Published On: Wed, Feb 13th, 2019

రాష్ట్ర వ్యవసాయ మండలి ఏర్పాటు

* మంత్రి మండలి నిర్ణయం

* ప్రతి రైతు కుటుంబానికి రూ.10వేలు

* ప్రతి డ్వాక్రా మహిళకు స్మార్ట్ ఫోన్

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర వ్యవసాయ మండలి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం ఉదయం సచివాలయంలో సమావేశమైన మంత్రి మండలి నిర్ణయించింది. సమావేశం అనంతరం సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ మంత్రి మండలి నిర్ణయాలను వివరించారు. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు సమగ్ర విధానం రూపొందించడానికి, వ్యవసాయ, ఉద్యానవనాల విద్య క్రమబద్ధీకరణకు ఉద్దేశించి ఈ మండలి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ తరహా మండలిలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఇకపై అగ్రికల్చర్, హార్టీకల్చర్ ప్రాక్టీషనర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరన్నారు. వీరి సర్వీసులను పర్యవేక్షించే వ్యవస్థ ఇప్పటివరకు లేదన్నారు. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు. వ్యవసాయ విద్య మరింత నాణ్యత, నైపుణ్యత, సాంకేతికతతో కూడిన విధంగా చేయడానికి ఈ మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వ్యవసాయ విద్యలో డిగ్రీ పూర్తి చేసిన వారి సర్టిఫికేట్లు పరిశీలించి నకిలీ సర్టిఫికేట్లను ఏరివేసే కార్యక్రమం కూడా మండలి చేపడుతుందన్నారు. వ్యవసాయ కోర్సులను నిర్వహించే కళాశాలలకు సరైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా సక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నారా లేదా సర్టిఫికేట్లు సక్రమంగా ఇస్తున్నారా లేదా తదితర అంశాలను తనిఖీ చేసే పూర్తి అధికారం వ్యవసాయ మండలికి ఉంటుందని, ఇది చట్టబద్ధత కలిగి  ఉంటుందని వివరించారు. ప్రభుత్వ గుర్తింపు పొందే కళాశాలలను ఈ మండలి సిఫారసు చేస్తుందని చెప్పారు. వ్యవసాయ ఉద్యాన విద్యలో ప్రమాణాలు మరింత పెరగడానికి కొత్తగా ఏర్పాటయ్యే మండలి ప్రత్యేక దృష్టిసారిస్తుందన్నారు.  అందరికీ ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రతి డ్వాక్రా మహిళకు స్మార్ట్ ఫోన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సిమ్ కార్డుతో పాటు 3 ఏళ్లు కనెక్టివిటీ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.  రాష్ట్రంలో 94 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నట్లు ఆయన చెప్పారు.  ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి కేంద్రం ఇచ్చే రూ.6వేలతో కలిపి రూ.10 వేలు  ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే కేంద్ర నిబంధన ప్రకారం 5 ఎకరాల లోపు వారికి మాత్రమే రూ.6 వేలు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఇస్తుందని చెప్పారు. కౌలు రైతులకు కూడా ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆ శాఖ అధికారులు విధివిధానాలు రూపొందిస్తారని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 76.21 లక్షల కమతాలు ఉన్నాయని,  5 ఎకరాల కమతాల వారు 60 లక్షల మంది రైతులు ఉన్నారని వివరించారు. ఫిబ్రవరి చివరలోనే ‘అన్నదాత సుఖీభవ’ చెక్కుల పంపిణీ చేస్తామన్నారు.  రైతు రుణ మాఫీ  చెల్లింపులు కూడా వెంటనే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కుటుంబానికి రూ.10వేలు చొప్పున ఇవ్వడం ద్వారా రైతులకు మొత్తం రూ.7,621 కోట్ల లబ్ది చేకూరుతుందని చెప్పారు.
                గ్రామ పంచాయతీలలోని కంటింజెన్సీ ఉద్యోగుల జీతాలు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు.  1998లో డీఎస్సీ లో అర్హత పొందిన 36 మందిని సెకండరీ గ్రేడ్ టీచర్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాగే, 2008లో డీఈడీ, బీఈడీ  అర్హతల విషయంలో అనర్హులై పెండింగ్‌లో ఉన్న వారికి కూడా కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించే విషయాన్ని పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.  1983-96 మధ్యలో నియమితులైన స్పెషల్ టీచర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, భాషా పండితులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయించిందన్నారు. గత మంత్రి మండలి సమావేశంలో 31 ఆస్పత్రులలో పడకలను పెంచాలని నిర్ణయించగా, ఈసారి మరో 22 ఆస్పత్రుల స్థాయి పెంచాలని, ఐఏఎస్ అధికారులు, ఎన్జీవోలు, ఉద్యోగులకు ఇళ్ల ప్లాట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జర్నలిస్టులకు కూడా అమరావతిలో నామమాత్రపు ధరకు 30 ఎకరాలు ఇవ్వాలని, డబ్బు మొత్తం రెండేళ్లలో మూడు వాయిదాలలో చెల్లించడానికి అవకాశం కల్పించారని,  మొదటి వాయిదా చెల్లించిన వెంటనే భూమిని స్వాధీనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 9 పశుసంవర్థక పాలిటెక్నిక్‌లు, 9 ఫిషరీస్ పాలిటెక్నిక్‌ల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు. ఒక్కో కళాశాలలో 50 సీట్లు ఉంటాయి. వచ్చే విద్యా సంవత్సరం (2019-20) నుంచి ఈ కళాశాలలు ప్రారంభం అవుతాయన్నారు. ఢిల్లీ ధర్మపోరాట దీక్షకు చేసిన ఖర్చు (రైలుకు రూ.1.23 కోట్లు కాగా, ఏపీ భవన్‌లో ఖ‌ర్చు రూ.1.60 కోట్లు) మొత్తం రూ.2.83 కోట్లు మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు.
వక్కలిగ రిజర్వేషన్ల పరిధి చిత్తూరు వరకు పెంపు.. 
బీసీ(బి)లో ఉన్న వక్కలిగ/కుంచటిగ సామాజిక వర్గానికి ఇచ్చే రిజర్వేషన్ చిత్తూరు జిల్లాలో వున్న వారికి కూడా వర్తింపు చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో ఈ కులాల జనాభా 5 లక్షల  మంది అని తెలిపారు. ఎక్కువ మంది అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతంలో ఉన్నారని చెప్పారు. ఇంతవరకు పరిశ్రమల శాఖలో వున్న లిడ్‌క్యాప్ ఇకపై సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ పరిధిలో పనిచేస్తుందన్నారు. సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) పరిధిలో ఉన్న సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీలో ఒక గెజిటెడ్ లైబ్రేరియన్ పోస్టు, 78 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులను మంజూరు చేస్తూ మండలి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వీటితో పాటు 9 సీనియర్ అసిస్టెంట్స్, 28 డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 28మంది శాంప్లింగ్ అసిస్టెంట్ పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించాలని నిర్ణయించామన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు హయాంలో 1954లో వైకుంఠపురం ఎత్తిపోతలకు శంకుస్థాపన చేశారని, అప్పటి నుంచి డెల్టా ప్రజల ఆకాంక్ష అని దానిని నెరవేర్చడంపై ఆయకట్టు రైతాంగంలో హర్షం వ్యక్తమవుతోందని తెలిపారు. దీనిపై మంత్రి మండ‌లి సీఎం చంద్రబాబు నాయుడును అభినందిస్తూ తీర్మానం చేసినట్లు మంత్రి కాలవ శ్రీనివాసులు వెల్ల‌డించారు.

Just In...