబినెట్ నిర్ణయించింది. గతంలో ఈ పరిహారం కేవలం రూ.1444 మాత్రమే ఉండేది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు పెరుగుతున్న ఖర్చులతో పాటు నష్టం వాటిల్లిన పరిస్ధితుల్లో పండ్లతోటలకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలన్న నిర్ణయానికి కేబినెట్‌  ఆమోదముద్ర వేసింది.

ఆంధ్రప్రదేశ్  స్టేట్ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిడెట్ (ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌) ఏర్పాటుకు నిర్ణయం…
రాష్ట్రంలో మిగులు నిధులను సక్రమంగా వినియోగించుకునేందుకు ఎపి స్టేట్ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ గా దీనిని ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గుజరాత్‌లో 1992లో ఇలాంటి కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారని అది మంచి ఫలితాలు ఇస్తోందని కేబినెట్‌కు అధికారులు వివరించినట్టు చెప్పారు. వైయస్సార్‌ కడప జిల్లా వేంపల్లెలో కొత్త ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయకుమార్ రెడ్డి, అదనపు సంచాలకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Just In...