Published On: Thu, Jan 7th, 2021

రూ.10 కోట్ల వ్యయంతో వస్త్ర ప్రాసెసింగ్ యూనిట్

* ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగమోహనరావు

విజ‌య‌వాడ, సెల్ఐటి న్యూస్‌‌: ఆప్కోను మరింత లాభదాయక సంస్ధగా మలిచే క్రమంలో నూతనంగా నెల్లూరు లేదా గుంటూరులలో వస్త్ర ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంస్ధ (ఆప్కో) ఛైర్మన్  చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు తెలిపారు. దాదాపు పదికోట్ల రూపాయల వ్యయంతో దీనిని ఏర్పాటు చేయటం ద్వారా కనీసం ఐదు వందల మంది ఉపాధి పొందగలుగుతారన్నారు. విజయవాడ ఆప్కో కేంద్ర కార్యాలయంలో గురువారం ఉన్నత స్దాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాల ఉపసంచాలకులు, డివిజినల్ మార్కెటింగ్ అధికారులు సమావేశానికి హాజరు కాగా సంస్ధ ఉన్నతికి సంబంధించి చిల్లపల్లి దిశా నిర్ధేశం చేసారు. ఆప్కో నిర్వహణ సంచాలకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంస్ధ తాజా స్దితి గతులను, చేపట్టవలసిన నూతన చర్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.  ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ రిటైల్ విక్రయాలను పెంపొందించుకునే క్రమంలో ఆప్కో వస్త్రాలలో ఆధునికతను చూపేలా పూర్తి స్దాయిలో మార్పులు చేయవలసి ఉందన్నారు. యువత ఆలోచనలను అందిపుచ్చుకునేలా డిజైన్లను మార్చాలని ఆదేశించారు. ఉత్పత్తి దారులకు, కొనుగోలు దారులకు మధ్య అంతరాన్నితగ్గిస్తూ అత్యధిక వినియోగం ఉన్న వస్త్ర శ్రేణినే ఉత్పత్తి చేసేలా చేనేత సంఘాలను సమాయత్తం చేయవలసి ఉందన్నారు. ప్రతి ఒక్క చేనేత కార్మికుడికీ మూడు పూటలా పని చూపి, వారు కడుపునిండా అన్నం తినగలగేలా చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్యేయమని తదనుగుణంగా అధికార యంత్రాంగం సహకరించాలని కోరారు. పట్టు పరిశ్రమ అభివృద్ది కోసం మల్ బార్ సాగును ప్రోత్సహించాలన్నది సిఎం ఉద్దేశ్యమని, ఉద్యానవన శాఖతో సమన్వయం చేసుకుని విశాఖ చుట్టుపక్కల లక్ష ఎకరాలను సాగు చేయించాలన్న లక్ష్యంతో  ముందడుగు వేస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్ ను సైతం అక్కడే ఏర్పాటు చేయటం ద్వారా పట్టు పరిశ్రమ రవాణా నష్టాలను అధికమించగలుగుతుందని చిల్లపల్లి పేర్కోన్నారు. కార్యక్రమంలో సంస్ధ ఎండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జనరల్ మేనేజర్లు రమేష్ , సుదర్శన రావు, చేనేత జౌళి శాఖ అదనపు సంచాలకులు నాగేశ్వరరావు, సంయిక్త సంచాలకులు కన్నబాబు, వీవర్స్ సర్వీస్ సెంటర్ సంచాలకులు హిమజ్ కుమార్ , 13 జిల్లాల ఎడిలు, ఏడు డివిజన్ల మార్కెటింగ్ అధికారులు, కేంద్ర కార్యాలయ సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు.

 

Just In...