Published On: Tue, Sep 10th, 2019

రివర్స్ ఎన్నికలు వస్తే బాగుండు అనుకుంటున్నారు…

* రాష్ట్రం ప్రభుత్వ నిర్ణయాలపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు

సెల్ఐటి న్యూస్‌, గుంటూరు: రాష్ట్రం ప్రభుత్వ నిర్ణయాలపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి దానికి రివర్స్ టెండరింగ్ చేపట్టడాన్ని ఆయ‌న తప్పుపట్టారు. రివర్స్‌ టెండరింగ్‌తో రాష్ట్రం ఏమవుతుందో తెలియదని, రివర్స్ ఎన్నికలు వస్తే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్ర‌బాబు మాట్లాడుతూ మూడేళ్లలోనే జమిలి ఎన్నికలు వస్తాయని, అప్పుడు వైసీపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ హయాం కంటే ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఊళ్లపై పడి దాడులు చేస్తూ రాక్షసులను మించి ప్రవర్తిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులపై 565 కేసులు అక్రమంగా నమోదు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ ఇంత అనాగరిక పరిస్థితులు లేవన్నారు. గత ప్రభుత్వ అవినీతి ఇంకా దొరకలేదా అంటూ అధికారులను, మంత్రులను కోప్పడే స్థితిలో సీఎం ఉన్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు.

Just In...