Published On: Thu, Mar 5th, 2020

రూ.204.75 కోట్ల అంచనాలతో వేసవిలో ముందస్తు ప్రణాళిక

* రాష్ట్ర వ్యాప్తంగా 6352 హ్యాబిటేషన్‌లకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా

* రూ.20.19 కోట్లతో 2055 హ్యాబిటేషన్‌ల‌లో పశువుల కోసం తాగునీటి సరఫరా

* రాష్ట్ర మంత్రులు బుగ్గ‌న‌, పెద్దిరెడ్డి, పిల్లి సుభాష్‌

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌:  రానున్న వేసవిలో రాష్ట్రంలో మంచినీటి ఎద్దడిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక శాఖామంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, రెవెన్యూ శాఖామంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ల ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పిఆర్ కమిషనర్ గిరిజా శంకర్, విపత్తుల నిర్వహణ, రెవెన్యూ ఎక్స్ అఫీషియో అడిషనల్ సెక్రటరీ కె.కన్నబాబు, ఆర్ డబ్ల్యు ఎస్ ఇఎన్ సి కృష్ణారెడ్డి, సిఇ రాజేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వచ్చే వేసవిలో రాష్ట్రంలోని పలు హ్యాబిటేషన్ లలో ఎదురయ్యే తాగునీటి సమస్యను నివారించేందుకు గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ రూపొందించిన ముందస్తు ప్రణాళికపై అధికారులతో మంత్రులు చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8570 హ్యాబిటేషన్లలో పలు స్కీంల కింద మంచినీటిని అందిస్తున్నామని ఆర్ డబ్ల్యుఎస్ అధికారులు వివరించారు. ఈ ఏడాది వేసవి ప్రణాళికలో భాగంగా మొత్తం 204.75 కోట్ల రూపాయలతో ఈ హ్యాబిటేషన్ లలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందిన తెలిపారు. రాష్ట్రంలోని 6352 హ్యాబిటేషన్ లకు రూ.165.81 కోట్లతో మంచినీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సి అవసరం వుందని అన్నారు. అలాగే 2055 హ్యాబిటేషన్ లలో పశువుల కోసం రూ.20.19 కోట్లతో తాగునీటిని ట్యాంకర్ల ద్వారా అందించాల్సి వుందని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని 2440 బోర్ బావులకు ఫ్లషింగ్ చేయడం, 968 బోరు బావులను మరింత లోతు చేయడం, 325 ఎస్ఎస్ ట్యాంక్ లలో రూ. 5.80 కోట్లతో పూడిక తీసే కార్యక్రమాలు చేపట్టాల్సి వుందని వివరించారు.
జిల్లాల వారీగా గుర్తించిన హ్యాబిటేషన్లు, అంచనా వ్యయం:
————————————————————————–
జిల్లా   హ్యాబిటేషన్లు  వ్యయం (రూ.కోట్లలో…)
————————————————————————–
శ్రీకాకుళం  150   1.71
విజయనగరం  45   0.03
విశాఖపట్నం  209   0.27
తూర్పు గోదావరి  388   0.63
పశ్చిమ గోదావరి  200   1.68
కృష్ణా   577   9.85
గుంటూరు  326   12.12
ప్రకాశం   980   52.95
నెల్లూరు   466   11.40
చిత్తూరు   3103   52.49
కడప   1064   31.60
అనంతపురం  498   17.97
కర్నూలు  236   12.07
————————————————————————————
వైఎస్ఆర్ సుజల పథకంకు రూ.46.56 కోట్లు
రాష్ట్రంలో రూ.46.56 కోట్లతో వైఎస్ఆర్ సుజల పథకం కింద అవసరమైన చోట్ల తాగునీటిని అందించేందుకు సిద్దంగా వున్నట్లు ఆర్ డబ్ల్యుఎస్ అధికారులు వెల్లడించారు. దీనికింద శ్రీకాకుళం జిల్లాలో అయిదు క్లస్టర్ లకు రూ.31 లక్షలు, విశాఖపట్నం జిల్లాలో ఏడు క్లస్టర్ లకు రూ.61 లక్షలు, తూర్పు గోదావరిజిల్లాలో మూడు క్లస్టర్ లకు రూ. 40 వేలు, కృష్ణాజిల్లాలో నాలుగు క్లస్టర్ లకు రూ.25 లక్షలు, గుంటూరు జిల్లాలో అయిదు క్లస్టర్ లకు రూ.2.69 కోట్లు, ప్రకాశం జిల్లాలో పద్దెనిమిది క్లస్టర్ లకు రూ.37 లక్షలు, నెల్లూరు జిల్లాలో పద్నాలుగు క్లస్టర్ లకు రూ.16.68 కోట్లు, చిత్తూరు జిల్లాలో పన్నెండు క్లస్టర్ లలో రూ.32 లక్షలు, కడపజిల్లాలో అయిదు క్లస్టర్ లలో రూ.90 లక్షలు, అనంతపురం జిల్లాలో ఇరవై రెండు క్లస్టర్ లకు రూ.18.87 కోట్లు, కర్నూలు జిల్లాలో ఎనిమిది క్లస్టర్ లకు రూ.6.34 కోట్లతో కేటాయించాల్సి వుందిని అధికారులు వెల్లడించారు. దీనితో పాటు స్టేట్ డెవలప్ మెంట్ స్కీం కింద రాష్ట్రం వ్యాప్తంగా రూ.55.86 కోట్లతో సోలార్ స్కీంలను కూడా ఇప్పటికే ప్రారంభించామని, వీటికి సంబంధించిన పనులు కూడా దాదాపు పూర్తయ్యే స్థితిలో వున్నాయని వెల్లడించారు. మంచినీటి పనులకు గానూ పెండింగ్ లో వున్న బిల్లులను వెంటనే ఆర్థిక శాఖ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Just In...