Published On: Mon, May 13th, 2019

రెండోసారీ విచారణకు రవిప్రకాశ్‌ గైర్హాజరు

* 41ఏ సీఆర్పీసీ నోటీసు ఇచ్చేందుకు సిద్ధమైన పోలీసులు

సెల్ఐటి న్యూస్‌, హైదరాబాద్‌: టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ చుట్టూ సైబరాబాద్‌ పోలీసుల ఉచ్చు బిగుస్తోంది. టీవీ 9 సంస్థలో భాగస్వామిగా ఉన్న అలంద మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో నెలకొన్న వాటాల వివాదంలో రవిప్రకాశ్‌పై సైబరాబాద్‌ పోలీసులు రెండు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. సంస్థ నిర్వహణను అడ్డుకునే ఉద్దేశంతో రవిప్రకాశ్‌.. మరికొందరితో కలిసి ఫోర్జరీ పత్రాలు సృష్టించారంటూ అలంద సంస్థ డైరెక్టర్‌ పి.కౌశిక్‌రావు పోలీసులకు రెండు ఫిర్యాదులు చేశారు. వాటిపై పోలీసులు రవిప్రకాశ్‌తోపాటు సినీనటుడు శివాజీ, టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తిపై కేసులు నమోదుచేశారు. వీటి విచారణలో పోలీసులు ఇప్పటికే ఈ ముగ్గురికి 160 సీఆర్పీసీ నోటీసులు జారీచేయగా రవిప్రకాశ్‌, శివాజీ స్పందించలేదు. ఈ క్రమంలో ఆదివారం విచారణకు హాజరుకావాలంటూ రెండోసారీ నోటీసులిచ్చినా రవిప్రకాశ్‌ హాజరుకాలేదు. దీంతో ఈసారి 41ఏ సీఆర్పీసీ నోటీస్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఏదైనా కేసులో వాంగ్మూలం అవసరమైతే పోలీసులు నిందితులనే కాకుండా సాక్ష్యులకూ 160 సీఆర్పీసీ నోటీసులిస్తారు. కానీ నిందితుడిగా పరిగణించదగ్గ ఆధారాలున్నాయని నిర్ధారించుకున్నాకే 41ఏ సీఆర్పీసీ నోటీస్‌ ఇస్తారు. అంటే రవిప్రకాశ్‌ చుట్టూ ఉచ్చు బిగించేందుకు అవసరమైన ఆధారాల్ని పోలీసులు సేకరించి ఉంటారనే చర్చ జరుగుతోంది. ఈ నోటీసులకూ రవిప్రకాశ్‌ స్పందించకపోతే అరెస్ట్‌చేసే అవకాశముంటుంది. శివాజీ విషయంలోనూ ఇదేరీతిలో వ్యవహరించే అవకాశమున్నట్లు సమాచారం.

Just In...