Published On: Tue, Sep 25th, 2018

రూ.727 కోట్లతో ఏపీలో సోలార్ బ్యాటరీ తయారీ ప్రాజెక్ట్

* ఈడీబీతో ట్రైటన్ సోలార్ ఒప్పందం

సెల్ఐటి న్యూస్‌, న్యూయార్క్ (అమ‌రావ‌తి): ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు సౌర బ్యాటరీలు చెందిన ప్రాజెక్ట్ వైపు దృష్టి సారించింది. సౌర విద్యుత్ పరికరాల తయారీలో పేరేన్నిక‌గ‌న్న ట్రైటన్ సోలార్ ఏపీలో సోలార్ బ్యాటరీ తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అధికారుల బృందంతో ట్రైటన్ సోలార్ సంస్థ చర్చలు జరిపింది. ప్రాజెక్టు ఏర్పాటుకు ఆ సంస్థ చైర్మన్ హిమాంశు పటేల్, మేనేజింగ్ పార్టనర్ నంద శాండిల్య, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అజ‌య్ జైన్, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణ కిషోర్ మధ్య ముఖ్యమంత్రి సమక్షంలో అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు వంద మిలియన్ల యూఎస్ డాలర్లు అంటే సుమారు 727 కోట్ల 84 లక్షల రూపాయలు అంచనాతో పెట్టుబడిని దశలవారీగా పెడతామని ట్రైటన్ సోలార్ సంస్థ పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఈ ప్లాంట్ ఏర్పాటుకు 100-200 ఎకరాల భూమి అవసరం అవుతుందని ఆ సంస్థ ప్రతిపాదించింది. ఈ సౌర బ్యాటరీని తయారు చేయడానికి నానో టెక్నాలజీ-లిథియం పాలిమర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని, దీనిలో భాగంగా సౌర బ్యాటరీలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటాయని ముఖ్యమంత్రి అన్నారు. ఫ‌ణ‌లితంగా కాలుష్యం తగ్గడమే కాకుండా, ప్రజలకు లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామమని, నవ్యంధ్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.

Just In...