Published On: Mon, Nov 20th, 2017

రాహుల్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు

సెల్ఐటి న్యూస్‌, దిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించే ముహూర్తం ఖరారైంది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన సోమవారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం నిర్వ‌హించారు. సోనియా గాంధీ నివాసంలో జ‌రిగిన ఈ సమావేశంలో అధ్యక్ష ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారు చేశారు. డిసెంబర్‌ 1 నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ జరగనుంది. పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డిసెంబర్‌ 1న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. డిసెంబర్‌ 4న నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్‌ 16న ఎన్నికలు నిర్వహించి.. 19న ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే రాహుల్‌ గాంధీ తప్ప ఇంకేవరూ నామినేషన్‌ వేయకపోతే.. నామినేషన్ల పరిశీలన రోజే రాహుల్‌ను అధ్యక్షుడిగా ప్రకటించనున్నారు. డిసెంబర్‌ 5న రాహుల్‌ ఏకగ్రీవ ఎన్నిక జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడిగా రాహుల్‌ బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 2013లో రాహుల్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విష‌యం విధిత‌మె.

Just In...